సంస్థ ఆర్థిక కష్టాలను గట్టెక్కించేందుకు రంగంలోకి జాతీయ సంస్థ
15 రోజుల్లో ఒప్పందం కుదిరే అవకాశం
ఎన్‌డీడీబీ చైర్మన్‌తో తెలంగాణ ప్రతినిధి బృందం భేటీ
అహ్మదాబాద్ వేదికగా డెయిరీ ఆర్థిక పరిస్థితిపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్/సాక్షి, యాదాద్రి: మూసివేత తప్పని దశకు చేరుకున్న మదర్ డెయిరీ (నార్ముల్)ని ఆదుకునేందుకు జాతీయ పాడి అభివృద్ధి బోర్డు (ఎన్‌డీడీబీ) రంగంలోకి దిగనుంది. ఈ డెయిరీ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడమే కాకుండా, కొంత కాలం నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు కూడా బోర్డు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ఎన్‌డీడీబీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం మధ్య చర్చలు సఫలమయ్యాయి.
ఎన్‌డీడీబీ చైర్మన్ డాక్టర్ మీనేశ్ షా, బోర్డు ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ జి. మధుసూదన్‌రెడ్డిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మదర్ డెయిరీ సంస్థ ఆర్థిక పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు. అలాగే డెయిరీని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. నిర్వహణ బాధ్యతలు ఎన్‌డీడీబీ తీసుకోవాలని మదర్ డెయిరీ పాలకవర్గం చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రతినిధి బృందం బోర్డుకు అందజేసింది.
రూ.75 కోట్ల నిధులు అనివార్యం..: ప్రస్తుత పరిస్థితుల్లో డెయిరీని గట్టెక్కించాలంటే రూ.75 కోట్ల వరకు అనివార్యంగా నిధులు కావాలని, అలాగే సంస్థ నిర్వహణకు మరికొంత అవసరం అవుతాయని, ఈ పరిస్థితుల్లో ఎన్‌డీడీబీ సహకారం కావాలని, లేదంటే డెయిరీ మూసివేత ఒక్కటే మార్గమవుతుందని తెలంగాణ ప్రతినిధులు వివరించారు. డెయిరీలో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి వేతనాలు, పాల సేకరణ, బ్యాంకుల్లో తక్షణమే చెల్లించాల్సిన రుణాలు, కార్యకలాపాల పునరుద్ధరణ, పాలనా పరంగా తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై కూలంకషంగా చర్చించిన అనంతరం కొన్ని షరతుల మీద మదర్ డెయిరీ నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు ఎన్‌డీడీబీ అంగీకరించినట్టు తెలిసింది.
ఈ షరతులకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తే జాతీయ స్థాయిలోని మరో డెయిరీతో కలిసి సంయుక్తంగా కొంతకాలంపాటు డెయిరీని నిర్వహిస్తామని ఎన్‌డీడీబీ స్పష్టం చేసింది. ఇందుకు అంగీకరించిన తెలంగాణ ప్రతినిధులు చర్చల పురోగతికి కూడా తమ సమ్మతిని తెలియజేశారు. దీంతో 10–15 రోజుల్లో మదర్ డెయిరీ, తెలంగాణ ప్రభుత్వం, ఎన్‌డీడీబీల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందం మేరకు ఎన్‌డీడీబీ రంగంలోకి దిగి ఆర్థిక కష్టాలు, అస్తవ్యస్త నిర్వహణతో కుదేలవుతున్న మదర్ డెయిరీకి మళ్లీ జీవం పోసే ప్రయత్నాలను ప్రారంభించనుంది.


