ఇరాన్‌కు తుర్కియే వార్నింగ్‌.. | Turkiye issued warnings to Iran can repel any threat President Erdogan | Sakshi
Sakshi News home page

ఇరాన్‌కు తుర్కియే వార్నింగ్‌..

Mar 10 2026 4:57 AM | Updated on Mar 10 2026 5:00 AM

Turkiye issued warnings to Iran can repel any threat President Erdogan

తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ నుంచి వచ్చిన బాలిస్టిక్ క్షిపణిని నాటో రక్షణ వ్యవస్థలు రెండోసారి కూల్చివేశాయని, ఇలాంటి "తప్పుడు, రెచ్చగొట్టే చర్యలు" కొనసాగిస్తూ మధ్యప్రాచ్యాన్ని మళ్లీ గత శతాబ్దంలోలా యుద్ధభూమిగా మార్చేస్తామంటే ఊరుకోమని ఆయన స్పష్టం చేశారు.

క్యాబినెట్ సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎర్డోగాన్ మాట్లాడుతూ, ఇరాన్‌కు సంబంధించిన పరిణామాలను తుర్కియే నిశితంగా గమనిస్తోందని తెలిపారు. తమ ఆందోళనలను నేరుగా టెహ్రాన్‌కు తెలియజేశామని చెప్పారు. “ఇరాన్‌కు అవసరమైన హెచ్చరికలు ఇచ్చాం. అయినప్పటికీ వారు తప్పుదోవలోనే కొనసాగుతున్నారు” అని ఎర్డోగాన్ వ్యాఖ్యానించారు.

దౌత్యపరమైన పరిష్కారాలకే తుర్కియే ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. “ఇతర యుద్ధాల మాదిరిగానే తుర్కియే న్యాయం వైపు నిలుస్తుంది. చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడానికే మేము మద్దతు ఇస్తాం” అని తెలిపారు.

అదే సమయంలో దేశ రక్షణ సామర్థ్యాలపై కూడా ఎర్డోగాన్ నమ్మకం వ్యక్తం చేశారు. దేశ భద్రత, సార్వభౌమాధికారాన్ని లక్ష్యంగా చేసుకునే ఎలాంటి బెదిరింపులకైనా తగిన ప్రతిస్పందన ఇవ్వగల సామర్థ్యం తుర్కియేకి ఉందని పేర్కొన్నారు. “తుర్కియే ప్రతి రంగంలో బలమైన దేశం. ఎలాంటి దాడినైనా తిప్పికొట్టగలదు” అన్నారు. "మధ్యప్రాచ్యాన్ని శతాబ్దం క్రితం మాదిరిగా మళ్లీ ఆపరేటింగ్ టేబుల్‌పై ఉంచడానికి అనుమతించం" అని ఎర్డోగాన్ హెచ్చరించారు.

అలాగే గాజా పరిస్థితిపై మాట్లాడుతూ, గాజాలో జరుగుతున్న ఘటనల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించుకుంటూ ఇజ్రాయెల్‌ రెండు దేశాల పరిష్కారాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత విస్తరించకుండా త్వరగా ముగియాల్సిన అవసరం ఉందని, లేకపోతే యూరప్-ఆసియాతో పాటు ప్రపంచానికే నష్టం జరుగుతుందని ఎర్డోగాన్ హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement