ప్రయాణికులకు అలర్ట్‌.. ఎయిర్‌ ఇండియా కీలక ప్రకటన | Air India extends flight suspension until March 2nd midnight | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు అలర్ట్‌.. ఎయిర్‌ ఇండియా కీలక ప్రకటన

Mar 2 2026 8:14 AM | Updated on Mar 2 2026 8:36 AM

Air India extends flight suspension until March 2nd midnight

ఢిల్లీ: ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా పలు దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్‌లకు వెళ్లే అన్ని విమానాల సస్పెన్షన్‌ను ఎయిర్ ఇండియా సోమవారం(మార్చి 2) రాత్రి 11.59 గంటల వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రయాణీకులకు సూచనలు చేసింది.

ఈ క్రమంలో ఢిల్లీ, ముంబై, తిరుచిరాపల్లి సహా పలు విమానాశ్రయాల నుంచి వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ ఎమిరేట్స్‌, ఖతార్‌ ఎయిర్‌వేస్‌ వంటి సంస్థలు కూడా తాత్కాలికంగా వాటి సర్వీసులను నిలిపివేశాయి. దీంతో, యూరప్ వెళ్లే విమానాలు సైతం నిలిచిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్‌ దేశాలు తమ గగనతలాలను మూసివేయడంతో ఆదివారం దేశవ్యాప్తంగా వందలాది విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.

దాడులు, గగనతల పరిమితులు, భద్రత దృష్ట్యా భారత్‌ నుంచి వెళ్లాల్సిన దాదాపు 400కు పైగా విదేశీ విమానాలు రద్దయినట్లు కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ వెల్లడించింది. పశ్చిమాసియా గగనతలాన్ని ఉపయోగించుకొనే విమాన సర్వీసులను సోమవారం రాత్రి 11.59 గంటల వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ‘ఇండిగో’ తెలిపింది. పశ్చిమాసియాకు వెళ్లే దాదాపు 184 అంతర్జాతీయ విమానాలను పాకిస్థాన్‌ రద్దు చేసింది. అటు పశ్చిమాసియా దేశాల్లోనూ 1,800కు పైగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికుల భద్రత, కార్యాచరణ నిబంధనలను కచ్చితంగా పాటించేలా విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నట్లు పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (DGCA) వెల్లడించింది.

మరోవైపు.. ఆదివారం కువైట్, అబుదాబీ, మస్కట్, షార్జా, బహ్రెయిన్, రియాద్, దమ్మామ్, జెడ్డా, మదీనా, దోహా, దుబాయ్‌ నగరాల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన 26 అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆయా విమానాశ్రయాల్లోనే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు రాకపోకలు సాగిస్తున్న అంతర్జాతీయ విమాన సర్వీసులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు, వాహనాల రద్దీ బాగా తగ్గింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement