ఖమేనీ మృతి.. ఒకవైపు విషాదం.. మరోవైపు ఆనందం | Iran Supreme Leader Ayatollah Ali Khamenei dies | Sakshi
Sakshi News home page

ఖమేనీ మృతి.. ఒకవైపు విషాదం.. మరోవైపు ఆనందం

Mar 2 2026 1:14 AM | Updated on Mar 2 2026 4:47 AM

Iran Supreme Leader Ayatollah Ali Khamenei dies

కుమార్తె, అల్లుడు,మనవరాలు సహా కుటుంబ సభ్యులు మృతి  

ఆర్మీ చీఫ్‌ ముసావీ కూడా క్షిపణి దాడుల్లో మట్టుబెట్టిన ఇజ్రాయెల్‌

ఖమేనీ మృతిని ధ్రువీకరించిన ఇరాన్‌ ప్రభుత్వ అధికారిక మీడియా  

చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తి మరణించాడు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన

అణు కార్యక్రమం అంతమయ్యేదాకా దాడులు ఆగవని స్పష్టీకరణ  

శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ ప్రతిజ్ఞ  

ఖమేనీ మృతికి సంతాప సూచకంగా నల్లజెండాలు ఎగురవేసిన మద్దతుదారులు  

చర్చించుకుందామని ట్రంప్‌కు ఇరాన్‌ పిలుపు

వాషింగ్టన్‌/దుబాయ్‌: దశాబ్దాలపాటు ఇరాన్‌ను శాసించి, పశ్చిమదేశాలకు కంట్లో నలుసులా మారిన సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ(86) కథ ముగిసింది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడిలో ఆయన మరణించారు. ఖమేనీతోపాటు ఆర్మీ చీఫ్‌ అబ్దుల్‌ రహీం ముసావీ, రక్షణ మంత్రి అమీర్‌ నజీర్‌జాదే తదితరులు కూడా మృతి చెందారు. రాజధాని టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై శనివారం ఉదయం ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో ఖమేనీ మృతిచెందినట్లు ఇరాన్‌ ప్రభుత్వ అధికారిక మీడియా ధ్రువీకరించింది. ఖమేనీ మృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం ప్రకటన చేశారు. చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తి విగతజీవిగా మారిపోయాడని వెల్లడించారు. 

ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దేశాన్ని తిరిగి అదీనంలోకి తీసుకొనే ఏకైక అతిపెద్ద అవకాశం ఇరాన్‌ ప్రజలకు లభించిందని సూచించారు. ఇరాన్‌పై భారీ, పిన్‌పాయింట్‌ దాడులు మరో వారంపాటు.. అవసరమైతే ఆ తర్వాత కూడా యథాతథంగా కొనసాగుతాయని తేల్చిచెప్పారు. ఇరాన్‌ అణ్వస్త్ర కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేదాకా దాడులు తప్పవని ఉద్ఘాటించారు. తమ అత్యున్నత నిఘా వ్యవస్థ నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయాడని ట్రంప్‌ వెల్లడించారు. 

ఖమేనీ మృతిపై ఇజ్రాయెల్‌ కూడా స్పందించింది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌తోపాటు రక్షణ శాఖ మంత్రి అమీర్‌ నజీర్‌జాదే, ఇరాన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శి, ఖమేనీ సలహాదారు, 30 మందికి పైగా ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డు టాప్‌ కమాండర్లు కూడా అంతమయ్యారని తేల్చిచెప్పింది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ఖమేనీ సారథ్యంలోని సుప్రీం డిఫెన్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగుతుండగా దాడులు చోటుచేసుకున్నాయి. 

40 రోజులపాటు సంతాప దినాలు  
వైమానిక దాడిలో ఖమేనీ నివాసం చాలావరకు ధ్వంసమైనట్లు ఉపగ్రహ చిత్రాలను బట్టి స్పష్టమవుతోంది. ఈ ఘటనలో ఆయన కుటుంబ సభ్యులు సైతం మరణించినట్లు తెలిసింది. వీరిలో ఖమేనీ కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు ఉన్నట్లు తెలిసింది. శత్రుదేశాల దాడిలో తమ అత్యున్నత నాయకుడు ఖమేనీ ప్రాణాలు కోల్పోవడం పట్ల ఇరాన్‌ కేబినెట్‌ రగిలిపోయింది. ప్రతీకారం తప్పదని తేల్చిచెప్పింది. శత్రువులు అతిపెద్ద తప్పు చేశారని, కచ్చితంగా సమాధానం చెబుతామని స్పష్టంచేసింది. 

ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఖమేనీతోపాటు ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కారŠప్స్‌ ఉన్నతస్థాయి కమాండర్‌ మేజర్‌ జనరల్‌ మొహమ్మద్‌ పాక్‌పౌర్, ఖమేనీ అత్యున్నత భద్రతా సలహాదారు అలీ షామ్‌ఖనీ కూడా మృతిచెందినట్లు ఇరాన్‌ అధికారిక మీడియా వెల్లడించింది. ఖమేనీ కన్నుమూయడంతో దేశంలో 40 రోజలపాటు సంతాప దినాలు పాటించాలని ఇరాన్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఆయన స్మారకార్థం వారం రోజులపాటు దేశవ్యాప్తంగా సెలువులు ప్రకటించింది. దాంతో సంతాప సూచకంగా జనం నల్ల జెండాలు ప్రదర్శించారు. షియా ముస్లింలకు పవిత్ర క్షేత్రమైన మషాద్‌ సిటీలోని ఇమామ్‌ రెజా మసీదుపై నల్ల జెండా ఎగురవేశారు.  

ఒకవైపు విషాదం.. మరోవైపు ఆనందం  
తమ అధినేత ఖమేనీ ఇక లేరన్న నిజాన్ని ఆయన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోయారు. శోకసంద్రంలో మునిగిపోయారు. ఇజ్రాయెల్, అమెరికా దేశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శాపనార్థాలు పెట్టారు. ఖమేనీ చిత్రపటాలు చేతబూని నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు ఖమేనీ మరణించడం పట్ల సంతోషం వ్యక్తంచేస్తూ ఆయన వ్యతిరేకులు వీధుల్లోకి వచ్చారు. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆనందంతో నృత్యాలు చేశారు. నియంత పాలన అంతమైందంటూ నినదించారు. బూరలు ఊదుతూ పెద్ద ఎత్తున శబ్దాలు చేస్తూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోరుకుంటున్నామని వారు స్పష్టంచేశారు.    

Advertisement
 
Advertisement
Advertisement