breaking news
west asian countries
-
ఎవరి కోసం ఈ యుద్ధం?
అకారణ యుద్ధాలతో నిండా మునిగి, ఆర్థికంగా పతనావస్థకు చేరుకున్న అమెరికా, మరోసారి పశ్చిమాసియా రణరంగంలో దూకి తన మూర్ఖత్వాన్ని చాటుకుంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ‘నాకెందుకో నోబెల్ బహుమతి రావటం లేద’ని వగచి 48 గంటలు కాలేదు... తన యుద్ధోన్మాదాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఇంటా బయటా ‘వద్దుగాక వద్ద’ని మొత్తుకుంటున్నా, ఆంక్షలతో బక్కచిక్కిన ఇరాన్‌పై తన ప్రతాపాన్ని చూపారు. ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’ పేరిట శనివారం అర్ధరాత్రి దాటాక అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ కొండప్రాంతాల్లోని భూగర్భంలో వున్న ఫోర్దో, నతాంజ్, ఇసాఫన్ అణుస్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో అమెరికా చెబుతున్నట్టు ఆ స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయా లేదా అన్నది ఇంకా తెలియాల్సివుంది. కానీ ఫోర్దో కేంద్రంపై సోమవారం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు మరోసారి దాడి చేశాయన్నది గమనిస్తే తీవ్ర నష్టం కలిగివుండొచ్చనిపిస్తోంది. ఇందుకు ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్ నగరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఎన్నడూలేని విధంగా హోర్ముజ్ జలసంధిని మూసేయాలని ఇరాన్ కేబినెట్ నిర్ణయించటం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై పిడుగుపాటే. ఇరాన్‌పై అమెరికా పగ ఈనాటిది కాదు. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం అనంతరం అమెరికా రాయబార కార్యాలయంపై దాడిచేసి 52 మంది దౌత్యవేత్తలనూ, పౌరులనూ 444 రోజుల పాటు బందీలుగా చేసిన వైనాన్ని ఆ దేశం మరిచిపోలేకపోతోంది. బందీలను విడిపించ టానికి అప్పటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ‘ఆపరేషన్ ఈగిల్ క్లా’ సైతం విఫలమైంది. ఆ పరాభవంనుంచి కోలుకోలేక ఏదో సాకుతో ఆంక్షలు విధిస్తూనేవుంది. ఆ తర్వాత 1980లో అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను ఇరాన్‌పైకి ఉసిగొల్పింది. ఎనిమిదేళ్ల ఆ యుద్ధం రెండు దేశాలనూ దెబ్బతీయగా, అమెరికా ఆయుధ విక్రయంతో బాగుపడింది. అటుపై అడపా దడపా ఇజ్రాయెల్‌తో దాడులు చేయిస్తూనే ఉంది. కొత్త కొత్త ఆంక్షలతో ఇరాన్‌ను దెబ్బతీస్తూనే ఉంది. తీరికూర్చుని వేరే దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, వనరుల కైంకర్యానికి ప్రయత్నించటం అమెరికా విదేశాంగ విధానంలో భాగం. ఇరాన్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన జాతీయవాది ప్రధాని మహమ్మద్ మొసాదిని 1953లో బ్రిటన్‌తో చేతులు కలిపి సైనికకుట్రతో కూల్చిన పాపం అమెరికాదే. అప్పట్లో బ్రిటన్ చేతుల్లోవున్న ఇరాన్ చమురు కంపెనీని జాతీయం చేయటంతో రెండు దేశాలూ ఈ దుస్సాహసానికి ఒడిగట్టాయి. అటుపై తమ కీలు బొమ్మ మహ మ్మద్ రెజా పెహ్లవీని అందలమెక్కించాయి. రెండు దశాబ్దాలు గడవకుండానే అతగాడు పదవీభ్ర ష్టుడయ్యాడు. ఇస్లామిక్ దేశాల్లో అమెరికా జోక్యంతో ఛాందసవాదుల ప్రాబల్యం పెరగటం 1953 నాటి ఇరాన్‌తో మొదలుపెట్టి ఇటీవలి బంగ్లాదేశ్ వరకూ కనబడుతూనే ఉంది. అఫ్గానిస్తాన్, ఇరాక్, లిబియా, లెబనాన్, సోమాలియా, సిరియా వగైరాలన్నీ ఇందుకుదాహరణ. అఫ్గాన్‌లో తాలిబన్లు మొదలుకొని సిరియాలో ఐఎస్ వరకూ అన్ని ఉగ్రవాద సంస్థల పుట్టుకకూ అమెరికాయే కారణం. డెమాక్రాట్లు మళ్లీ నెగ్గితే అమెరికాను సర్వనాశనం చేస్తారని, మూడో ప్రపంచయుద్ధానికి కారకు లవుతారని అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం చేసిన పెద్ద మనిషి ఇప్పుడు తానే ఆ పెను ముప్పు వైపు అడుగులేశారు. అమెరికన్ కాంగ్రెస్‌కు మాట మాత్రమైనా చెప్పలేదు. అంతర్జాతీయ చట్టాల్ని లేశమాత్రమైనా గౌరవించలేదు. చివరకు ఏమవుతుందోనన్న చింత అసలే లేదు. యుద్ధాల్ని ప్రారంభించటం తేలిక. వాటి ముగింపు ఎవరి వల్లా కాదు. వ్యక్తుల ఇష్టానిష్టాలకు అది లోబడి ఉండదు. అసలే పశ్చిమాసియా వైరుద్ధ్యాల పుట్ట. పరస్పరం కలహించుకునే దేశాలు అక్కడ డజనుకు పైగా ఉంటాయి. అలాంటిచోట ‘తగుదునమ్మా...’ అంటూ ట్రంప్ వేలెట్టి పెద్ద తప్పు చేశారు. కానీ దీనికి మూల్యం చెల్లించుకోవాల్సింది... అమెరికన్ పౌరులూ, ప్రపంచ ప్రజానీకం.మూడున్నర దశాబ్దాల ఏలుబడిలో అలీ ఖమేనీకి ఇది పరీక్షా సమయం. దాడులకు లొంగి ట్రంప్‌తో దౌత్యానికి సిద్ధపడతారా లేక ఇజ్రాయెల్ అంతు చూసేదాకా వదలరా అన్నది తేలటానికి సమయం పడుతుంది. కానీ శక్తిమంతమైన అమెరికాపై ప్రతీకార దాడులకు దిగి భారీ నష్టానికి సిద్ధ పడకపోవచ్చు. అకారణ దాడులపై రౌద్రంగా ప్రకటనలిస్తున్నా ఆచరణ రూపం దాల్చక పోవచ్చు. అటు అమెరికా సైతం ఇరాన్ అణ్వాయుధ ప్రయత్నాలపై యుద్ధమే తప్ప ఆ దేశంపై యుద్ధం తమ ఉద్దేశం కాదంటోంది. కానీ ఇజ్రాయెల్, అమెరికాల ఉమ్మడి దురాలోచన ఇరాన్లో నాయకత్వ మార్పు... అమెరికా ప్రాపకంతో నడిచే ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వంటి ఆర్థిక సంస్థల ప్రమేయం లేకుండా సర్వస్వతంత్రంగా, నిటారుగా నిలబడగల్గిన ఇరాన్‌ను ‘ప్రధాన స్రవంతి’కి మళ్లించటం. ఆ రెండూ మాత్రం నెరవేరే అవకాశం లేనే లేదు. ఇరాన్లో పెట్టుబడులు లేవు గనుక అమెరికా ఎంతకైనా తెగిస్తుంది. కానీ మనకు ఆ దేశంతో ఆర్థికబంధం ఉంది. పాకిస్తాన్ ప్రమేయం లేకుండా మధ్య ఆసియా దేశాలతో, అఫ్గాన్‌తో నేరుగా, చౌకగా వాణిజ్యాన్ని నెరపగలిగే చాబహార్ పోర్టు ఇరాన్లో నిర్మించింది మనమే. కానీ ఆంక్షల కారణంగా అది అరకొరగా ఉంది. ఇరాన్ చౌకగా ఇచ్చే చమురును కూడా ఆ ఆంక్షల పర్యవసానంగానే కాలదన్నుకున్నాం. ఈ యుద్ధం ఉగ్రరూపం దాలిస్తే ఆర్థికంగా మరింత నష్టపోతాం. చైనా, రష్యాల పరిస్థితి కూడా ఇదే. అటు నాటో కూటమి సైతం అయోమయంలో పడింది. అందుకే ఈ మతిమాలిన యుద్ధం చాలించమని ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలన్నిటిపైనా ఉంది. -
చిక్కడు.. దొరకడు!
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. దాడులు, ప్రతిదాడులకు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధంలోకి అమెరికా సైతం అడుగుపెట్టడం అగి్నకి ఆజ్యం పోసినట్లయ్యింది. ఇజ్రాయెల్‌తోపాటు అమెరికాపై కత్తులు నూరుతున్న అసలు కథానాయకుడు, ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇప్పుడు ఎక్కడున్నారు? అనేది టాప్ సీక్రెట్‌గా మారింది. దశాబ్దాలుగా ఇరాన్‌ను మకుటం లేని మహారాజులా ఏలుతున్న 86 ఏళ్ల ఖమేనీ కోసం ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వేట సాగిస్తున్నాయి. ఆయనకు విదేశాల్లోనే కాదు, సొంత దేశంలోనూ శత్రువులున్నారు. ఖమేనీ ఆచూకీ దొరికితే సజీవంగా బంధించి, చట్టప్రకారం శిక్షించడమో లేక అక్కడికక్కడే అంతం చేయడమో తథ్యమని పశ్చిమ దేశాల మీడియా అంచనా వేస్తోంది. ఇరాన్లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించాలంటే ఆయన ప్రాణాలతో ఉండడానికి వీల్లేదని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయానికి వచి్చనట్లు తెలుస్తోంది. ఖమేనీ భౌతికంగా లేకుండాపోతేనే ఈ యుద్ధం ముగస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేయడం గమనార్హం. ‘‘ఖమేనీ ఆధునిక హిట్లర్. అతడు బతికి ఉండడానికి వీల్లేదు’’ అని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ సైతం అన్నారు. చావుకు భయపడే మనిషి కాదు ఇరాన్లో ఈ నెల 12న ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా దాడికి దిగింది. ఆ వెంటనే ఖమేనీ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుర్తుతెలియని ప్రాంతంలో అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన బంకర్లో ఆయన క్షేమంగా ఉన్నట్లు ఇరాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. సుశిక్షితులైన బాడీగార్డులు ఆయనకు రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. ఖమేనీ కచి్చతంగా ఎక్కడున్నారో ఎవరికీ తెలియకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) అత్యున్నత స్థాయి అధికారులకు సైతం ఖమేనీ ఆచూకీ గురించి తెలియదని అంటున్నారు. ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు ఏమాత్రం ఉప్పందకుండా ఇరాన్ సర్కారు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఖమేనీని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఉన్నత శ్రేణి భద్రతా దళం నిరంతరం ఆయనకు కాపలా కాస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖమేనీ ప్రాణాలకు ఎవరూ హానీ తలపెట్టే అవకాశం లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఖమేనీ చావుకు భయపడే మనిషి కాదని, ఇరాన్ భవిష్యత్తు కోసం ఆయన ప్రాణాలతో ఉండడం అవసరమని అన్నారు. అమెరికా దాడుల తర్వాత బంకర్లోకి.. సాధారణ పరిస్థితుల్లో ఖమేనీ సెంట్రల్ టెహ్రాన్‌లోని ఓ కాంపౌండ్‌లో ఉంటారు. అక్కడి నుంచి విధులు నిర్వర్తిస్తారు. మిలటరీ కమాండర్లు, అధికారులతో ప్రతివారం సమావేశమవుతారు. ప్రజలతో మాట్లాడాలన్నా ఇక్కడే. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరు. ఇజ్రాయెల్ దాడులు మొదలైన వెంటనే ఖమేనీ బంకర్లోకి వెళ్లలేదని సమాచారం. బయటే ఉంటూ ప్రతిదాడికి వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న అమెరికా సైన్యం యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన తర్వాతే ఆయన బంకర్లోకి చేరుకున్నారు. మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత ఖమేనీ మరింత అప్రమత్తమయ్యారు. తన విశ్వాసపాత్రులైన అనుచరులు, సహాయకులతోనూ కమ్యూనికేషన్ తగ్గించుకున్నారు. ఫోన్లు ఉపయోగించడం ఆపేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉంటున్నారు. శత్రువులకు తన ఆచూకీ చిక్కకుండా ఉండడానికే ఈ జాగ్రత్త. శత్రువుల చేతికి చిక్కితే మరణాన్ని చేతులారా ఆహ్వానించినట్లేనని ఖమేనీని బాగా తెలుసు. ఆయనను ఖతం చేయడానికి ఇజ్రాయెల్ ఇప్పటిదాకా చేయని ప్రయత్నమే లేదు. ఇజ్రాయెల్ ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా ఎంతోమందిని హత్య చేసింది. కొద్ది రోజుల క్రితమే పేజర్ బాంబులతో హెజ్»ొల్లా నాయకులను మట్టుబెట్టింది. ఖమేనీని మాత్రం కనీసం టచ్ చేయలేకపోయిందంటే ఆయన ఎంత సురక్షితంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ‘‘ఏదో ఒకరోజు ఇజ్రాయెల్ నన్ను చంపేయడం ఖాయం. దేశం కోసం వీరమరణం పొందడం నాకు సంతోషమే’’ అని కొన్నేళ్ల క్రితం ఖమేనీ వ్యాఖ్యానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా మెరుపుదాడి.. ఖండించిన ప్రపంచదేశాలు
టెహ్రాన్/టెల్ అవీవ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ/మాస్కో: పచ్చగడ్డి వేస్తే భగ్గున మండే శత్రుత్వంతో పరస్పర దాడులు చేసుకుంటున్న ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలోకి అగ్రరాజ్యం హఠాత్తుగా వచ్చి భీకరదాడులతో పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలను మరింత ఎత్తుకు ఎగదోసింది. పర్వతగర్భంలో పటిష్టంగా, రహస్యంగా ఉన్న ఫోర్డో యురేనియం శుద్ధి కర్మాగారాన్ని బద్దలుకొట్టే లక్ష్యంతో అమెరికా యుద్ధవిమానాలు వేల కేజీల బరువైన అతిభారీ బాంబులతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ రాజధాని సమీప ఫోర్డో అణుకేంద్రంపై శనివారం అర్ధరాత్రిదాటాక గంటలకు జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్‌నెన్స్ పెనిట్రేటర్(ఎంఓపీ) గైడెడ్ బాంబులను అమెరికా బీ–2ఏ స్పిరిట్ స్టెల్త్ బాంబర్ విమానాలు జారవిడిచాయి. ఈ బాంబులు 200 అడుగుల లోతుకు చొచ్చుకెళ్లి అక్కడి భూగర్భాన్ని బద్దలుకొట్టాయి. నతాంజ్ అణుకేంద్రంపైనా అమెరికా ఇవే బాంబులను వేసింది. మొత్తంగా 14 జీబీయూ బాంబులను ఉపయోగించినట్లు అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్, జనరల్ డేనియల్ కెయిన్ వెల్లడించారు. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్.. శనివారం అర్ధరాత్రిదాటగానే ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’పేరిట ఈ దాడులను చేసింది. అమెరికాలోని మిస్సోరీలోని వైట్హ్యాన్ వైమానిక స్థావరం నుంచి ఆరు బీ–2ఏ విమానాల దండు దండయాత్ర మొదలైంది. ఏకధాటిగా 37 గంటలపాటు ప్రయాణించి, మార్గమధ్యంలో గాల్లోనే ఇంధనాన్ని నింపుకుంటూ 11,400 కిలోమీటర్లు ప్రయాణించిమరీ ఫోర్డో, నతాంజ్ అణుకేంద్రాలపై ఒక్కోటి దాదాపు 14,000 కేజీల బరువుండే 14 బంకర్ బస్టర్ బాంబులను పడేశాయి. ఆ తర్వాత ఇస్ఫహాన్ అణుకేంద్రంపై అమెరికా జలాంతర్గామి 30 టోమాహాక్ క్రూజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ మూడు అణుకేంద్రాలపై 75 దాకా గైడెడ్ క్షిపణులను ప్రయోగించి విధ్వంసం సృష్టించింది. మొత్తంగా 125 విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. కొన్ని విమానాలు దాడిచేయగా మిగతావి శత్రుసేనలను తికమక పెట్టేందుకు వేర్వేరు దిశల్లో చక్కర్లు కొట్టాయి. మెరుపువేగంతో దాడులుచేసి తిరిగి తమతమ స్థావరాలకు చేరుకున్నాయి. యుద్ధ, రవాణా, ఇంధన విమానాలు ఈ ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’లో పాల్గొన్నాయి. అమెరికా దాడుల్లో అణుకేంద్రాల్లో మౌలికవసతులు ఏ స్థాయిలో నాశనమయ్యాయో ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అయితే పర్వతం పైభాగంలో ఆరు భారీ రంధ్రాలు పడ్డట్లు తాజాగా తీసిన ‘ప్లానెట్ ల్యాబ్స్ పీబీసీ’ఉపగ్రహ ఫొటోల్లో కనిపించింది. అయితే అణుబాంబు తయారీని అడ్డుకునేందుకు బాంబులేశామని, ఇరాన్లో యుద్ధాన్ని ఎగదోసి, ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం తమకు లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టంచేశారు. అయితే అణుబాంబు తయారీ సామర్యాన్ని ఇరాన్ సంతరించుకోవద్దనే లక్ష్యంతోనే తాము యుద్ధంలో పాల్గొన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ సైనికచర్యను సమర్థించుకున్నారు. తమపై ప్రతిదాడి చేస్తే మిగతా లక్ష్యాలపై దాడులు తప్పవని ఇరాన్‌ను హెచ్చరించారు. అయితే దాడుల తర్వాత ఆయా అణుకేంద్రాల నుంచి ఎలాంటి అణుధారి్మకత వెల్లడైన ఛాయలు కనిపించలేదని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ స్పష్టంచేసింది. దాడికి ముందే అక్కడి నుంచి యురేనియం నిల్వలను తరలించినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఊహించనిస్థాయిలో దెబ్బకొడతాం: అబ్బాస్ ఓవైపు అణు మధ్యవర్తిత్వం కోసం స్వాగతం పలుకుతూ మరోవైపు సమరాగ్నిని రాజేస్తున్న అగ్రరాజ్యాన్ని ఊరికే వదిలిపెట్టబోమని ఇరాన్ ప్రతిజ్ఞచేసింది. చరిత్రలో ఎన్నడూలేని స్థాయిలో దాడులుచేసి బదులు తీర్చుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన అబ్బాస్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘దౌత్యనీతిని కాలరాస్తూ అమెరికా మాపై దాడులకు తెగబడింది. మేం దౌత్యాన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టి దేశ రక్షణ కోసం భీకరపోరు చేయాల్సిన తక్షణావసరమిది. దుస్సాహసంతో దారుణంగా దాడులు చేసిన యుద్ధోన్మాద అమెరికా తదుపరి తీవ్ర పర్యావసానాలకు బాధ్యతవహించాల్సి ఉంటుంది. అమెరికా చర్యలకు ఇరాన్ తన సైన్యంతో బదులుతీర్చుకుంటుంది. దేశ భద్రత, జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు ఇరాన్ పాటుపడుతుంది’’అని అబ్బాస్ అన్నారు. మరోవైపు తమపై దాడిచేసిన ఇజ్రాయెల్‌పైనా ఇరాన్ ఆదివారం మిస్సైళ్లను ప్రయోగించింది. తన అమ్ములపొదిలోని మధ్యస్థ శ్రేణి ఖుర్రమ్‌షహర్–4 క్షిపణిను సైతం ఇరాన్ ప్రయోగించింది. ఇది ఒకేసారి 1,500 కేజీల బరువైన వేర్వేరు వార్హెడ్లను ఏకంగా 2,000 కిలోమీటర్లదాకా మోసుకెళ్లగలదు. ఈ క్షిపణిని ఈ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. దాడులను పొగిడిన ఇజ్రాయెల్ ఇరాన్‌పై అమెరికా దాడి చేయడాన్ని ఇజ్రాయెల్ స్వాగతించింది. ఇదొక అద్భుత, సాహసోపేత, చరిత్రాత్మక ఘటనగా అభివర్ణించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ మీడియాతో మాట్లాడారు. ‘‘దాడులు చేయాలని కోరాం. కానీ అమెరికా నిర్ణయం ముందస్తుగా మాకుతెలీదు. ఇదొక చారిత్రక నిర్ణయం. అమెరికా నేరుగా దాడులు చేస్తున్నందున ఇక మేం దాడులు చేయబోమని అనుకోవద్దు. ఇరాన్ మా భూభాగాలపై క్షిపణులు వేస్తోంది. మేం వాటికి బదులు చెప్పాలి’’అని ఇసాక్ అన్నారు. ఆదివారం సైతం ఇరాన్‌లోని డజనుకుపైగా మిలటరీ స్థావరాలపై దాడులుచేశామని చెప్పారు. అయితే ఆస్పత్రులు, మెడికల్ సెంటర్లపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని ఇరాన్ ఆరోపించింది. ఆదివారం నాటికి ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా ఇరాన్లో 865 మందిదాకా చనిపోయారని, 3,396 మంది గాయపడ్డారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ‘హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్’సంస్థ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీని అత్యంత సురక్షిత బంకర్‌కు తరలించినట్లు తెలుస్తోంది. తమ దేశంలో 24 మంది చనిపోయారని, వేయి మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ పాత లెక్కలనే చెబుతోంది మద్దతు కూడగట్టే పనిలో ఇరాన్ ఇరాన్‌పై దాడులను చైనా, రష్యా తీవ్రంగా ఖండించాయి. దాడుల తర్వాత ఇరాన్‌కు ప్రపంచదేశాల నుంచి సైనిక సాయం పెరుగుతుందని రష్యా వ్యాఖ్యానించింది. ఈ మేరకు రష్యా మాజీ అధ్యక్షుడు, దేశ భద్రతామండలి అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదెవ్ ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘దాడుల కారణంగా ఆ అణుకేంద్రాలు పెద్దగా దెబ్బతినలేదు. పైగా ఇరాన్‌కు బయటి మద్దతు పెరుగుతోంది. అణువార్హెడ్లు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి’’అని అన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మంతనాలు జరిపేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆదివారం మాస్కోకు వెళ్లారు. భేటీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జలసంధి దిగ్భందం!! ప్రపంచ చమురు జీవనాడికి పేరొందిన హోర్ముజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ బెదిరించింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయానికి ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలపింది. అయితే జాతీయ ప్రయోజనాలపై కీలక నిర్ణయాలు తీసుకునే ‘సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్’ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అది కూడా ఆమోదిస్తే జలసంధి ద్వారా ముడి చమురు, సహజవాయువు రవాణా నౌకల రాకపోకలు స్తంభించిపోనున్నాయి. దాంతో ఇంధన కొరత ఎక్కువై, గిరాకీ పెరిగి, పెట్రో ధరలు మరింత అధికంకానున్నాయి. భారత్‌పై దీని ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదముంది. మరోవైపు, అమెరికా జోక్యం, బాంబు దాడులతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు నెలకొనడంతో ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్‌తో భారత ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఉద్రిక్తతలపై మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. చర్చలు, దౌత్యం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ వివరాలను మోదీ తన ‘ఎక్స్’ఖాతాలో వెల్లడించారు. -
