‘రైతే ఎప్పటికీ రారాజు’.. అమెరికా ఒప్పందంలో స్పష్టం! | The agreement with America will benefit the Indian agricultural sector | Sakshi
Sakshi News home page

‘రైతే ఎప్పటికీ రారాజు’.. అమెరికా ఒప్పందంలో స్పష్టం!

Feb 7 2026 1:33 PM | Updated on Feb 7 2026 1:39 PM

The agreement with America will benefit the Indian agricultural sector

న్యూఢిల్లీ: భారత్‌-అమెరికా మధ్య కుదిరిన తాజా మధ్యంతర వాణిజ్య ఒప్పందం మన దేశీయ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప ఊరటను అందించింది. ఈ ఒప్పందంలో అమెరికా.. భారతీయ ఉత్పత్తులపై విధిస్తున్న దిగుమతి సుంకాలను గతంలో ఉన్న 50 శాతం నుండి ఏకంగా 18 శాతానికి తగ్గించింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు తగ్గి, మన ఎగుమతిదారులకు భారీగా ఆర్డర్లు వచ్చే అవకాశం ఏర్పడింది. ఈ భారీ రాయితీలను పొందుతూనే, భారతదేశం అత్యంత కీలకమైన వ్యవసాయ రంగం దెబ్బతినకుండా జాగ్రత్తపడింది.

అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ తన వ్యవసాయ, పాడి పరిశ్రమ రంగాల్లో ఎటువంటి దిగుమతి రాయితీలను ప్రకటించలేదు. ముఖ్యంగా వరి, గోధుమలు, పాలు, పౌల్ట్రీ, ఇథనాల్ తదితర ఉత్పత్తులపై పన్నులను తగ్గించకుండా రక్షణ కల్పించింది. అమెరికాలో వ్యవసాయం భారీ సబ్సిడీలతో నడుస్తుండటంతో, అక్కడి నుండి తక్కువ ధరకే ఉత్పత్తులు భారత్‌కు వస్తే.. మన చిన్న , ఉపాంత రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ ముప్పును ముందుగానే గుర్తించిన కేంద్రం సుమారు 70 కోట్ల మందికి ఆధారమైన వ్యవసాయ రంగాన్ని విదేశీ కార్పొరేట్ దిగ్గజాల నుండి కాపాడగలిగింది.

భారతదేశం ప్రస్తుతం 51 బిలియన్ డాలర్ల(4.62 లక్షల కోట్లు) విలువైన వ్యవసాయ ఎగుమతులను కలిగివుంది. ఈ కొత్త ఒప్పందంతో రానున్న నాలుగేళ్లలో ఈ ఎగుమతులను 100 బిలియన్ డాలర్లకు చేర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. భారతదేశంలోని సుగంధ ద్రవ్యాలు, బియ్యం, టీ, కాఫీ, పండ్లు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందేందుకు ఈ టారిఫ్ తగ్గింపు రైతులకు ఒక వరంగా మారనుంది. దేశంలోని రైతుల జీవనోపాధికి ఎటువంటి ముప్పు కలుగకుండా.. అమెరికాతో ఈ ఒప్పందాన్ని కుదరుర్చుకోవడం భారత్‌ సాధించిన చారిత్రక విజయమని విశ్లేషకులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: ‘మేక్ ఇన్ ఇండియా’కు గ్లోబల్ బూస్ట్: ప్రధాని మోదీ

Advertisement
 
Advertisement
Advertisement