బాబు బంటు టెరాసాఫ్ట్ ఎండీపై కేసూ ఇక క్లోజ్..!
ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సీఐడీ కార్యాచరణ
అడ్డగోలుగా కాంట్రాక్టు కొల్లగొట్టి టెరాసాఫ్ట్ టెర్రర్
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కేసుల అడ్డగోలు మూసివేతలో భాగంగా మరో కుట్ర అంకానికి సీఐడీ తెర తీసింది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన ఫైబర్ నెట్ కుంభకోణాల పరంపరలో ఇంకో కేసు మాఫీకి రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న ఫైబర్ నెట్ ప్రాజక్టు టెండర్ల కేసును సీఐడీ ఇటీవల మూసి వేసింది.
కాగా ప్రస్తుతం చంద్రబాబు సన్నిహితుడు టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ, ఆయన ముఠా దోపిడీ కేసును అడ్డగోలుగా మూసి వేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సీఐడీ బాస్ తమ అధికారులను రంగంలోకి దించారు.
ఎల్ 1ను బెదిరించి.. అడ్డగోలుగా కాంట్రాక్టు కొల్లగొట్టి..
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ టెండర్లను టెరాసాఫ్ట్ సంస్థ ఏకపక్షంగా దక్కించుకుని యథేచ్ఛగా అవినీతికి పాల్పడిన విషయం తెలిసిందే. అప్పట్లో ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా ఫైబర్ కేబుళ్ల పనులను దక్కించుకున్న టెరాసాఫ్ట్ కంపెనీ అనంతరం సెటాప్ బాక్సుల టెండర్లకు గురి పెట్టింది. ఇతర సంస్థలు బిడ్లు వేయకుండా అడ్డుకోవాలని భావించింది.
కాగా దాసన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అనూహ్యంగా పోటీలో నిలిచింది. రూ.500 కోట్ల విలువైన సెటాప్ బాక్సుల టెండర్లలో ఆ సంస్థ ఎల్ 1గా నిలిచింది. నిబంధన ప్రకారం దాసన్ ఇండియా లిమిటెడ్‌కు టెండరు కేటాయించాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుడైన టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ అందుకు ఏమాత్రం సమ్మతించలేదు. ఆ టెండరూ తమకే దక్కాలని పట్టుబట్టారు. దీంతో ఆయన వర్గీయులు దాసన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులను బెదిరించారు.
స్వచ్ఛందంగా కాంట్రాక్టు వదలుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆ కంపెనీ ప్రతినిధి రవిని బెదిరింపులతో బెంబేలెత్తించారు. దీనిపై దాసన్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెబతూ చేతులెత్తేశారు. దీంతో చేసేదేమీ లేక దాసన్ లిమిటెడ్ మౌనంగా ఉండిపోవాల్సి వచి్చంది. చివరకు ఆ కాంట్రాక్టును టెరాసాఫ్ట్ కంపెనీ దక్కించుకుంది.
అనంతరం దాసన్ ఇండియా లిమిటెడ్ ఈ విషయంపై సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఆ కంపెనీ లాజిస్టిక్ మేనేజర్ పోతుల సునీల్ కుమార్ ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. దాంతో టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ, ఆ కంపెనీ ఈడీ తుమ్మల గోపీచంద్‌లతోపాటు ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఈడీ(పైనాన్స్) వెంకటేశ్వరరావు, జీఎం (మార్కెటింగ్) కెంబూరు సతీశ్, ఏజీఎం గిరి ప్రసాద్, పూర్వ ఈడీ రామారావు తదితరులను నిందితులుగా పేర్కొన్నారు.
కేసు క్లోజ్ చేయండి
కాగా 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కేసు విచారణను సీఐడీ అటకెక్కించింది. తాజాగా ఆ కేసును క్లోజ్ చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశాలను అమలు చేసేందుకు రంగంలోకి దిగారు. ఈమేరకు సీఐడీ బాస్ ఈ కేసు దర్యాప్తు అధికారికి కర్తవ్య బోధ చేశారు. దీంతో ఆ కేసును మూసివేసే దిశగా దర్యాప్తు అధికారి చర్యలు వేగవంతం చేశారు.
ఈ నేపథ్యంలోనే గతంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన ఆ కంపెనీ లాజిస్టిక్ మేనేజర్ పోతుల సునీల్ కుమార్ ఆ సంస్థ నుంచి వైదొలిగినట్టు తెలిసింది. కేసు మూసివేతకు ప్రతిబంధకాలు ఉండకూడదనే ఆయనను పంపించివేసినట్టు తెలుస్తోంది. ఇక గతంలో టెరాసాఫ్ట్ వేధింపుల బాధితులు ప్రస్తుతం సాక్ష్యం చెప్పడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాల్సిందేనని వారిని సీఐడీ అధికారులు బెదిరిస్తున్నారు.
మరోవైపు ఈ కేసుకు సంబంధించిన రికార్డులు సమర్పించాలని ఫైబర్‌నెట్ కార్పొరేషన్ అధికారులకు లేఖ రాశారు. ఆ రికార్డులు వచ్చిన తరువాత కేసును అడ్డగోలుగా మూసివేయాలని సీఐడీ భావిస్తోంది. ఈమేరకు ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’గా ముద్ర వేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలన్నది సీఐడీ ఉద్దేశం. అందుకు ప్రస్తుత ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు వత్తాసు పలుకుతారు. అనంతరం కేసు మూసివేతే తరువాయని ఫైబర్ నెట్ కార్పొరేషన్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.


