
న్యూఢిల్లీ: గాజాలో బందీలుగా ఉన్న మొత్తం 20 మందిని హమాస్ విడుదల చేయడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు పశ్చిమాసియా ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు నిజాయితీతో సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. ‘రెండేళ్లకు పైగా నిర్బంధంలో ఉన్న బందీలందరి విడుదలను స్వాగతిస్తున్నాం. వారి స్వేచ్ఛ వారి కుటుంబాల ధైర్యానికి, అధ్యక్షుడు ట్రంప్ తీవ్రమైన శాంతి ప్రయత్నాలకు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ బలమైన సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది’అని ప్రధాని మోదీ సోమవారం ఎక్స్‌లో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలకు తాము తోడుగా ఉంటామన్నారు.