‘బడ్జెట్‌’తో బుద్ధి చెప్పిన భారత్‌.. తేరుకోని బంగ్లాదేశ్‌ | Why India slashed Bangladeshs share of neighbourhood aid in Budget? | Sakshi
Sakshi News home page

‘బడ్జెట్‌’తో బుద్ధి చెప్పిన భారత్‌.. తేరుకోని బంగ్లాదేశ్‌

Feb 3 2026 7:57 AM | Updated on Feb 3 2026 8:44 AM

Why India slashed Bangladeshs share of neighbourhood aid in Budget?

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్‌లో పొరుగు దేశం బంగ్లాదేశ్‌కు ఇచ్చే అభివృద్ధి సహాయాన్ని భారత్ భారీగా తగ్గించింది. గత ఏడాది బడ్జెట్‌లో బంగ్లాదేశ్‌కు రూ. 120 కోట్లు కేటాయించగా, ఈసారి ఆ మొత్తాన్ని సగానికి అంటే రూ. 60 కోట్లకు కుదించింది. దీని వెనుకగల కారణం ఏమిటి? మిగిలిన పొరుగు దేశాల విషయంలో ఉదారత చూపిన భారత్‌ ‘బంగ్లా’ విషయంలో ఎందుకిలా చేసింది?

భూటాన్‌కు అత్యధిక సాయం
గత కొంతకాలంగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య సఖ్యత కొరవడింది. ఢాకాలో చోటుచేసుకున్న రాజకీయ తిరుగుబాటు, ఆ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులు, దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం బడ్ఢెట్‌ కేటాయింపుల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా పొరుగు దేశాలైన భూటాన్.. భారత్‌ నుంచి రూ.2,288 కోట్లతో అత్యధికంగా లబ్ధి పొందుతుండగా, నేపాల్‌కు రూ. 800 కోట్లు, మాల్దీవులు, మారిషస్‌లకు  చెరో రూ. 550 కోట్లు కేటాయించారు.

క్షీణించిన ద్వైపాక్షిక సంబంధాలు
2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుండి భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హిందూ మైనారిటీలపై జరుగుతున్న హింసపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్థాన్‌తో సన్నిహితంగా ఉండటం గమనార్హం. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ ఇప్పటికే బంగ్లాదేశీయులకు టూరిస్ట్ వీసాలను పరిమితం చేయడమే కాకుండా, ఫిబ్రవరి 12న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో తమ దౌత్యవేత్తల కుటుంబాలను వెనక్కి పిలిపించింది. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్ ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయి, ఆ దేశంతో సంబంధాలను బలపరుచుకోవడం భారత్‌కు తీవ్ర అసంతృప్తి కలిగించింది.

క్రీడారంగానికీ పాకిన వైరం
ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా క్రీడారంగానికి కూడా పాకాయి. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుండి బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించడంతో మొదలైన వివాదం మరింత ముదిరింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో తమ గ్రూప్ మ్యాచ్‌లను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించడంతో, బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్ నుండి తప్పుకుంది. మరోవైపు, పాకిస్థాన్ జట్టు ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతించినప్పటికీ, ఆతిథ్య దేశమైన భారత్‌తో తలపడకూడదని ఆంక్షలు విధించింది. దీనివల్ల ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ డైలమాలో పడింది.

తాలిబాన్ ప్రభుత్వానికి సహకారం పెంపు
ఒకవైపు బంగ్లాదేశ్‌కు నిధులు తగ్గించినా, మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. తాలిబాన్ ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలు జరిపిన భారత్, ఆ దేశానికి ఇచ్చే సాయాన్ని రూ. 150 కోట్లకు పెంచింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ బడ్జెట్‌లో మొత్తం రూ. 22,118 కోట్లు కేటాయించారు. మైనారిటీల రక్షణ విషయంలో బంగ్లాదేశ్‌ను నిలదీస్తూనే, భూటాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ ప్రాజెక్టుల ద్వారా తన ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానాన్ని భారత్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో శ్రీలంకకు రూ. 400 కోట్లు, మయన్మార్‌కు రూ. 300 కోట్లు కేటాయించి , ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేసింది.

ఇది కూడా చదవండి: ‘మెట్రో’లో చిల్లర చేష్టలు.. లక్షకు పైగా ఫిర్యాదులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement