నార్వే యువరాణి కుమారుడు అరెస్టు | Son of Norway Crown Princess Faces Rape Charges, police arest | Sakshi
Sakshi News home page

నార్వే యువరాణి కుమారుడు అరెస్టు

Feb 3 2026 4:25 AM | Updated on Feb 3 2026 4:25 AM

Son of Norway Crown Princess Faces Rape Charges, police arest

రేప్‌ తదితర కేసుల్లో నిందితుడు 

ఓస్లో: నార్వే రాజకుటుంబానికి మరో ఇబ్బందికర పరిణామం. యువరాణి మెట్టె మారిట్‌ పేరు వివాదాస్పద ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో చోటుచేసుకున్న ఉదంతం ఓవైపు కలకలం రేపుతుండగానే, మరోవైపు ఆమె పెద్ద కుమారుడు మారియస్‌ బోర్గ్‌ హిబ్బీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై అత్యాచారాలు, దాడులు తదితర అభియోగాలు కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై మంగళవారం ఓస్లో జిల్లా కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా అరెస్టు చోటుచేసుకోవడం గమనార్హం.   

మామూలోడు కాదు! 
యువరాజు హాకన్‌కు హిబ్బీ సవతి కొడుకు. యువరాణి మారిట్‌కు గత సంబంధం ద్వారా జని్మంచారు. ఆయనకు రాచరికపు హోదా గానీ, విధులు గానీ ఏమీ లేవు. కానీ హిబ్బీ నేరచరిత్ర అంతా ఇంతా కాదు! ఆయనపై ఇప్పటిదాకా ఏకంగా 38 రకాల అభియోగాలు దాఖలయ్యాయి. వాటిలో నాలుగు అత్యాచారాలు, సన్నిహితంగా సహజీవనం చేసిన వ్యక్తిపై తీవ్ర వేధింపులు, మరో భాగస్వామిపై హింసతో పాటు మారిజువానా రవాణా వంటివి ఉన్నాయి.  వీటికి సంబంధించి 2024 నుంచి ఆయన్ను పోలీసులు పలుమార్లు అరెస్టు చేశారు. అయితే అభియోగాల నమోదు అనంతరం వదిలేశారు. హిబ్బీ సాధారణ నార్వే పౌరునితో సమానమేనని యువరాజు హాకన్‌ ఇటీవలే పేర్కొన్నారు.   

చిక్కుల్లో రాజకుటుంబం 
నార్వే రాజకుటుంబానికి ప్రజల్లో మంచి పేరుంది. కానీ హిబ్బీ నిర్వాకాలు ఆ ఇమేజీకి మచ్చ తెచ్చేవిగా మారాయి. యువరాణి మారిట్‌ పేరు ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో చోటుచేసుకోవడంతో రాజకుటుంబం ఇప్పటికే తల పట్టుకుంటోంది. అమెరికాతో పాటు పలు దేశాల రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులకు మైనర్లను, మహిళలకు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ ఎరగా వేసిన వైనం సంచలనం సృష్టించడం తెలిసిందే. దానికి సంబంధించి ఫైళ్లు కొద్దిరోజులుగా వెలుగు చూస్తున్నాయి. 

తాజా ఫైళ్లలో మారిట్‌ పేరు వందలసార్లు ప్రస్తావనకు రావడం నార్వేలో కలకలం రేపుతోంది! 2013లో ఫ్లోరిడాలోని పామ్‌బీచ్‌లో ఎప్‌స్టీన్‌కు చెందిన ఓ విలాసవంతమైన భవనంలో మారిట్‌ కొద్ది రోజుల పాటు ఉన్నట్టు వాటి ద్వారా వెలుగులోకి వచ్చింది. ఎప్‌స్టీన్‌ నేపథ్యం తెలుసుకోకుండా అతనితో సంబంధం పెట్టుకోవడం పొరపాటేనని మారిట్‌ చెప్పుకొచ్చారు. హాకన్‌ సోదరి ప్రిన్సెస్‌ మార్తా లూయిస్‌ అక్రమ వ్యాపార వ్యవహారాలు, అమెరికాకు చెందిన తంత్రవాది దురెక్‌ వెరెట్‌తో ఆమె వివాహం తదితరాలు కూడా నార్వో ప్రజలకు రుచించలేదు.  

Advertisement
 
Advertisement
Advertisement