జమ్మూకశ్మీర్‌లో భారీ హవాలా రాకెట్‌  | Hawala racket busted in Jammu Kashmir, 8000 mule accounts frozen | Sakshi
Sakshi News home page

జమ్మూకశ్మీర్‌లో భారీ హవాలా రాకెట్‌ 

Feb 16 2026 5:43 AM | Updated on Feb 16 2026 5:43 AM

Hawala racket busted in Jammu Kashmir, 8000 mule accounts frozen

8 వేల నకిలీ బ్యాంకు ఖాతాలు సీజ్‌

న్యూఢిల్లీ/శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో భారీ హవాలా రాకెట్‌ వ్యవస్థను అధికారులు ఛేదించారు. ప్రపంచవ్యాప్త స్కామ్‌ నెట్‌వర్క్‌లకు ఆర్థిక వెన్నెముకగా నిలుస్తూ, జమ్మూకశ్మీర్‌లో విస్తరిస్తున్న ’మ్యూల్‌ అకౌంట్స్‌’ దందాను బయటపెట్టారు. జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా నిర్వహిస్తున్న 8 వేలకు పైగా మ్యూల్‌ ఖాతాలను అధికారులు సీజ్‌ చేశారు. మనీలాండరింగ్‌ నేరగాళ్లు ఈ వ్యవస్థను మూడేళ్లుగా నడిపిస్తున్నట్లు గుర్తించారు. 

ఈ ఖాతాల ద్వారా మళ్లించిన నిధులను వేర్పాటువాదం, దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం మళ్లించి ఉంటారని అనుమానిస్తున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును చట్టబద్ధమైనదిగా చూపించడానికి ఇతరుల బ్యాంక్‌ ఖాతాలను ఉపయోగించడమే ’మనీ మ్యూలింగ్‌’. ఈ ఖాతాలను నిర్వహించే వారిని ’మనీ మ్యూల్స్‌’ అంటారు. ఖాతాదారులకు తెలియకుండా లేదా వారికి కొంత కమీషన్‌ ఆశచూపిన నేరగాళ్లు తమ గుర్తింపు బయటపడకుండా ఈ ఖాతాలను నిర్వహిస్తున్నారు. 

2017లో ఎన్‌ఐఏ కశ్మీర్‌లోని ఉగ్రవాద సంస్థల నిధుల సేకరణ నెట్‌వర్క్‌ను బట్టబయలు చేయడంతో అక్రమార్కులు ఈ ‘డిజిటల్‌ హవాలా’మార్గాన్ని ఎంచుకున్నారని అంటున్నారు. ఈ ఖాతాలను సైబర్‌ నేరాల గొలుసులో అత్యంత బలహీనమైన, అత్యంత కీలకమైన లింక్‌ అని వారు చెబుతున్నారు. ఎందుకంటే నకిలీ ఖాతాలు లేకుండా, దోచుకున్న సొమ్మును జాడ దొరకని క్రిప్టోకరెన్సీ రూపంలోకి మార్చడం అసాధ్యమని పేర్కొంటున్నారు. డబ్బు ఆశతో నేరగాళ్లకు తమ బ్యాంకు ఖాతాలను అప్పగించే వారు బాధితులు మాత్రమే కాదు, నేరగాళ్లకు వంతపాడుతున్నట్లేనని అధికారులు హెచ్చరిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement