ఉన్నావ్ కేసు బాధితురాలి తండ్రి ‘కస్టడీ’మరణం కేసులో..
పదేళ్ల శిక్ష రద్దు అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లో ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించిన ఉదంతంలో దోషిగా తేలిన బహిష్కృత బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కస్టడీ మరణం కేసులో 2020 మార్చి 13న తనకు పడిన పదేళ్ల కఠిన కారాగార శిక్షను రద్దుచేయాలన్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ కేసును ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ రవీందర్ దుదేజా సోమవారం విచారించారు.
‘‘గతంలోనే దోషిగా తేలిన పిటిషనర్ ఇప్పటికే ఏడున్నర సంవత్సరాలు జైలు జీవితం పూర్తిచేసుకున్న విషయం మాక్కూడా తెలుసు. ఈ ఏడున్నరేళ్లలో ఆయన తన శిక్ష రద్దు కోసం పిటిషన్లను ధర్మాసనం వినలేదు. ఎందుకంటే ఆయన శిక్షను రద్దుచేయాలంటూ చాలాసార్లు మధ్యంతర పిటిషన్లు దాఖలుచేశారు. ఇవి చాలవన్నట్లు బెయిల్ పొడిగింపు కోసం ఇంకొన్ని, మొత్తం శిక్ష రద్దు కోరుతూ మరికొన్ని పిటిషన్లు వేశారు. ఇన్ని పిటిషన్లు దాఖలుచేయడం వల్లే అసలైన పిటిషన్ విచారణకు నోచుకోలేదు.
శిక్షరద్దు కోరుతూ వేసిన పిటిషన్‌లో ఎలాంటి పస లేదు. అందుకే ఆయన అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం. గత శిక్ష రద్దుకు సంబంధించిన న్యాయ సూత్రాలు ఈయనకు వర్తించవు. ఈ ఉదంతంలో వాస్తవాలు, తదనంతర పరిణామాలను పరిగణనలోకి తీసుకుని పిటిషనర్ శిక్ష రద్దుకు మేం సమ్మతి నిరాకరిస్తున్నాం. మిగతా శిక్ష నుంచి పిటిషనర్‌కు మినహాయింపు ఇచ్చేందుకు ఎలాంటి బలమైన సహేతుక కారణాలు లేవు. ఏడున్నర సంవత్సరాల కారాగార శిక్ష అనుభవించిన పిటిషనర్‌కు కేసులో విచారణ ఆలస్యమైందన్న కారణంగా ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేం. ఈ అంశాన్ని ఫిబ్రవరి మూడో తేదీన తిరిగి విచారిస్తాం’’అని జడ్జి చెప్పారు.
తీర్పుపై సంతోషం వ్యక్తంచేసిన బాధితురాలు
పదేళ్ల శిక్ష రద్దు అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించడంపై ఉన్నావ్ బాధితురాలు సంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘కోర్టు నిర్ణయంతో నేనెంతో సంతృప్తిగా ఉన్నా. మా నాన్న ఆత్మ కూడా శాంతిస్తుంది. దోషులందరికీ మరణశిక్ష అమలయ్యాకే నిజంగా ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఇది కేవలం నా యుద్దం కాదు. న్యాయం, సత్యం కోసం పోరాటం. నా తుది శ్వాసదాకా పోరాడతా’’అని ఆమె వ్యాఖ్యానించారు.


