అమెరికా న్యూయార్క్‌లో భారీ మంచు తుఫాను పొంచి ఉన్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 25, 26 తేదీలలో అక్కడికి వెళ్లే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల భద్రత నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అమెరికాకు మంచు తుపానులు భయం పట్టుకుంది. ఈ వారాతంలో ఆ దేశం తీవ్ర మంచుతుపాను ఎదుర్కొనే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో USA అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం స్పందించారు. తుపానును ఎదుర్కొవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సన్నద్ధమైందని ప్రకటించారు. అయితే దీని ప్రభావం భారత్‌లోని విమానయాన సంస్థలపై సైతం పడింది. మంచు తుఫాన్ నేపథ్యంలో న్యూయార్క్ వెళ్లే విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
ఈ విమానాల రద్దుపై వివరణ ఇస్తూ సంస్థ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. "అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాలలో రేపు, ఎల్లుండి తీవ్ర మంచుతుఫాను ప్రభావం ఉండనుంది. యుఎస్ తూర్పు తీరంలో ఈ ప్రభావం మరింత అధికంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా జనవరి 25,26 తేదీలలో అక్కడికి ప్రయాణించే విమానాలను రద్దు చేస్తున్నాం. ఈ క్యాన్సిలేషన్‌పై పూర్తి సమాచారం మా సిబ్బంది ప్రయాణికులకు వ్యక్తిగతంగా అందిస్తుంది". అని ఎక్స్‌లో ఎయిర్‌ఇండియా పోస్ట్ చేసింది.
అయితే ప్రస్తుతం రాబోయే మంచు తుఫాన్ అమెరికాలో 2/3 మందిని ఎఫెక్ట్ చేస్తుందని సీఎన్ఎన్ కథనం ప్రచురించింది. ప్రస్తుతం వచ్చే మంచుతుఫాన్ టెక్సాన్ నుంచి ఇంగ్లాండ్ వరకూ దాదాపు 2వేల కిలోమీటర్ల మైళ్లు ప్రయాణించనున్నట్లు పేర్కొంది. దీనివల్ల దేశంలోనే విద్యుత్‌వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది.


