అర్హులైన పేదలకు ప్రభుత్వం అండ | Land for deserving people who lost their homes in Bhoodan lands | Sakshi
Sakshi News home page

అర్హులైన పేదలకు ప్రభుత్వం అండ

Mar 2 2026 12:48 AM | Updated on Mar 2 2026 12:48 AM

Land for deserving people who lost their homes in Bhoodan lands

భూదాన్‌ భూముల్లో ఇళ్లు కోల్పోయిన అర్హులకు స్థలం, ఇందిరమ్మ ఇల్లు 

ఈనెల 15 లోగా నిర్మాణానికి ముగ్గులు పోయిస్తాం: మంత్రి పొంగులేటి

సాక్షిప్రతినిధి, ఖమ్మం : ‘ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో ఇళ్లు కోల్పోయిన అర్హులైన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. వీరికి ఇంటి స్థలంతోపాటు రూ.5 లక్షలు మంజూరు చేసి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తాం. ఈ నెల 15 లోగా ఇళ్ల నిర్మాణానికి నాతోపాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వచ్చి ముగ్గులు పోయిస్తాం. ఇళ్ల స్థలం ఇచ్చేందుకు అనువైన ప్రాంతాన్ని ప్రభుత్వ యంత్రాంగం పరిశీలిస్తోంది’. అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్‌లో ఆయనకు వెలుగుమట్ల బాధితులు తమ గోడు వినిపించారు. 

కొందరు ముఠాగా ఏర్పడి రూ.లక్షలు వసూలు చేసి తమను మోసం చేశారని వివరించారు. బాధితులతో మాట్లాడిన తర్వాత మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు డబ్బులు వసూలు చేసినట్టు తమకు సమాచారం వచ్చిందని, వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ భూముల్లో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఇందిరమ్మ ఇళ్లు తీసుకున్నవారు కూడా ఉన్నట్టు అధికారుల సర్వేలో తేలిందన్నారు. 

వీరు కాకుండా అర్హులైన పేదలందరికీ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో, వారి సొంత ప్రాంతాల్లో ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, విద్యుత్, తాగునీటి సౌకర్యం, అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాల కూడా నిర్మిస్తామని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనలతో ఇదంతా 15 రోజుల్లోగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు చెప్పామన్నారు. 

కొంత మంది యూట్యూబర్‌లు, పనిగట్టుకొని కొన్ని పేపర్లు ఇదేదో తాము కావాలని చేస్తున్నామని, ఈ భూములతో డబ్బులు పోగేసుకుని ఎక్కడో ఎన్నికలకు వాడతామని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మంత్రి వెంట ఖమ్మం కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి, మట్టా దయానంద్‌ ఉన్నారు.  

నగలు తాకట్టు పెట్టి డబ్బులిచ్చాం.. ఇప్పుడు రోడ్డున పడ్డాం  
బాధితురాలు రజియా తన కష్టాలను మంత్రి పొంగులేటికి చెప్పుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే.. మాది చింతకాని మండలం రేపల్లెవాడ. భూదాన భూముల్లో గుడిసెలు వేసుకొని ఎనిమిదేళ్లుగా ఉంటున్నాను. నా భర్త డ్రైవర్, నేను స్కూల్‌లో ఊడ్చే పనికి వెళతాను. 

మాకు ఉండటానికి గూడు లేక, నా అమ్మమ్మ నగలను బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.3.60 లక్షలు భూదాన్‌ భూముల్లో ఉన్న కృష్ణ, రామచంద్రయ్యకు ఇచ్చాను. కరెంట్‌ లేకపోయినా సెల్‌ ఫోన్‌ లైట్లు, దీపాల వెలుగులో బతికాం. వారు చెప్పిన మాటలు విని డబ్బులు ఇచ్చాం. ఇప్పుడు ఇళ్లు కూల్చివేశారు. ప్రభుత్వం మమ్ములను ఆదుకోవాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement