సంస్థాగత నిర్మాణం, పార్టీ ఆలోచనల గురించి దిశానిర్దేశం
మాటామంతితో పాటు ఫొటో సెషన్లలో పాల్గొననున్న కాంగ్రెస్ అగ్రనేత
నేడు అనంతగిరిలో తెలంగాణ, ఏపీ డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు
హాజరుకానున్న రాహుల్‌గాం«దీ, సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్/వికారాబాద్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోమవారం రాష్ట్రానికి రానున్నారు. గత పది రోజులుగా వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని హరిత రిసార్ట్స్‌లో జరుగుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు.
శిక్షణ తీసుకున్న డీసీసీ అధ్యక్షులకు పార్టీ సంస్థాగత నిర్మాణం, వారి విధులు, పార్టీ ఆలోచనల గురించి దిశానిర్దేశం చేయనున్నారు. అక్కడే రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులను కలవనున్న రాహుల్ వారితో ఫొటో సెషన్‌లో పాల్గొననున్నారు. కాగా డీసీసీ అధ్యక్షుల కుటుంబ సభ్యులను కూడా ఈ శిబిరానికి ఆహ్వానించారు. వారితో కూడా మాట్లాడనున్న రాహుల్ ఫొటోలు సైతం దిగనున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో పాటు పీఏసీ సభ్యులు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, సంగతన్ సృజన్ అభియాన్ జాతీయ ఇన్‌చార్జి చల్లా వంశీచందర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, విశ్వనాథన్, సచిన్ సావంత్, టీపీసీసీ శిక్షణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఏపీ నుంచి 41 మంది, తెలంగాణ నుంచి 36 మొత్తంగా 77 మంది డీసీసీ అధ్యక్షులు శిక్షణా శిబిరంలో పాల్గొన్నారు.
రాహుల్ షెడ్యూల్ ఇదీ..
పీసీసీ వర్గాలు వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 7:10 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరనున్న రాహుల్‌గాంధీ 9:20 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు, మంత్రులు, పార్టీ నేతలు స్వాగతం పలుకుతారు.
అక్కడి నుంచి ఉదయం 9:40 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరనున్న రాహుల్‌గాంధీ 10 గంటలరే వికారాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హరిత రిసార్ట్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4:30 గంటల వరకు శిక్షణ శిబిరంలో ఉంటారు. తిరిగి హెలికాప్టర్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని 5:30 గంటలకు ఢిల్లీ వెళ్తారు.


