పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధ పరిస్థితులు
ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై విరుచుకుపడిన ఇరాన్
గల్ఫ్ దేశాల్లోని 27 అమెరికా స్థావరాలపై దాడులు
ఇజ్రాయెల్‌లో 8 మంది మృతి, 28 మందికి గాయాలు
ముగ్గురు అమెరికా జవాన్లు బలి, ఐదుగురికి గాయాలు
ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించిన అమెరికా, ఇజ్రాయెల్
వందలాది మంది మరణించారని ప్రకటించిన ఇరాన్
టెహ్రాన్/దుబాయ్/జెరూసలేం: ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులకుతోడు తమ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్య పట్ల ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్‌తోపాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా నిప్పుల వర్షం కురిపిస్తోంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం దాకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని పలు ప్రాంతాలపై క్షిపణులు ప్రయోగించింది.
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ప్రఖ్యాత బుర్జ్ అల్ అరబ్ హోటల్‌తో పాటు పలు ప్రాంతాలపై దాడులకు దిగింది. డ్రోన్ దాడిలో హోటల్‌లో స్వల్పంగా మంటలు చెలరేగాయని, వెంటనే ఆర్పేశామని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది. జెబెల్ అలీ ఓడరేవులోని ఓ బెర్త్‌లో మంటలు వ్యాపించినట్లు తెలిపింది. ఇరాన్ దాడుల్లో మొత్తం నలుగురు గాయపడినట్లు వెల్లడించింది. వారికి తక్షణమే వైద్య చికిత్స అందించామని పేర్కొంది.
యూఏఈలో శనివారం రాత్రంతా సైరన్ల మోత వినిపించింది. పవిత్ర రంజాన్ మాసం కావడంతో జనం రాత్రి మేల్కొనే ఉన్నారు. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడిలో ఒకరు మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. అయితే, ఈ దాడిని అబుదాబీ ప్రభుత్వం ఇంకా ధ్రువీకరించలేదు. దోహాలో డజనుకు పైగా పేలుళ్లు సంభవించాయి. అమెరికా నౌకలకు మందుగుండు సరఫరా చేసే నౌకపైనా ఇరాన్ దాడి చేసింది. శనివారం బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో మృతుల సంఖ 185కు పెరిగినట్టు ఇరాన్ తెలిపింది.
ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ధ్వంసం
మరోవైపు యూఏఈ సైన్యం ఎదురు దాడికి దిగుతోంది. ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్లను నేలమట్టం చేస్తోంది. 165 బాలిస్టిక్ క్షిపణులు, 541 డ్రోన్లను కూల్చివేసినట్లు యూఏఈ రక్షణ శాఖ ప్రకటించింది. తమ గగనతల రక్షణ వ్యవస్థ చురుగ్గా పని చేస్తున్నట్లు వెల్లడించింది. దుబాయ్ పేలుళ్లతో దద్దరిల్లింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, నౌకాశ్రయం కూడా బాంబు దాడుల్లో దెబ్బ తిన్నాయి. అబుదాబీలో పాఠశాలలను మంగళవారం దాకా మూసివేస్తూ ఆదేశాలిచ్చారు. ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియా అంతటా విమానాల రాకపోకలకు తీవర అంతరాయం ఏర్పడింది.
పెద్ద సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయి. దాంతో ఎయిర్‌పోర్టుల్లో జనం పడిగాపులు కాస్తున్నారు. ఇరాన్ దాడుల్లో ఇప్పటిదాకా ముగ్గురు అమెరికా సైనికులు మరణించారని, 58 మంది గాయపడ్డారని ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. కువైట్‌పై ఇరాన్ ఇప్పటివరకు 97 బాలిస్టిక్ క్షిపణులు, 283 డ్రోన్లు ప్రయోగించింది. ముగ్గురు కువైట్ సైనికులు గాయపడ్డారు. ఇరాన్‌కు చెందిన 49 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నామని జోర్డాన్ ప్రకటించింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా నిరీ్వర్యం చేసినట్లు బహ్రెయిన్, ఖతార్ సైతం తెలియజేశాయి.
ప్రార్థనా మందిరంపై ఇరాన్ దాడి
ఇజ్రాయెల్‌పై ఇరాన్ వైమానిక దాడులు ఆదివారం సైతం కొనసాగాయి. ముఖ్యంగా సెంట్రల్ ఇజ్రాయెల్, అక్కడి రక్షణ రంగ సంస్థలు తదితరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. డజన్ల సంఖ్యలో రాకెట్లు ప్రయోగించింది. ఇజ్రాయెల్‌లో బెయిత్ షెమేశ్‌లోని ఓ ప్రార్థనా మందిరంపై ఇరాన్ సైన్యం క్షిపణిని ప్రయోగించడంతో కనీసం ఎనిమిది మరణించారు. నాలుగేళ్ల బాలుడు సహా 28 మందికి పైగా గాయపడ్డారు. జెరూసలేంకు 35 కిలోమీటర్ల దూరంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. దీంతో ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో మరణాల సంఖ్య 10కి చేరుకుంది. క్షతగాత్రుల సంఖ్య 120కి చేరింది. అలాగే ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో పదుల సంఖ్యలో నివాస గృహాలు దెబ్బతిన్నాయి.
పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు ఆగడం లేదు. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతర్ తదితర దేశాల్లోని 27 సైనిక స్థావరాలపై దాడులు చేసినట్టు ఇరాన్ పేర్కొంది. ఇరాన్ దాడుల్లో అమెరికా సైన్యానికి ప్రాణనష్టం వాటిల్లుతోంది. ముగ్గురు జవాన్లు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు అమెరికా మిలటరీ ప్రకటించింది. మరోవైపు కల్లోలిత పశ్చిమాసియాలోని తమ పౌరులను స్వదేశానికి తరలించడానికి ఇతర దేశాలు ఏర్పాట్లు
చేస్తున్నాయి.
ప్రతీకారం తప్పదు: ఇరాన్
ఖమేనీని పొట్టనపెట్టుకున్న శత్రువులను ప్రాణాలతో విడిచిపెట్టబోమని ఇరాన్ తేలి్చచెప్పింది. శత్రువులు రెడ్ లైన్ దాటేశారని, అందుకు వారు మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ పార్లమెంటరీ అధికార ప్రతినిధి మొహమ్మద్ బాఘేర్ కాలిబాఫ్ ఆదివారం స్పష్టంచేశారు. ఈసారి కోలుకోలేని విధంగా గట్టిగా దెబ్బకొడతామని, ఖమేనీ మృతికి తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా, ఇజ్రాయెల్‌లను హెచ్చరించారు.
9 యుద్ధ నౌకల్నిముంచేశాం:ట్రంప్
ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్ చేసిన హెచ్చరికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. తమపై ఎదురుదాడి ఆలోచన వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. ప్రతిదాడులకు దిగితే గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో బుద్ధి చెప్తామన్నారు. అమెరికా వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఆదివారం 9 ఇరాన్ యుద్ధ నౌకల్ని ముంచేసినట్టు అ«ధ్యక్షుడు వెల్లడించారు. నేవీ ప్రధాన కార్యాలయాన్నీ తీవ్రంగా దెబ్బ తీశామని చెప్పారు.
టెహ్రాన్‌లో పేలుళ్ల మోత
అమెరికా–ఇజ్రాయెల్ సైన్యాలు ఇరాన్‌పై దాడులు ఉధృతం చేశాయి. ఆదివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. రాజధాని టెహ్రాన్‌లో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. నగరంలో ఎక్కడ చూసినా బాంబుల మోతలే విని్పంచాయి. పేలుళ్ల నుంచి పెద్ద ఎత్తున వెలువడుతున్న పొగలు సుదూరాల దాకా వ్యాపిస్తున్నాయి. ఇరాన్ గుండెకాయపై దాడి చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్‌పై దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ తేలి్చచెప్పారు. ఇరాన్‌లోని పలు ఇతర నగరాలపై కూడా దాడులు తీవ్రస్థాయిలో కొనసాగాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో దేశవ్యాప్తంగా కొన్ని వందల మంది మరణించినట్టు ఇరాన్ పేర్కొంది. పలు నగరాల్లో భవన శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.


