పగటి నిద్ర.. మరణ శాసనమే..! | Lack of sleep is a death sentence | Sakshi
Sakshi News home page

పగటి నిద్ర.. మరణ శాసనమే..!

Mar 2 2026 7:52 AM | Updated on Mar 2 2026 8:32 AM

Lack of sleep is a death sentence

‘నిద్ర తగ్గితే ఏమవుతుందిలే.. తరువాత పడుకోవచ్చు’ అని ఎవరైనా సరిపెట్టుకుంటుంటే, వారు వారి మరణ శాసనాన్ని స్వయంగా రాసుకుంటున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు.. అది శరీర అంతర్గత వ్యవస్థలు చేసే 'రిపేర్ వర్క్'. నిద్రకు దూరమైన సమయంలో మెదడులోని ‘మాస్టర్ క్లాక్’ దిశానిర్దేశం కోల్పోయి, పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఫలితంగా లోపల నిశ్శబ్ద యుద్ధం మొదలవుతుంది.

నిద్రలేమి పరిస్థితిలో మనకు తెలియకుండానే మెలటోనిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. రక్త ప్రసరణలో అసమతుల్యత ఏర్పడుతుంది. చివరికి ఊపిరితిత్తులు గాలిని పీల్చుకునేందుకు ఇబ్బంది పడతాయి. రాత్రి నిద్రను ఎగ్గొట్టి, పగలు పడుకుంటే సరిపోతుందిలే అనుకోవడం ఒక పెద్ద భ్రమ. కిటికీ తెరల నుంచి వచ్చే సన్నని వెలుతురు కూడా సరిగా నిద్ర పోనివ్వదు. ఫలితం.. పగలు ఎన్ని గంటలు పడుకున్నా తీరని అలసట, జ్ఞాపకశక్తి మందగించడం, బరువు పెరగడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.  

‘మాస్టర్ క్లాక్’ గందరగోళం
మన మెదడులో ఉండే 'మాస్టర్ క్లాక్' ప్రకృతి వెలుతురును  అనుసరించి పనిచేస్తుంది. రాత్రంతా మేల్కొని, పగలు పడుకుంటే ఈ క్లాక్ పూర్తిగా దెబ్బతింటుంది. కిటికీ రెక్కల నుంచి వచ్చే కొద్దిపాటి వెలుతురు కూడా మెలటోనిన్ ఉత్పత్తిని ఆపేస్తుంది. దీనివల్ల మీరు 10 గంటలు పడుకున్నా శరీరం మాత్రం విశ్రాంతి లేక అల్లాడిపోతూనే ఉంటుంది.

మెదడు మొద్దుబారుతుంది
నిద్రలేమి వల్ల మొదట దెబ్బతినేది ఆలోచనా శక్తి, ఏకాగ్రత లోపించడం. చిన్న విషయాలకే విపరీతమైన చికాకు కలగడం, జ్ఞాపకశక్తి మందగించడం వంటివి దీని ప్రధాన సంకేతాలు. క్రమంగా ఇది  డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తుంది. తరచుగా వచ్చే తలనొప్పిని కేవలం పని ఒత్తిడి అనుకుంటే పొరపాటే.. అది మీ నరాల వ్యవస్థ ఇస్తున్న హెచ్చరిక అని గుర్తుంచుకోవాలి.

ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం
చాలామంది నిద్రలేమి సమమస్యను చిన్నదిగా తీసుకుంటారు. నోయిడా కైలాష్ హాస్పిటల్ నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. నిద్రలేమి అనేది శ్వాసకోస వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. శరీరంలోని 'సిర్కాడియన్ రిథమ్' దెబ్బతినడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతుంది.

రోగనిరోధక శక్తిపై..
నిద్ర లేకపోతే శరీరంలోని రోగనిరోధక కణాలు పగటిపూట నిష్క్రియంగా మారిపోతాయి. ఫలితంగా సామాన్యమైన అంటువ్యాధులు కూడా శరీరంపై తీవ్రంగా దాడి చేస్తాయి. చర్మం, కళ్లు పొడిబారడం  లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే, శరీర అంతర్గత వ్యవస్థ కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని గుర్తించాలి.

అకస్మాత్తుగా బరువు పెరగడం
నిద్రలేమి వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. జీవక్రియ మందగించడం వల్ల.. తక్కువ తిన్నప్పటికీ శరీర బరువు అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇది అధిక రక్తపోటు (BP), గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

కోలుకోలేని నష్టం జరగకముందే..
ఆటో ఇమ్యూన్ వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడకముందే అస్తవ్యస్తమైన నిద్ర అలవాట్లను మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రిపూట మేల్కొని ఉండటాన్ని 'స్టైల్' గానో లేదా 'అలవాటు' గానో భావిస్తే, అది ఆరోగాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుంది. అందుకే ప్రకృతితో కలిసి నడవడమే ఆరోగ్యానికి ఏకైక మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. 
 
 ఇది కూడా చదవండి: రంగులే కాదు.. పండ్లు, బురదతోనూ రచ్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement