సుప్రీం నేతతో అమెరికాది దశాబ్దాల వైరం
ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీతో అమెరికా వైరం దశాబ్దాల నాటిది. దీని మూలాలు ఇరాన్‌లో అపార చమురు నిక్షేపాల్లో దాగున్నాయి. 1950వ దశకంలో ఇరాన్ ప్రధాని మొహమ్మద్ మొసాదేగ్‌ను బ్రిటన్, అమెరికాలు ‘ఆపరేషన్ బూట్’ పేరుతో జరిగిన సైనిక తిరుగుబాటుతో గద్దె దించాయి. అంతకుముందు వరకు దశాబ్దాలు పరిపాలించిన రాజు మొహమ్మద్ రెజా పహ్లావీని మళ్లీ గద్దెనెక్కించాయి. కానీ అనూహ్యంగా కొంతకాలానికే రుహొల్లా ముసావీ ఖొమేనీ సారథ్యంలో ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం తలెత్తింది. అనంతరం ఆయన మరణంతో అధికార పగ్గాలు ఖమేనీ చేతికొచ్చాయి. నాటినుంచీ అమెరికాకు ఆయన కొరకరాని కొయ్యగా తయారయ్యారు.
పశ్చిమాసియాపై పెత్తనం చేయడానికి అమెరికా చేసే ప్రతి ప్రయత్నాన్నీ ఖమేనీ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. పశ్చిమాసియాను అమెరికాకు వ్యతిరేక శక్తిగా మార్చేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. అమెరికా కుయుక్తులను తన రాజకీయ చాణిక్యంతో తుత్తునియలు చేశారు. ఇరాన్‌కు తోడుగా పాలస్తీనా భూభాగంలో హమాస్‌ను, యెమెన్‌లో హూతీలను, లెబనాన్‌లో హెజ్»ొల్లా ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ తన ఆధిపత్యాన్ని బలపర్చుకున్నారు. దాంతో ఖమేనీ ఆధిపత్యానికి గండికొట్టేందుకు అమెరికా శతథా ప్రయతి్నంచింది.
ఇరాన్‌లో నిఘాను పెంచి సైబర్ దాడులు చేయించి, సున్నీలను రెచ్చగొట్టి తిరుగుబాటు లేవదీసి... ఇలా పలు రకాలుగా ప్రయతి్నంచి విఫలమైంది. ఖమేనీ పాలనకు చరమగీతం పాడేందుకు అమెరికా ఎన్నోసార్లు కోవర్ట్ ఆపరేషన్లు కూడా చేసింది. వాటికి సంబంధించిన ఆధారాలు లభించిన ప్రతిసారీ తనకేం సంబంధం లేదని బుకాయించింది. ఇస్లామిక్ విప్లవం వేళ 1979లో టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై విప్లవకారులు దాడిచేసి పలువురు దౌత్యవేత్తలు, సిబ్బందిని బంధించారు. వాళ్లను విడిపించేందుకు అమెరికా విశ్వప్రయత్నంచేసింది.
ఆ విప్లవం తర్వాత ఇరాన్‌లో ఏర్పడిన మత రాజ్యాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా స్థానిక తిరుగుబాటుదారులకు సాయపడింది. ముజాహిదీన్–ఇ–ఖల్ఫ్ (ఎంఈకే)కు ఆర్థికసాయం చేసింది. సున్నీ ఉగ్రవాద సంస్థ జూన్‌దుల్హాకు అండదండలు అందించింది. ఇరాన్ ప్రభుత్వ నేతలు, కార్యాలయాలపై దాడులకు ఉసిగొల్పింది. మతపాలకుల పరువు పోగొట్టేందుకు పుకార్లను షికార్లు చేయించేది. అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేయించేది. ఇరాన్‌లో సైబర్, నిఘా ఆపరేషన్లనూ విస్తృతపరిచింది. అణు పరిశోధనలు కొనసాగకుండా తరచూ ఆటంకపరిచేది. ఈ విషయంలో అమెరికాకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ సైతం తనవంతు సాయం చేసింది.
– సాక్షి, నేషనల్ డెస్క్


