సోలార్‌పై సుంకాల మోత | US imposes 126percent tariff on import of Indian solar panels | Sakshi
Sakshi News home page

సోలార్‌పై సుంకాల మోత

Feb 26 2026 5:22 AM | Updated on Feb 26 2026 5:22 AM

US imposes 126percent tariff on import of Indian solar panels

దేశీ ఉత్పత్తులపై 126 శాతం అమెరికా టారిఫ్‌లు

10 శాతం టారిఫ్‌కు ఇది అదనం 

భారత్‌ సబ్సిడీలు ఇస్తున్నట్టు ఆరోపణ 

ఇండోనేసియా, లోవాస్‌ ఉత్పత్తులపైనా వడ్డింపు

న్యూఢిల్లీ: భారత సోలార్‌ ఉత్పత్తులపై అమెరికా చర్యలకు దిగింది. భారత్‌ నుంచి వచ్చే సోలార్‌ విడిభాగాలపై 125.87 శాతం ప్రాథమిక కౌంటర్‌ వెయిలింగ్‌ (వ్యతిరేకంగా) సుంకం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఉత్పత్తులకు భారత్‌ అనుచితంగా సబ్సిడీలు సమకూరుస్తున్నట్టు ఆరోపించింది. భారత్‌తోపాటు ఇండోనేసియా, లావోస్‌ నుంచి వచ్చే క్రిస్టలిన్‌ సిలికాన్‌ ఫొటోవోల్టాయిక్‌ సెల్స్‌పై (సోలార్‌ మాడ్యూళ్లలో అసెంబుల్‌ అయినా, కాకపోయినా) సుంకాలు విధిస్తూ అమెరికా వాణిజ్య శాఖ 24న ఆదేశాలు జారీ చేసింది. 

అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన 10 శాతం సార్వత్రిక సుంకాలకు ఇది అదనమని పేర్కొంది. ఈ దేశాల నుంచి చౌకగా వస్తున్న దిగుమతులపై యాంటీ డంపింగ్‌ డ్యూటీ విచారణలు సైతం నిర్వహించనున్నట్టు తెలిపింది. భారత్‌ నుంచి అమెరికాకు సోలార్‌ ఎగుమతులు 2022లో 83.86 మిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2024లో 792.6 మిలియన్‌ డాలర్లకు పెరిగినట్టు ప్రస్తావించింది. విదేశీ చౌక ఉత్పత్తుల నుంచి దేశీ పరిశ్రమను కాపాడుకునేందుకు ఈ చర్యకు ఉపక్రమించింది. సంప్రదాయ విద్యుత్‌ వనరులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూలమైన సోలార్, పవన ఇంధన వనరులపై కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి సారించడం తెలిసిందే.

 సోలార్‌ విడిభాగాల కోసం చైనా తదితర దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించి, దేశీయంగానే వాటి తయారీని ప్రోత్సహించేందుకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) సైతం ప్రకటించింది. దీంతో 26.6 గిగావాట్ల సోలార్‌ పీవీ మాడ్యూళ్లు, 10.5 గిగావాట్ల సోలార్‌ పీవీ సెల్స్, 2 గిగావాట్ల ఇన్‌గాట్‌ వేఫర్‌ తయారీ సామర్థ్యాలు దేశీయంగా ఏర్పాటు కావడం గమనార్హం. దీంతో 2023–24లో 4.35 బిలియన్‌ డాలర్లుగా ఉన్న దిగుమతులు 2024–25లో 2.15 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి.  

ప్రభావం పరిమితమే.. 
భారత సోలార్‌ ఉత్పత్తులపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం పరిమితమేనని విక్రమ్‌ సోలార్, వారీ ఎనర్జీస్, ప్రీమియర్‌ ఎనర్జీస్‌ తెలిపాయి. ‘‘యూఎస్‌ ఏడీ/సీవీడీ సుంకాలు ప్రత్యేకంగా భారత తయారీ సెల్స్‌కు ఉద్దేశించినవి. అమెరికా ఆర్డర్లకు సంబంధించి చేసే సరఫరాల్లో భారత సెల్స్‌ను వినియోగించడం లేదు. తక్కువ టారిఫ్‌లున్న భౌగోళిక ప్రాంతాల నుంచి వాటిని సమకూర్చుకుంటున్నాం. కనుక ఈ సుంకాల వల్ల పడే ప్రత్యక్ష ప్రభావం పరిమితం’’అని విక్రమ్‌ సోలార్‌ సీఎండీ జ్ఞానేష్‌ చౌదరి స్పష్టం చేశారు. దేశీయంగా డిమాండ్‌ పుంజుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

 ఇండియన్‌ ఆయిల్‌–ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ నుంచి ఇటీవలే 378.75 మెగావాట్ల మాడ్యూళ్ల ఆర్డర్‌ను గెలుచుకోవడాన్ని ప్రస్తావించారు. ప్రస్తుత యూఎస్‌ ఆర్డర్ల సరఫరాలపై తాజా సుంకాల ప్రభావం ఉంటుందని భావించడం లేదని వారీ ఎనర్జీస్‌ గ్రూప్‌ హెడ్‌ అభిõÙక్‌ పరీక్‌ తెలిపారు. మరోవైపు వారీ ఎనర్జీస్‌ అమెరికాలోనే తన సోలార్‌ సెల్స్‌ తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుకునే ప్రణాళికతోనూ ఉంది. ‘‘మా వ్యాపారంలో ఎగుమతుల వాటాను పూర్తిగా సున్నాకు తగ్గించుకున్నాం. కనుక అమెరికా సుంకాల ప్రభావం మాపై ఏమీ ఉండదు’’అని ప్రీమియర్‌ ఎనర్జీస్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ వినయ్‌ రస్తోగి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement