పశ్చిమాసియా యుద్ధ కల్లోలం...
అంతర్జాతీయంగా క్రూడ్ 30% పైగా జంప్
దేశీయంగాను రికార్డు స్థాయికి అప్..
ఫ్యూచర్స్ మార్కెట్లో రూ. 10,549కి ఎగసిన ధర
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో సంక్షోభం తీవ్రమయ్యే కొద్దీ ముడిచమురు రేట్లు మరింతగా మండుతున్నాయి. అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో 2022 తర్వాత తొలిసారిగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 100 డాలర్ల పైకి ఎగసింది. నైమెక్స్ క్రూడ్ (డబ్ల్యూటీఐ) ఏప్రిల్ డెలివరీ ధర ఒక దశలో 31.44 శాతం పెరిగి 120 డాలర్లకు దాదాపు దగ్గరగా 119.48 డాలర్లను తాకింది. అటు బ్రెంట్ క్రూడ్ కూడా 28.82 శాతం పెరిగి 119.46 డాలర్లకు ఎగిసింది. హర్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు తగ్గిపోవడం, ప్రాంతీయంగా పలు దేశాలు ఉత్పత్తిని తగ్గించడంతో విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయని ఇండస్‌ఇండ్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది తెలిపారు.
ఉద్రిక్తతల కారణంగా కీలక షిప్పింగ్ మార్గంలో నౌకలను ఇరాన్ టార్గెట్ చేసుకుంటూ ఉండటంతో గ్లోబల్‌గా దాదాపు అయిదో వంతు ముడిచమురు, సహజ వాయువు సరఫరా నిలి్చపోయినట్లు పేర్కొన్నారు. పశ్చిమాసియా పరిస్థితులను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ, కరెన్సీ రీసెర్చ్ హెడ్ అనింద్య బెనర్జీ తెలిపారు. ‘హర్ముజ్ జలసంధిలో రాకపోకలకు అంతరాయం కలిగించడం తొలి దశ. ప్రస్తుతం అదే జరుగుతోంది. రెండో దశలో మరింత తీవ్రమైన రిసు్కలు ఉండొచ్చు. ప్రాంతీయంగా ఆయిల్, గ్యాస్ మౌలిక సదుపాయాలపై నేరుగా దాడులు చేయొచ్చు. మూడో దశలో కీలకమైన నీటి మౌలిక సదుపాయాలను దెబ్బతీయడం ఉండొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.
ఎంసీఎక్స్‌లో భగ్గు..
అంతర్జాతీయ పరిణామాలతో దేశీ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీలో కూడా ముడిచమురు రేట్లు భగ్గుమన్నాయి. మార్చి డెలివరీ కాంట్రాక్టు ఎకాయెకిన 26 శాతం ఎగిసి (రూ. 2,186) జీవితకాల గరిష్ట స్థాయి రూ. 10,549ని తాకింది. మార్చి కాంట్రాక్టు అప్పర్ సర్క్యూట్ తాకిందని, ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే సెషన్లలో రూ. 11,300కి కూడా పెరిగే అవకాశం ఉందని చాయిస్ బ్రోకింగ్ కమోడిటీ అండ్ కరెన్సీ అనలిస్ట్ ఆమిర్ మక్డా చెప్పారు.
బ్యారెల్ ధర ఒక డాలరు పెరిగేతే ఏటా భారత్‌పై 1.8 బిలియన్ డాలర్ల భారం యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్ట్ నీలకంఠ మిశ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయిల్ రేటు 50 డాలర్లు పెరిగి, ఏడాది పాటు కొనసాగితే 90 బిలియన్ డాలర్ల ప్రభావం ఉంటుందని, ఇది స్థూల దేశీయోత్పత్తిలో రెండు శాతమని మిశ్రా పేర్కొన్నారు.
సంక్షోభాలు.. యుద్ధాలతో ఆజ్యం..
సుమారు దశాబ్దంన్నర కాలంగా వివిధ సంక్షోభాలు, యుద్ధాలతో ముడిచమురు మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో కమోడిటీల బూమ్ ఏర్పడింది. ఆయిల్ ధరలు ఆ ఏడాది జూలై 11న ఆల్‌టైం గరిష్టస్థాయి 147.50కి ఎగిశాయి. ఆ తర్వాత 2011లో పశి్చమాసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలు తిరుగుబాట్లతో దద్దరిల్లినప్పుడు 127 డాలర్ల స్థాయిని చూశాయి.
అమెరికన్ షేల్ ఆయిల్, గ్యాస్ మార్కెట్లను ముంచెత్తడంతో 2015 తొలినాళ్లలో 50 డాలర్లకు పడిపోయాయి. ఆ తర్వాత 2020 కోవిడ్ మహమ్మారి సమయంలో ఇంధనానికి డిమాండ్ పడిపోయి, చమురు ఉత్పత్తి దేశాలు నిల్వలను వదిలించుకునే ప్రయత్నాలు చేసినప్పుడు బ్రెంట్ క్రూడ్ రికార్డు కనిష్టం 15.98 డాలర్లకు కూడా పతనమైంది. నైమెక్స్ ఫ్యూచర్స్ మైనస్ 40.32 డాలర్లను తాకింది. మళ్లీ 2022 రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఆయిల్ రేట్లకు రెక్కలొచ్చాయి. 2022 తొలినాళ్లలో 139 డాలర్లకు ఎగబాకాయి.


