ఎయిరిండియా విమానం గాలిలో ఉన్నప్పుడు, మాజీ క్యాబిన్ క్రూ సభ్యురాలు ఒకరు కాక్‌పిట్‌లో కూర్చోని రీల్ చేయడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ప్రయాణీకుల భద్రతపై ఆందోళన లేవనెత్తింది. దీనిపై ఎయిరిండియా స్పందించింది. ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించింది. అసలు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక మహిళ పైలట్ సీటులో కూర్చున్నట్లు కనిపిస్తుంది. కెమెరాను అద్దం (విండ్‌స్క్రీన్ )వైపు తిప్పినప్పుడు బయట మేఘాలు కనిపిస్తుండటంతో, విమానం గాలిలో ఉన్నప్పుడే ఈ వీడియో తీసినట్లు స్పష్టమవుతోంది. విమానయాన భద్రతా ప్రోటోకాల్‌ల గురించి చర్చకు దారితీసింది.క్లిప్‌ను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తూ, “విమానం గాలిలో ఉంది, ఒక ఎయిర్ హోస్టెస్ కాక్‌పిట్‌లో కూర్చుని రీల్స్ తయారు చేస్తోంది. ఇది నిజంగా దీనికి అనుమతి ఉందా? ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన వారిని చూడటం చాలా బాధగా ఉంది అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ వీడియో భద్రతా నిబంధనల ఉల్లంఘనేనంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఇన్‌స్టాగ్రామ్ డౌన్, యూజర్లు గగ్గోలు
ఈ ఘటనపై ఎయిరిండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాక్‌పిట్‌లోకి ప్రవేశించడానికి కఠినమైన ప్రోటోకాల్ ఉంది. దీన్ని అధిగమించడాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని క్యారియర్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వీడియోను ఎపుడు, ఎలా చిత్రీకరించారు, దీని యథార్థతను తెలుసుకోవడానికి విచారణ ప్రారంభించామని, దర్యాప్తు ఫలితాల ఆధారంగా తగిన చర్య తీసుకుంటామని ఎయిరిండియా తెలిపింది, కాక్‌పిట్ ప్రవేశంపై ఎయిర్ ఇండియాకు కఠినమైన నిబంధనలు ఉన్నాయని, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని ఎయిరిండియా స్పష్టం చేసింది.
Wait until you see the end of this video. The plane is in the air and an air hostess is sitting in the cockpit making reels. Is this really allowed? Feels quite disturbing to see something like this when passenger safety is supposed to be the top priority. @DGCAIndia pic.twitter.com/91Nmsr9R70
— Nikhil saini (@iNikhilsaini) March 10, 2026
డీజీసీఏ నిబంధనలేంటి?
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనల ప్రకారం విమానం గాలిలో ఉన్నప్పుడు కాక్‌పిట్‌లో ఎప్పుడూ కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండాలి.ఒకవేళ పైలట్‌లలో ఒకరు విరామం కోసం లేదా అత్యవసర పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే, ఆ సమయంలో ఒక క్యాబిన్ క్రూ సభ్యుడిని లోపలికి పిలుస్తారు. రెండవ పైలట్ తిరిగి వచ్చే వరకు ఆ క్రూ సభ్యుడు అక్కడే ఉండాలి. కొందరు నెటిజన్లు ఈ నిబంధనను ప్రస్తావిస్తూ, బహుశా పైలట్ బయటకు వెళ్లిన సమయంలో నిబంధనల ప్రకారమే ఆమె లోపలికి వెళ్లి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ఘటనపై ఎయిరిండియా దర్యాప్తులో ఏం తేలనుందో వేచి చూడాల్సిందే.


