చండీఘడ్: హర్యానా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ రూ. 590 కోట్ల కుంభకోణం కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారులు తీగ లాగితే కుంభకోణం డొంకంత కదులుతోంది. తాజాగా, ఈ కేసులో ఇద్దరు మాజీ ఉద్యోగులు, నలుగురు బయటి వ్యక్తులను హర్యానా రాష్ట్ర విజిలెన్స్, అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు.
పంచకులాలో ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏఎస్ చావ్లా మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్కామ్‌కి మాస్టర్ మైండ్స్‌గా మాజీ మేనేజర్లు రిభవ్ రిషి, అభయ్ కుమార్‌లను గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేసిన ఈ కేసులో తాజాగా రిభవ్ రిషి, అభయ్ కుమార్, స్వాతి సింగ్లా, అభిషేక్ సింగ్లాలను అదుపులోకి తీసుకున్నారు.
బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడిగా రిభవ్ రిషి అనే మాజీ మేనేజర్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో పనిచేస్తున్నప్పటికీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో పనిచేసిన సమయంలోనే ఈ స్కామ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనతో పాటు అభయ్ కుమార్, స్వాతి సింగ్లా, అభిషేక్ సింగ్లా అనే వ్యక్తులు కూడా ఈ మోసంలో భాగమని విచారణలో తేలింది.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో హర్యానా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌తో పాటు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ను కూడా ప్రభుత్వ లావాదేవీల నుండి తొలగించింది. అన్ని ప్రభుత్వ నిధులను ఇతర బ్యాంకులకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.
బ్యాంక్ కుంభకోణం యాజమాన్యానికి తలొంపు కాగా.. బ్యాంక్ షేర్ మార్కెట్‌పై కూడా తీవ్రంగా పడింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు ఒక్క రోజులోనే 20 శాతం పడిపోయాయి. పెట్టుబడిదారుల సంపదలో రూ.14వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగినట్లు అంచనా.