Israel-Iran Conflict: పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల మూసివేత
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఐదో రోజుకు చేరుకుంది. ఆ దేశాలు ప్రతీకార చర్యలతో రగిలిపోతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్‌పోర్టులను మూసివేయడంతో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గగనతలాలపై ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.తమ గగనతలాన్ని ఇరాన్ పూర్తిగా మూసివేయగా.. అత్యంత కీలకమైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇజ్రాయెల్ మూసివేసింది. దీంతో లెబనాన్, జోర్డాన్, ఇరాక్‌లోనూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. మరో వైపు, తమ అణు స్థావరాలను ధ్వంసం చేయడంతో అత్యున్నత సైనికాధికారులను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్‌కు తగిన గుణపాఠం నేర్పాలన్న టార్గెట్‌తో సోమవారం ఉదయం క్షిపణుల వర్షం కురిపించింది.టెల్ అవీవ్, పెటా తిక్వా ప్రాంతాల్లో భారీగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ఈ దాడుల్లో కనీసం ఎనిమిది మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో టెహ్రాన్ విమానాశ్రయమే లక్ష్యంగా టెల్ అవీవ్ దాడులు చేసింది. రెండు ఎఫ్-14 యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేసింది. -
ఇరాన్‌పై నిప్పుల వర్షం
టెల్ అవీవ్: పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి. ఊహించినట్లుగానే ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం ప్రతీకార చర్యలు ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఇలామ్, ఖుజిస్తాన్, టెహ్రాన్ ప్రావిన్స్‌ల్లోని సైనిక, ఆయుధ స్థావరాలే లక్ష్యంగా దాడులకు దిగింది. మొత్తం 100 ఫైటర్ జెట్లతో మూడు దశల్లో 20 లక్ష్యాలపై కచి్చతత్వంతో కూడిన దాడులు నిర్వహించింది. ఇరాన్‌కు చెందిన క్షిపణి, డ్రోన్ల తయారీ కేంద్రాలు, ప్రయోగ కేంద్రాలపై వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అయితే, చమురు నిల్వలపై దాడులు జరిగాయా లేదా అనేది తెలియరాలేదు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు సమాచారం. తాజా దాడుల్లో ఇరాన్‌కు ఎంతమేరకు నష్టం వాటిల్లిందన్న సంగతి ఇజ్రాయెల్ బయటపెట్టలేదు. ఇరాన్‌పై దాడుల తర్వాత తమ యుద్ధవిమానాలు క్షేమంగా వెనక్కి తిరిగి వచ్చాయని వెల్లడించింది. గత నాలుగు దశాబ్దాల తర్వాత ఇరాన్‌పై మరో దేశం నేరుగా దాడికి దిగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ ఆపరేషకు ఇజ్రాయెల్ ‘పశ్చాత్తాప దినాల మిషన్’ అని పేరుపెట్టింది. రంగంలోకి అత్యాధునిక యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ సైన్యం పక్కా ప్రణాళికతో ఇరాన్‌పై దాడికి దిగినట్లు సమాచారం. అత్యాధునిక ఫైటర్ జెట్లను సైన్యం రంగంలోకి దించింది. ఐదో తరం ఎఫ్–35 అడిర్ ఫైటర్ జెట్లు, ఎఫ్–15టీ గ్రౌండ్ అటాక్ జెట్లు, ఎఫ్–16ఐ సూఫా ఎయిర్ డిఫెన్స్ జెట్లు ఇందులో ఉన్నాయి. ఇవి 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదింగలవు. ఇజ్రాయెల్ ప్రధానంగా ఇరాన్ సైనిక, ఆయుధ స్థావరాలపైనే గురిపెట్టింది. జనావాసాల జోలికి వెళ్లలేదు. తొలుత రాడార్, ఎయిర్ డిఫెన్స్ కేంద్రాలపై దాడికి పాల్పడింది. అనంతరం సైనిక స్థావరాలు, మిస్సైల్, డ్రోన్ల కేంద్రాలపై క్షిపణుల వర్షం కురిపించింది. మొత్తం మూడు దశల్లో దాడులు జరగ్గా, ఒక్కో దశ దాడిలో దాదాపు 30 చొప్పున యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. మరోవైపు ఇరాన్ నుంచి ప్రతిదాడులు జరిగే అవకాశం ఉందన్న అంచనాతో ఇజ్రాయెల్, అమెరికా తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. విమానాల రాకపోకలకు వీల్లేకుండా ఇరాన్, ఇరాక్ తమ గగనతలాన్ని మూసివేశాయి. టెహ్రాన్‌లో సాధారణ పరిస్థితులే.. ఇజ్రాయెల్ దాడుల్లో తమకు పరిమిత నష్టమే వాటిల్లిందని, ఎదురుదాడిలో నలుగురు సైనికులు మృతి చెందారని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులను తమ గగనతల రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టిందని చెప్పారు. దాడుల అనంతరం టెహ్రాన్‌లో సాధారణ పరిస్థితులే కనిపించాయి. పిల్లలు స్కూళ్లకు వెళ్లారు. దుకాణాలు ఎప్పటిలాగే తెరుచుకున్నాయి. పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద మాత్రం జనం బారులు తీరి కనిపించారు. ఇదిలా ఉండగా, ఇరాన్‌పై దాడుల పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఇజ్రాయెల్ చర్యను పలు దేశాలు ఖండించాయి. సంయమనం పాటించాలని సూచించాయి. అమెరికా వంటి మిత్రదేశాలు మాత్రం ఇజ్రాయెల్‌కు మద్దతు పలికాయి. 25 రోజుల తర్వాత ప్రతిదాడి ఇరాన్‌పై దాడుల సందర్భంగా కొన్ని ఫొటోలు, వీడియోలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇందులో టెల్ అవీవ్ ఉన్న కిర్యా మిలటరీ బేసులోని మిలటరీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ సైనిక సలహాదారులతో, సైనికాధికారుతో చర్చిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్»ొల్లా, హమాస్ నాయకులు మరణించడం పట్ల ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోయింది. ఈ నెల 1న ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ భూభాగంపై దాదాపు 200 క్షిపణులు ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇరాన్ పెద్ద తప్పు చేసిందని, తాము తగిన జవాబు ఇవ్వక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అప్పుడే హెచ్చరించారు. ఇరాన్ దాడి చేసిన వెంటనే ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగే అవకాశం ఉందని అప్పట్లో భావించినప్పటికీ ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గింది. అప్పుడు వాతావరణం అనుకూలించకపోవడంతో తమ ఆపరేషన్ వాయిదా వేసుకుంది. పరిస్థితులు సానుకూలంగా మారడంతో 25 రోజుల తర్వాత ఇరాన్‌పైకి యుద్ధ విమానాలు పంపించింది. -
రేటు కోతకు వేళాయెనా..!
ముంబై: పశి్చమాసియాలో యుద్ధ వాతావరణంసహా భౌగోళిక ఉద్రికత్తలు, దీనితో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ద్రవ్య పరపతి విధానాన్ని ఆరుగురు సభ్యుల రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) యథాతథంగా కొనసాగించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపోను వరుసగా 10వ పాలసీ సమీక్షలోనూ 6.5% వద్దే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే విధాన వైఖరిని మాత్రం 2019 జూన్ నుంచి అనుసరిస్తున్న ‘సరళతర ఆర్థిక విధాన ఉపసంహరణ’ నుంచి ‘తటస్థం’ వైపునకు మార్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది సానుకూలాంశమని, సమీప భవిష్యత్తులో రెపో రేటు తగ్గింపునకు సంకేతమని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్‌సూద్ సహా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణం దిగొస్తుందన్న భరోసాతో పాలసీ వైఖరి మార్పు నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప, రేటు కోతపై మాట్లాడ్డానికి ఇది తగిన సమయం కాదని ఆర్బీఐ గవర్నర్ దాస్ స్పష్టం చేశారు. పాలసీ సమీక్షలో ముఖ్యాంశాలు... → ఆర్బీఐ తాజా నిర్ణయంతో 2023 ఫిబ్రవరి నుంచి రెపో రేటు యథాతథంగా 6.5% వద్ద కొనసాగుతోంది. → 2024–25 ఆర్థిక సంవత్సరం దేశ ఎకానమీ వృద్ధి రేటు అంచనాను యథాతథంగా 7.2 శాతంగా పాలసీ కొనసాగించింది. ఇప్పటికే వెల్లడైన అధికారిక గణాంకాల ప్రకారం ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎకానమీ 6.7 శాతం పురోగతి సాధించగా, క్యూ2, క్యూ3, క్యూ4లలో వృద్ధి రేట్లు వరుసగా 7, 7.4, 7.4 శాతాలుగా నమోదవుతాయని పాలసీ అంచనావేసింది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందన్న గత విధాన వైఖరిలో మార్పులేదు. క్యూ2, క్యూ3, క్యూ4లలో వరుసగా 4.1 శాతం, 4.8 శాతం, 4.2 శాతాలుగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందని, 2025–26 తొలి త్రైమాసికంలో ఈ రేటు 4.3 శాతమని పాలసీ అంచనావేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటుఇటుగా 4 శాతం వద్ద ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొంటున్న సంగతి తెలిసిందే. → ఫీచర్ ఫోన్ యూపీఐ123పే పరిమితిని లావాదేవీకి ప్రస్తుత రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచడం జరిగింది. → లైట్ వాలెట్ పరిమితి ప్రస్తుత రూ.2,000 నుంచి రూ.5,000కు పెరిగింది. లావాదేవీ పరిమితి రూ.500 నుంచి రూ.1,000కి ఎగసింది. → తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 4 నుంచి 6వ తేదీల మధ్య జరగనుంది.వృద్ధికి వడ్డీరేట్లు అడ్డుకాదు... ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై సెంట్రల్ బ్యాంక్ నిస్సందేహంగా దృష్టి సారించింది. ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న విశ్వాసంతోనే పాలసీ విధాన వైఖరిని మార్చడం జరిగింది. అయితే రేటు కోత ఇప్పుడే మాట్లాడుకోవడం తగదు. ఇక వృద్ధిపై ప్రస్తుత వడ్డీరేట్ల ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు గత 18 నెలల కాలంలో మాకు ఎటువంటి సంకేతాలు లేవు. భారత్ ఎకానమీ పటిష్ట వృద్ధి బాటలో పయనిస్తోంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణ నాణ్యతపై అత్యధిక దృష్టి సారించాలి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ వృద్ధికి దోహదం.. ఆర్బీఐ విధాన ప్రకటన పటిష్ట వృద్ధికి, ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడే అంశం. పాలసీ వైఖరి మార్చుతూ తీసుకున్న నిర్ణయం.. ద్రవ్యోల్బణాన్ని 4% వద్ద కట్టడి చేయడానికి ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందన్న అంశాన్ని స్పష్టం చేస్తోంది. – సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్ రియలీ్టకి నిరాశ..హౌసింగ్ డిమాండ్‌ను పెంచే అవకాశాన్ని ఆర్బీఐ కోల్పోయింది. రియలీ్టకి ఊపునివ్వడానికి రేటు తగ్గింపు కీలకం. వచ్చే పాలసీ సమీక్షలోనైనా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకోవాలని ఈ రంగం విజ్ఞప్తి చేస్తోంది. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ వైఖరి మార్పు హర్షణీయం.. ఆర్బీఐ పాలసీ వైఖరి మార్పు హర్షణీయం. రానున్న సమీక్షలో రేటు కోత ఉంటుందన్న అంశాన్ని ఇది సూచిస్తోంది. ఎకానమీ పురోగతికి తగిన పాలసీ నిర్ణయాలను ఆర్బీఐ తగిన సమయాల్లో తీసుకుంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది. – దీపక్‌సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
అభద్రతను పెంచుతున్న యుద్ధం
హమాస్–ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధాలను నిరోధించ వలసిన ఐక్యరాజ్య సమితి లాంటివి నిర్వీర్యమైపోతున్నాయి. ముఖ్యంగా గాజా యుద్ధంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఐరాస సిబ్బందికే రక్షణ లేని పరిస్థితి. ఇక అంతర్జాతీయ న్యాయస్థానాన్ని నెతన్యాహూకు అరెస్ట్ వారెంట్ జారీ చేసినందుకు ఇజ్రాయెల్, దాని మిత్ర దేశాలు ఆంక్షల విధింపు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. వైరి పక్షాలను చర్చల వేదికపైకి తేగలిగిన మధ్యవర్తులు కానరాని పరిస్థితి! ఇదే సమయంలో ఇజ్రాయెల్‌కు తన శత్రువులపై దాడిచేసే సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ... దాని పౌరులు రోజు రోజుకూ అభద్రతాభావంలో కూరుకుపోతుండటం గమనార్హం.ఒక సంవత్సరం క్రితం, అక్టోబర్ 7న జరిగిన ఘటన ఉక్రెయిన్‌లో యుద్ధం నుండి ప్రపంచం దృష్టిని మళ్లించింది. నేడు, హమాస్ తీవ్రవాద దాడిపట్ల ఇజ్రాయెల్ ప్రతిస్పందన చాలా తీవ్రంగా మారిపోయింది. దీనితో పోలిస్తే మిగతా వన్నీ అప్రధానంగానే ఉన్నాయి. దాదాపు 45,000 మంది, వీరిలో ఎక్కువగా పౌరులు మరణించారు. కనుచూపు మేర కాల్పుల విరమణ లేదు. పైగా వేగంగా పెరుగుతున్న సంఘర్షణ కారణంగా, పశ్చిమాసి యాను యుద్ధం చుట్టుముట్టే అవకాశం ఒక ప్రమాదకరమైన వాస్తవంగానే కనబడుతోంది. కొంత వరకు ఉక్రెయిన్ యుద్ధం, ప్రధానంగా ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం... ప్రాంతీయ యుద్ధాలకు మధ్యవర్తిత్వం వహించే లేదా వాటికి ముగింపు పలికే సామర్థ్యం గల మధ్యవర్తులు కనిపించని ప్రపంచంలో మనం ఈ రోజు ఉన్నామనే వాస్తవాన్ని ఎత్తి చూపుతున్నాయి.ఇజ్రాయెల్, ఇరాన్ లేదా అమెరికాను చేరుకోగల ఉపయోగ కరమైన పరోక్ష మార్గాలు కానీ లేదా వారిని సంధానించేవారు కానీ ఇప్పుడు ఎవరూ లేరు. సైద్ధాంతికంగా చెప్పాలంటే, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించే లేదా పొడిగించే స్థితిలో అమెరికా ఉండవచ్చు, కానీ పశ్చిమాసియా విషయానికి వస్తే దాని నిస్సహాయత ఆశ్చర్యక రంగా ఉంది. ఈ ప్రాంతంలో పరిష్కారం కోసం ప్రపంచం వాషింగ్టన్ వైపు చూస్తూనే ఉంది, కానీ దాని స్వీయ అధ్యక్ష ఎన్నికల కారణంగా, అమెరికన్ బాడీ పాలిటిక్స్‌పై ఇజ్రాయెల్ ప్రభుత్వం చూపే ప్రభావం కారణంగా అమెరికాకు పరిష్కారం సాధ్యం కావడం లేదు.మరోవైపున అగ్రరాజ్య స్థాయి కోసం ఎదురుచూస్తున్న చైనా మౌనం కూడా ఆసక్తి గొల్పుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పక్షాన చైనా ఉండగా, ఎర్ర సముద్రం సంక్షోభం సమయంలో అది నిష్క్రియాపరత్వంతో వేచి ఉంటోంది. పైగా ఇతర చోట్ల ప్రపంచ సంక్షోభాలను తగ్గించే విషయంలో చైనా పాత్ర తక్కువే అని చెప్పాలి. ఇక పశ్చిమాసియా సంక్షోభంపై మధ్యవర్తిత్వం వహించడంలో చైనా ఏమాత్రం ఆసక్తి చూపలేదు. భారతదేశం ఇప్పటికీ అలాంటి కర్తవ్యా లను చేపట్టేంత శక్తిమంతమైన దేశంగా తనను తాను భావించడం లేదు. రెండో ప్రపంచ యుద్ధానంతర సంస్థలు ప్రపంచ స్థాయిలో నిర్మాణాత్మక అసమానతలను కొనసాగించినప్పటికీ, సంస్థలు,నిబంధనలు లేని ప్రస్తుత ప్రపంచం అధ్వానంగానే ఉంటుంది.ఐక్యరాజ్యసమితిని పరిశీలిస్తే... అది రోగలక్షణంతో అసమర్థ మంతంగానూ, నిస్సహాయంగానూ మారిపోయినట్లుంది. అందుకే యుద్ధంలో పాల్గొంటున్న పక్షాలు... ఐరాస సిబ్బంది ఉన్న ప్రాంతా లలో కూడా బాంబు దాడి చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. పోరాడుతున్న పక్షాలకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి చేసిన విజ్ఞప్తులను ఇజ్రాయెల్ ఇటీవల ధిక్కరించినట్లుగానే, మీడియా కూడా దాన్ని సీరియస్‌గా పరిగణించడం లేదు.అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) ఉదంతాన్ని తీసుకోండి. ఇది ఇజ్రాయెల్ ఆగ్రహ జ్వాలలకు గురవుతూ ఉండడం మాత్రమే కాకుండా... అమెరికా, ఐరోపాలోని ఇజ్రాయెల్ సన్నిహిత మిత్రుల అగ్రహాన్ని కూడా చవిచూస్తూ ఉంది. హాస్యాస్పదంగా, రష్యా అధ్య క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఐసీసీ అరెస్ట్ వారెంట్లు జారీ చేయాలనే విషయంపై ఆసక్తిగా ఉన్న దేశాలు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అదే విధంగా అరెస్ట్ వారెంట్ జారీ చేసినందుకు మాత్రం ఐసీసీపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాయి. రెండు యుద్ధాలూ నైతిక పరిగణనలు వాడుకలో లేని ప్రపంచం వైపు మనల్ని తీసుకెళ్తున్నాయి. ఇంకా, నైతిక రాజకీయం రోజువారీ ప్రభుత్వ ఆచరణలో చెడుకు చెందిన సామాన్యతను కొలిచేందుకు ఒక కొలమానాన్ని అందిస్తుంది. దేశీయ రాజకీయాలు లేదా అంతర్జాతీయ సంబంధాలలో, నైతిక ప్రమాణాలు లేనిదాని కంటే నైతిక ద్వంద్వ ప్రమాణాలు ఉత్తమం. ఆచరణలో లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ, కొలత కోసం మనకు ఒక టేప్ అవసరం. ఈ యుద్ధంలో చెడుకు సంబంధించిన సామాన్యత విషయంలో అత్యంత కలతపెట్టే ఉదా హరణ ఏదంటే హమాస్ టెర్రరిస్టులను గాజా ప్రజలతో సమానం చేయడం– అలాంటి చట్రాలను మనం మౌనంగా ఆమోదించడం!ఏ రకంగా చూసినప్పటికీ ఇజ్రాయెల్ మరింత ఒంటరిగా, అభద్రతతో ఉంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడులు, దాని అసమాన ప్రతీకార చర్యలు జరిగి ఒక సంవత్సరమైంది. కానీ ఇజ్రాయెల్ అనుభూతి చెందుతున్న శాశ్వతమైన అభద్రతా భావం ఇప్పుడు పెరుగుతున్న ఒంటరితనంతో పాటు మరింత తీవ్రమైంది.ఇజ్రాయెల్‌కు తన శత్రువులను మరింత ఎక్కువ శక్తితో కొట్టే సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ, ఈ ప్రాంతంలో సంపూర్ణ దుర్బ లత్వం కూడా స్పష్టంగా ఉంది. ఇరాన్ దాని ప్రాక్సీ గ్రూపులుగా గాజా, ఇరాక్, లెబనాన్, సిరియా గురించి ఇజ్రాయెలీలు పిలుస్తున్న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అనేది ఇప్పుడు మరింత తీవ్రమైంది. ఇజ్రాయెల్ పౌరులు కొన్ని సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు మరింత సురక్షితంగా ఉన్నారా అనేది సందేహమే. ఒక దేశం ఎంత శక్తిమంతమైన దేశమైన ప్పటికీ, నిశ్చయాత్మకమైన, సైద్ధాంతికంగా ప్రేరేపితులైన విరోధుల నుండి తనను తాను రక్షించుకోలేకపోతుంది, ప్రత్యేకించి దాని సొంత చర్యలు విరోధుల లక్ష్యాన్ని మరింతగా నిలబెడుతున్నప్పుడు అది అసలు సిద్ధించదు.నేడు ఇజ్రాయెల్ మరింత అభద్రతాభావంతో ఉండటమే కాకుండా ప్రపంచం సానుభూతిని కూడా కోల్పోతోంది. ఇజ్రాయెల్ ఇప్పుడు దాని మితిమీరిన చర్యలకూ, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినందుకూ, ప్రత్యేకించి గ్లోబల్ సౌత్‌లోని వారిచే వివిధ అంత ర్జాతీయ ఫోరమ్‌లలో సాధారణంగా ఆక్షేపించబడుతూ, విమర్శల పాలవుతోంది. గ్లోబల్ సౌత్ మద్దతుపై ఇజ్రాయెల్‌కు పెద్దగా పట్టింపు లేకపోయినా, ఇజ్రాయెల్ వైపు నిలిచిన యూరోపియన్, ఉత్తర అమె రికా మద్దతుదారులు కనీసం భౌగోళిక రాజకీయ కారణాల వల్ల దక్షి ణాదిని విస్మరించడం కష్టం. అమెరికా ఇప్పటికీ ఇజ్రాయెల్ కోసం బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో అమెరికా యువతరంలో ఇజ్రాయెల్‌కి చెందిన సమస్యపై, విభేదాలు పెరుగుతున్నాయి.మొత్తం మీద చూస్తే అబ్రహం ఒప్పందాలు ప్రమాదకరమైన స్థితిలో ఊగిసలాడుతున్నాయి, వీధుల్లో జనాదరణ పొందిన మనో భావాల ద్వారా నడపబడుతున్న యుద్ధ స్వభావం పెరుగుతున్న కొద్దీ అది ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంది. ఫలితంగా, గల్ఫ్ దేశాలు, ప్రత్యేకించి, పాలస్తీనా ఉచ్చులోంచి బయటపడాలని కోరుకున్నప్ప టికీ అవి బలవంతంగా తిరిగి యుద్ధబాటలోకి వెళ్లవచ్చు కూడా.ఇజ్రాయెల్ ప్రభుత్వానికీ, ప్రజలకూ దీని అర్థం ఏమిటంటే పెరుగుతున్న అభద్రత, ప్రపంచ సానుభూతిని కోల్పోవడంతో పాటు కనికరం లేని విలన్లుగా ముద్ర వేయబడటమే. ఈ యుద్ధం నెతన్యా హుకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలను కప్పిపుచ్చడమే కాకుండా ఇజ్రాయెల్ ఉదారవాద, ప్రజాస్వామ్య విలువలను అణిచివేసే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు తమను తాము ప్రజలుగా ఊహించుకునే భవిష్యత్తు ఇదేనా? గాజా ప్రజలకు ఇజ్రాయెలీలు ఏమి చేస్తున్నారో అది ఇజ్రాయెల్ ప్రజలుగా వారిపై కూడా ఒక నిర్దిష్ట ప్రభావాన్ని చూపుతుంది.భారతదేశంలోని మనకు, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ’శ్వేత జాతీ యులు శ్వేతజాతీయులను చంపేస్తున్నారు’ అనేటటువంటి కేవల యూరోప్ సమస్యగా మాత్రమే విస్మరించడం సులభం. కానీ పశ్చి మాసియాలో యుద్ధం ప్రాథమికంగా భిన్నమైనది – అది ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఊహించని మార్గాల్లో మనపై ప్రభావం చూపుతుంది.హ్యాపీమాన్ జాకబ్ వ్యాసకర్త జేఎన్‌యూలో భారత విదేశీ విధాన బోధకుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్ సౌజన్యంతో...) -
యుద్ధ భయాలు.. ఊరించే స్టాక్‌లు
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో అస్తవ్యస్తంగా మారిన ఆరి్థక వ్యవస్థలకు... చినికి చినికి ‘మిసైళ్ల’వానగా మారిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య పోరు లెబనాన్‌కు పాకడం.. తాజాగా ఇరాన్ కూడా రణరంగంలోకి దూకి ఇజ్రాయెల్‌పై మిసైళ్ల వర్షం కురిపించడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రపంచ స్టాక్ మార్కెట్లను వణికిస్తోంది. క్రూడ్ ధరలు భగ్గుమనడం (10% పైగా జంప్) మనలాంటి వర్ధమాన దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ పరిణామాలతో సెన్సెక్స్ 4,422 పాయింట్లు, నిఫ్టీ 1,383 పాయింట్లు, అంటే 5.3% చొప్పున పతనమయ్యాయి. గడిచిన రెండేళ్లలో వారం రోజుల్లో మార్కెట్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి. అయితే, ఈ పతనాలను చూసి రిటైల్ ఇన్వెస్టర్లు మరీ అందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. గత యుద్ధాల సమయంలో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ క్రాష్‌ను సదవకాశంగా మలచుకోవాలనేది విశ్లేషకుల మాట!! నాన్‌స్టాప్‌గా దౌడు తీస్తున్న బుల్‌కు పశి్చమాసియా యుద్ధ ప్రకంపనలు బ్రేకులేశాయి. రోజుకో కొత్త ఆల్‌టైమ్ రికార్డులతో చెలరేగిన దేశీ స్టాక్ మార్కెట్లో ఎట్టకేలకు కరెక్షన్ మొదలైంది. సూచీలు 5 శాతం పైగా క్షీణించగా.. ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.26 లక్షల కోట్లు ఆవిరైంది. టాప్–10 కంపెనీల మార్కెట్ విలువ సుమారు రూ.7 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటిదాకా మార్కెట్‌ను పరుగులు పెట్టించిన విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో రివర్స్‌గేర్ వేశారు. మరోపక్క, చైనా ఉద్దీపక ప్యాకేజీ ప్రభావంతో మన మార్కెట్ నుంచి వైదొలగి అక్కడికి క్యూ కడుతున్నారు. గత 4 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో దీర్ఘకాల లక్ష్యంతో ఇన్వెస్ట్ చేసే మదుపరులకు ఇది మంచి చాన్సని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. చారిత్రకంగా చూస్తే, ఇలాంటి ఉద్రిక్తతలు, యుద్ధాల సమయంలో మార్కెట్లు స్వల్పకాలానికి భారీగా పడటం లేదంటే దిద్దుబాటుకు లోనైనప్పటికీ... మళ్లీ కొద్ది వారాలు, నెలల్లోనే పుంజుకున్నాయని, భారీగా లాభాలను పంచాయని గణాంకాలతో సహా వారు ఉటంకిస్తున్నారు.క్వాలిటీ స్టాక్స్.. మంచి చాయిస్! స్వల్పకాలిక తీవ్ర ఒడిదుడుకుల ఆధారంగా ఇన్వెస్టర్లు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదని.. గతంలో మంచి పనితీరు కనబరిచి తక్కువ ధరల్లో (వేల్యుయేషన్లు) దొరుకుతున్న నాణ్యమైన షేర్లను ఎంచుకోవడం ద్వారా లాంగ్ టర్మ్ పెట్టుబడులకు పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, మంచి డివిడెండ్ రాబడులను అందించే స్టాక్స్ కూడా ఈ పతనంలో కొనుగోలుకు మరింత ఆకర్షణీయమైన ఆప్షన్ అనేది వారి అభిప్రాయం. ఊరించే వేల్యుయేషన్లు... ‘పటిష్టమైన పోర్ట్‌ఫోలియోను నిరి్మంచుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి’ అని రైట్ రీసెర్చ్ ఫౌండర్ సోనమ్ శ్రీవాస్తవ చెప్పారు. భారీ పీఈ (ప్రైస్ టు ఎరి్నంగ్స్) నిష్పత్తితో కూడిన అధిక వేల్యుయేషన్ స్టాక్స్.. ఈ కరెక్షన్లో మరింతగా దిగొచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో చేతిలో క్యాష్ పుష్కలంగా ఉన్న మదుపరులు... తక్కువ ధరల్లో ఇలాంటి ఊరించే షేర్లను కొనుగోలు చేయడం బెటర్ అంటున్నారు మార్కెట్ పరిశీలకులు.‘మార్కెట్లో ఈ కుదుపులు సద్దుమణిగి, పరుగులంకించుకున్నప్పుడు కొత్త పెట్టుబడులు భారీ లాభాలను అందించే అవకాశం ఉంటుంది’ అని వీఎస్ఆర్కే క్యాపిటల్ డైరెక్టర్ స్వాప్నిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇటీవలి బుల్ రన్‌కు మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు దన్నుగా నిలిచాయి, తాజా కరెక్షన్లో ఇవే భారీగా పతనమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక దృష్టితో లార్జ్ క్యాప్ స్టాక్స్‌ను ఎంచుకోవడం తెలివైన ఆప్షన్ అనేది నిపుణుల సలహా!ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. తమ లాంగ్ పొజిషన్లను తగ్గించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టీ మరో 5 శాతం క్షీణించే అవకాశం ఉంది. – రాజేశ్ పలి్వయా, వైస్ ప్రెసిడెంట్, యాక్సిస్ సెక్యూరిటీస్– సాక్షి, బిజినెస్ డెస్క్ -
