యూఏఈ కాన్సులేట్‌పై డ్రోన్ దాడి | Australia to send missiles to help Emiratis | Sakshi
Sakshi News home page

యూఏఈ కాన్సులేట్‌పై డ్రోన్ దాడి

Mar 10 2026 7:28 AM | Updated on Mar 10 2026 8:21 AM

Australia to send missiles to help Emiratis

దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుతున్నాయి. ఇరాన్ కేంద్రంగా సాగుతున్న దాడులు గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఇరాక్ పరిధిలోని కుర్దిస్థాన్ రీజియన్‌లో ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కాన్సులేట్‌పై డ్రోన్ దాడి జరగడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో యూఏఈకి ఆస్ట్రేలియా  అండగా నిలిచింది. అత్యాధునిక గగనతల క్షిపణులను సరఫరా చేయడంతో పాటు నిఘా విమానాలను రంగంలోకి దించుతున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది.

ఇరాక్‌లోని ఎర్బిల్‌లో ఉన్న యూఏఈ కాన్సులేట్ జనరల్ భవనంపై మంగళవారం డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో భవనం పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, ఎవరికీ గాయాలు కాలేదు. ఈ దాడిని యూఏఈ విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ దౌత్య నిబంధనలను ఉల్లంఘిస్తూ, సాగుతున్న ఇటువంటి చర్యలు ప్రాంతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. బాధ్యులెవరో తేల్చేందుకు దర్యాప్తు జరపాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును తిప్పికొట్టేందుకు యూఏఈకి ఆస్ట్రేలియా సైనిక సాయాన్ని ప్రకటించింది. అత్యాధునిక ‘అడ్వాన్స్‌డ్ మీడియం రేంజ్ ఎయిర్-టు-ఎయిర్’ క్షిపణులను యూఏఈకి పంపనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ వెల్లడించారు. గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న తమ దేశ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి గగనతలం సురక్షితంగా ఉండటం అత్యవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు యూఏఈ సుమారు 1,500కు పైగా క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుందని, పౌర భద్రత దృష్ట్యా ఈ సాయం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

మరోవైపు ఇరాన్ తన దాడులను ఇంధన కేంద్రాల వైపు మళ్లించింది. బహ్రెయిన్‌లోని అల్ మామీర్ చమురు శుద్ధి కర్మాగారంపై జరిగిన దాడితో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. దీంతో బహ్రెయిన్ ప్రభుత్వ ఇంధన సంస్థ ‘బాప్కో’ ఫోర్స్ మెజ్యూర్ ప్రకటించింది. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నదన్న ఆందోళనతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. హార్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో భారత్ నుంచి వెళ్లే బియ్యం, ఇండోనేషియా కాఫీ రవాణాపై తీవ్ర ప్రభావం పడింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఉద్రిక్తతలపై స్పందిస్తూ ఇరాన్‌తో యుద్ధం అతి త్వరలోనే ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించాయి. యుద్ధం ఎప్పుడు ముగియాలో అమెరికా కాదు.. తామే నిర్ణయిస్తామని సవాల్ విసిరాయి. కాగా నిత్యావసరాల ధరలు పెరగకుండా దుబాయ్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. వచ్చే కొన్ని నెలల వరకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement