యుద్ధం ఎఫెక్ట్‌.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ | Central Home Department Wrote Letter To States | Sakshi
Sakshi News home page

యుద్ధం ఎఫెక్ట్‌.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

Mar 2 2026 10:52 AM | Updated on Mar 2 2026 11:10 AM

Central Home Department Wrote Letter To States

ఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అలర్ట్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది. హింస జరిగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని లేఖలో సూచనలు చేసింది.

వివరాల మేరకు ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో నిన్న(ఆదివారం) జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌, యూపీలోని లక్నోలో షియా ముస్లింలు నిరసనలకు దిగారు. దీంతో, స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కశ్మీర్‌లో నిరసనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. ఇరాన్ రాడికల్ మతబోధకుల రెచ్చగొట్టే ప్రసంగాలపై దృష్టి పెట్టాలని హోంశాఖ.. రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు లేఖలు రాసింది. 

ఇదిలా ఉండగా.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతి పట్ల ఆదివారం భారత్‌లో తీవ్ర ఆగ్రహం, సంతాపం వ్యక్తమైంది. కశ్మీర్‌ మొదలుకొని కర్ణాటక వరకు పలు రాష్ట్రాల్లో షియా ముస్లింలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. 15 లక్షల షియా ముస్లింలు ఉన్న కశ్మీర్‌లోని శ్రీనగర్‌, బుద్గాం, బందిపొరా, అనంత్‌నాగ్‌, పుల్వామాలో షియాలు గుండెల మీద బాదుకొంటూ వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఇరాన్‌లోని తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనకారులు శాంతియుతంగా ఆందోళన చేయాలని కోరారు. యూపీలోని లక్నో, అజ్మీర్‌లోనూ నిరసనలు చోటు చేసుకున్నాయి. కర్ణాటకలో 1986లో ఖమేనీ సందర్శించిన ఓ గ్రామంలో స్వచ్చందంగా దుకాణదారులు షాపులను మూసివేశారు. మూడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని గ్రామస్థులు నిర్ణయించారు. దీంతో, పలు చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. 

Advertisement
 
Advertisement
Advertisement