నెతన్యాహుతో మాట్లాడిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఆయన చర్చించారు. ప్రస్తుత ప్రపంచంలోనే ఉగ్రవాదానికి చోటులేదని తేల్చిచెప్పారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను నివారించడం ఎంతో అవసరమని నొక్కిచెప్పారు. అదే సమయంలో బందీలందరినీ సురక్షితంగా విడుదలయ్యేలా చూడాలన్నారు. పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతి, సుస్థిరతలను నెలకొల్పే ప్రయత్నాలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని నెతన్యాహూకు హామీ ఇచ్చినట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. అయితే, ప్రత్యేకంగా ఏ సంఘటననూ ప్రధాని మోదీ ప్రస్తావించలేదు. -
ఐసిస్‌పై లక్ష మిసైళ్లు
ఐసిస్.. సిరియా, ఇరాక్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడులు నిర్వహించి వేలాదిమందిని పొట్టనపెట్టుకున్న రాక్షసమూక. పశ్చిమాసియా దేశాలైన సిరియా, ఇరాక్‌లో గణనీయమైన భూభాగాన్ని అక్రమించుకుని ఖలీఫత్ పేరిట 2014లో ఏకంగా సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆయిల్, ఇతర సహజవనరుల్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ ఆ సొమ్ముతో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద భావజాలానికి మద్దతుగా నిలిచింది. మైనారిటీ మతస్తుల్ని బందీలుగా చేసుకుని గొంతు కోసి హతమార్చడం, తమ భావజాలాన్ని వ్యతిరేకించే సొంత మతస్తుల్ని సజీవ దహనం చేయడం వంటి దారుణ చర్యలతో వణుకు పుట్టించింది. అయితే ఇదంతా గతం. 2014లో ఐసిస్‌ను అణచివేసేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా భారీ ఎత్తున వైమానిక దాడులకు ఆదేశాలిచ్చారు. చివరికి 2017, అక్టోబర్‌లో ఐసిస్ ఉగ్రవాదులు నక్కిన చివరి నగరమైన రక్కాను సంకీర్ణ సేనలు స్వాధీనం చేసుకోవడంతో ఐసిస్‌ను ఓడించేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటించారు. అయితే నిజంగానే ఐసిస్‌ను పూర్తిగా అణచేశారా? భవిష్యత్‌లో ఉగ్రదాడులు చేయడానికి వీల్లేకుండా దాన్ని ఆర్థికమూలాల్ని పూర్తిగా నాశనం చేశారా? అంటే జవాబు కాదనే వినిపిస్తోంది. ఈ విజయం తాత్కాలికమే: జమాత్–అల్–తావీద్–వల్–జీహాద్ (జేటీజే) పేరుతో 1999లో ఏర్పడ్డ ఈ సంస్థ.. క్రమక్రమంగా పశ్చిమాసియాలో పట్టు పెంచుకోవడం ప్రారంభించింది. లాడెన్ నేతృత్వంలోని అల్‌కాయిదాకు విధేయత ప్రకటించుకున్న జేటీజే.. 2003లో ఇరాక్‌పై–అమెరికా యుద్ధంలో పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా దాడులకు పాల్పడింది. 2014 నాటికి ఇరాక్, సిరియాల్లో గణనీయమైన భూభాగాన్ని స్వాధీనం చేసుకుని సంస్థ పేరును ఐసిస్‌గా మార్చుకుంది. అప్పట్నుంచి ప్రపంచవ్యాప్తంగా సిరియా, ఇరాక్, ఫ్రాన్స్, బెల్జియం సహా 29 దేశాల్లో 140 ఉగ్రదాడులకు పాల్పడి వేలాది మందిని పొట్టనపెట్టుకుంది. కశ్మీర్‌లోనూ అల్లరిమూకలు ఐసిస్ జెండాలు ప్రదర్శించంపై భారత నిఘా సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఓ రక్షణ సంస్థ నివేదిక ప్రకారం సంకీర్ణ సేనలు ఐసిస్ అధీనంలోని 29,741 స్థావరాలపై ఇప్పటివరకూ 1,07,814 మిస్సైళ్లను, బాంబుల్ని ప్రయోగించాయి. ఈ దాడుల్లో 60,000 మంది ఉగ్రవాదులు, 6,321 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఓవైపు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు, మరోవైపు రష్యా, ఇరాన్, సాయంతో పోరాడుతున్న సిరియన్ బలగాలు ఐసిస్ కబంధ హస్తాల నుంచి చాలా పట్టణాలకు విముక్తి కల్పించాయి. అయితే ఈ విజయం తాత్కాలికమేననీ, ఇరుపక్షాల మధ్య దీర్ఘకాలిక పోరాటానికి ఇది ఆరంభమేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకూ అఫ్గాన్‌లో 17 మంది అమెరికన్ కమాండర్లు మారినా పరిస్థితి మారకపోవడాన్ని గుర్తుచేస్తున్నారు. సోషల్ మీడియానే ఆయుధం: సంకీర్ణ సేనలు, రష్యా, ఇరాన్ బలగాల వరుస దాడులతో కుదేలయినప్పటికీ ఈ ప్రాంతంలో ఐసిస్ తన ప్రాబల్యాన్ని పూర్తిగా కోల్పోలేదని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. అమెరికా, యూరప్ దేశాలపై ఆత్మాహుతి దాడులతో విరుచుకుపడాలని సామాజిక మాధ్యమాల ద్వారా యువతకు ఉగ్రవాదులు విషాన్ని నూరిపోస్తున్నారని తెలిపారు. సరికొత్తగా గెరిల్లా యుద్ధ తంత్రాన్ని అనుసరిస్తున్నారన్నారు. ఇందులోభాగంగా యుద్ధాలు, ప్రభుత్వ అసమర్ధత కారణంగా ఉపాధి లేకుండా నిరుద్యోగులుగా ఉన్న యువతను భారీగా భర్తీ చేసుకుంటూ ఐసిస్, ఇతర ఉగ్రసంస్థలు శక్తిమంతంగా మారేందుకు యత్నిస్తున్నాయని చెప్పారు. ఉగ్రమూకల్ని అణచివేయడంలో సైనిక చర్య ద్వారా తాత్కాలిక ఫలితాలను మాత్రమే సాధించగలమనీ, దీర్ఘకాలంలో పరిస్థితిలో ఎలాంటి మార్పు రాబోదన్నారు. ఈ దేశాల్లో సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని పరిష్కారానికి యత్నించినప్పుడు సానుకూల ఫలితాలు వస్తాయన్నారు. ► సంకీర్ణ సేనలు లక్ష్యంగా చేసుకున్న ఐసిస్ స్థావరాలు 29,741 ► ఐసిస్‌పై ప్రయోగించిన మిస్సైళ్లు, బాంబులు 1,07,814 ► హతమైన ఉగ్రవాదులు 60,000 ► చనిపోయిన పౌరులు 6,321 ► ఐసిస్ పంజా విసిరిన దేశాలు 29 ► ప్రపంచవ్యాప్తంగా జరిపిన ఉగ్రదాడులు 140 ► ఐసిస్ వద్ద ఆధునిక మెషీన్గన్ల నుంచి రసాయన ఆయుధాల వరకు ► ఇటీవలే బల్గేరియా నుంచి ఓ శక్తివంతమైన మిసైల్‌ను కూడా ఐసిస్ సేకరించిందన్న అమెరికా -
పశ్చిమాసియా దేశాల పర్యటనకు ప్రధాన మోదీ