కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు
పీడీఎస్ బియ్యం అక్రమార్కుల నుంచి గౌస్ ఆలం డబ్బులు వసూలు చేస్తున్నారు
హోంగార్డుల బదిలీ కోసం రూ.కోటి తీసుకున్నారు
ఎన్‌ఎన్ ప్రైడ్ మాల్ యజమాని వద్ద రూ.25 లక్షలు వసూలు చేశారు
వీటికి సంబంధించిన వీడియోలన్నీ ఉన్నాయన్న ఎమ్మెల్యే
15 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే వాటిని బహిర్గతం చేస్తానని హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పలు తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, 15 రోజుల్లో ఆయనపై చర్యలు తీసుకోకపోతే సీపీ చేస్తున్న అన్ని అక్రమాలకు సంబంధించిన ఆధారాలు వీడియోలతో సహా త్వరలో అసెంబ్లీ, మీడియా సాక్షిగా బయటపెడతానని హెచ్చరించారు. ‘కరీంనగర్ సీపీ బచ్చాగాడు, ఆయన వయస్సు 40 యేండ్ల కంటే చిన్ననే..’అని వ్యాఖ్యానించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కౌశిక్‌రెడ్డి మాట్లాడారు.
ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ వాహనాలా?
‘పీడీఎస్ బియ్యం అక్రమార్కుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. 337 మంది హోంగార్డుల బదిలీ కోసం రూ.కోటి తీసుకున్నారు. ప్రభుత్వ వాహనాలు ప్రైవేటు వ్యక్తుల కోసం ఉపయోగిస్తున్నారు. టీఎస్ 09 పీఏ 4195 ఇన్నోవా వాహనాన్ని సీపీ గౌస్ ఆలం తన మిత్రుడు, ఐఆర్‌ఎస్ అధికారి వికాస్ అగర్వాల్ తండ్రి కోసం వినియోగిస్తున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లు డ్రైవర్లుగా ఉన్నారు. టీఎస్ 09 పీఏ 5601 ఇన్నోవా కారు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సోదరుడిని కాలేజీలో డ్రాప్ చేసేందుకు రోజు చలిమెడ వెళ్తుంది.
ప్రైవేటు పౌరుల కోసం ప్రభుత్వ వాహనాల వాడకంపై డీజీపీ శివధర్‌రెడ్డి సమాధానం చెప్పాలి. సీపీ సతీమణికి కరీంనగర్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఎలా వచి్చందో తెలుసు. ఆమె కోసం ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు డ్యూటీ చేస్తున్నారు. ఇక ఆయన ఇంట్లో 20 మంది కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు..’అని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు.
వసూళ్ల కోసం ఏసీపీ, సీఐని పెట్టుకున్నారు..
‘బియ్యం అక్రమార్కుల నుంచి డబ్బులు వసూలు చేయించేందుకు ఏసీపీ విజయ్‌కుమార్, సీఐ సృజన్‌రెడ్డిని సీపీ పెట్టుకున్నారు. జనవరి 8న ఎన్‌ఎన్ ప్రైడ్ మాల్‌కు ఎన్‌ఓసీ ఇచ్చేందుకు ఆ మాల్ యజమాని దగ్గర నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారు. నేను చెప్పింది అబద్ధం అయితే నా ముక్కు నేలకు రాసేందుకు సిద్ధం. చర్యలు తీసుకోకపోతే వీడియోలు బయట పెడతా.
ఆ తర్వాత ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ బాధపడకూడదు. ఎందుకంటే నేను ఆ వీడియోలు బయట పెడితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తలదించుకునే పరిస్థితి వస్తుంది. 15 రోజుల తర్వాత హుజూరాబాద్ ఏసీపీ, జమ్మికుంట సీఐ ఏమేం పనులు చేస్తున్నారో అన్నీ బయట పెడతా..’అని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు.


