మస్కట్ ద్వారా స్వదేశానికి తిరిగొచ్చేందుకు అవకాశం
కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్: ఇజ్రాయెల్– ఇరాన్ యుద్ధ నేపథ్యంలో దుబాయ్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా దేశాల్లోని ప్రవాస భారతీయులకు శుభవార్త. ఇకపై వారు ఆందోళన చెందనక్కర్లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. వారంతా స్వదేశానికి తిరిగి రావడానికి కేంద్రం చేసిన ప్రయత్నాలు ఫలించాయని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులు రోడ్డు మార్గం ద్వారా ఒమన్‌లోకి ప్రవేశించి అక్కడి నుంచి భారత్‌కు వచ్చేందుకు వెసులుబాటు కలి్పంచినట్టు తెలిపారు. ఈ మేరకు మస్కట్‌లోని భారతీయ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసినట్టు తెలిపారు. ఈ లెక్కన దుబాయి నుంచి మస్కట్ ఎయిర్ పోర్టు వరకు రావాలంటే రోడ్డు మార్గాన 450 కి.మీ.లు ప్రయాణించాలి.
ఇతర గల్ఫ్ దేశాల నుంచి మస్కట్‌కు రోడ్డు మార్గాన రావాలంటే దాదాపు వెయ్యి కి.మీ.ల వరకు ప్రయాణం చేయాలి. అలా చేరుకున్న వారంతా ఒమన్‌లోకి ప్రవేశించడానికి ముందుగానే విజిట్/టూరిస్ట్ వీసా పొందడం తప్పనిసరి. ప్రయాణికులు ‘రాయల్ ఒమన్ పోలీస్ వెబ్‌సైట్’ద్వారా అనుమతించిన ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ముందుగా ఈ–వీసాకు దరఖాస్తు చేయాలి. అమెరికా, యూకే, కెనడా, జపాన్ లేదా షెంగెన్ దేశాల చెల్లుబాటు అయ్యే వీసా లేదా నివాస అనుమతి ఉన్న భారత పాస్‌పోర్ట్ దారులకు ‘ఆన్–అరైవల్ వీసా’సదుపాయం ఉంది. వారు రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్, ఆరోగ్య బీమా ఉన్నట్టయితే ముందస్తు వీసా లేకుండా గరిష్టంగా 14 రోజుల వరకు ఒమన్‌లో ప్రవేశించొచ్చు.
గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలో నివసిస్తూ చెల్లుబాటు అయ్యే రెసిడెంట్ కార్డు కలిగిన భారత పౌరులకు కూడా ఆన్–అరైవల్ వీసా అందుబాటులో ఉంటుంది. వీసాకు దరఖాస్తు చేసే సమయంలో పాస్‌పోర్ట్ కనీసం 6 నెలలపాటు చెల్లుబాటు అయ్యేలా ఉండాలి. భారత్‌కు తిరిగి రావాలనుకునే గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులంతా ఏదైనా సమాచారం కావాలంటే ఒమన్‌లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని బండి సంజయ్ తెలిపారు.
దుబాయ్‌లో చిక్కుకున్న మేడ్చల్ వాసి
మేడ్చల్‌రూరల్: టూర్‌కు వెళ్లిన మేడ్చల్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధంతో దుబాయ్‌లో చిక్కుకున్నాడు. వివరాల్లోకి వెళితే పూడూర్ గ్రా>మానికి చెందిన కిరణ్‌కుమార్ మేడ్చల్ ఐఐఎఫ్‌ఎల్ గోల్డ్‌లోన్ బ్రాంచ్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ సంస్థ తమ ఉద్యోగులను గత నెల 26వ తేదీన దుబాయ్ టూర్‌కు తీసుకెళ్లింది. విహారయాత్రలో భాగంగా దుబాయ్, అబుదాబిలో పర్యటించిన కిరణ్ ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణం చేయాల్సి ఉండగా యుద్ధం కారణంగా విమానాలు రద్దు కావడంతో అక్కడే చిక్కుకుపోయాడు. ఆదివారం ఉదయం కుటుంబీకులకు ఫోన్ చేసిన కిరణ్ తాను క్షేమంగా ఉన్నానని, విమానాల రద్దు కారణంగా దుబాయ్‌లోని హోటల్‌లోనే ఉన్నట్టు తెలిపారు. తెలంగాణ నుంచి 800 ఐఐఎఫ్‌ఎల్ ఉద్యోగులు దుబాయ్ టూర్‌కు వెళ్లారు. సోమవారం రావాల్సి ఉండగా విమానాలు రద్దు కావడంతో అక్కడే హోటల్‌లో వారు క్షేమంగా ఉన్నారు.


