ఓ వైపు అగ్రరాజ్యంగా అభివృద్ధి చెందిన దేశంగా అభివర్ణించుకుంటూ ఉన్న అమెరికాలో ప్రస్తుతం ఆహార అభద్రత అత్యంత ఆందోళన కలిగించే అంశాలలో ఒకటిగా మారింది. మాట వినని వారిపై కయ్యాలకు కాలు దువ్వుతూ ఇతర దేశాలపై ఆంక్షల కొరడా ఝులిపిస్తూ ఏ అంతర్గత సమస్యలూ లేనట్టు పైకి కనిపిస్తున్న ఆ దేశంలో కనీసపాటి నాణ్యమైన భోజనం పొందలేకపోతున్నవారి సంఖ్య దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ విషయాన్ని ఫుడ్ రీసెర్చ్ – యాక్షన్ సెంటర్ అందించిన 2024 డేటా నిర్ధారించింది.
ఈ అధ్యయనం ప్రకారం ఆ దేశంలోని ఏడు ఇళ్లలో కనీసం ఒక ఇల్లు ఆహార అభద్రతను ఎదుర్కుంటోంది. అంటే దాదాపుగా 47.9% మిలియన్ల మంది ఆకలితో బాధపడుతున్నారని అంచనా. దేశంలో పెరుగుతున్న జీవన వ్యయం దేశవ్యాప్తంగా ఇళ్లలో తృప్తికరమైన భోజనాలు ఆస్వాదించడాన్ని కష్టతరం గా మార్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ నేపధ్యంలో పలువురు వ్యక్తులు సంస్థలు అవసరార్ధులకు రుచికరమైన, ఉచిత భోజనాన్ని అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి. అలాంటి వారిలో జన్మతః భారతీయుడైన గోవింద దత్తా కూడా ఒకరు. ఆయన ఆధ్వర్యంలోని లాస్ ఏంజిల్స్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కృష్ణ లంచ్ అనే సంస్థ ఒక ఫుడ్ ట్రక్‌ను నిర్వహిస్తోంది. ఇది వెస్ట్‌వుడ్‌లోని లే కాంటే అవెన్యూలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వెలుపల కొలువుదీరిన ఓ ఫుడ్ ట్రక్. ఈ కృషగోవింద దత్తా... ఆధ్వర్యంలో ఈ ట్రక్ విద్యార్ధులు, కార్మికులకు నామమాత్రపు ధరకే శాఖాహార భోజనాలను అందిస్తోంది.
‘ ఆహార అభద్రతను ఎదుర్కోవడంలో ఇక్కడి సమాజానికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం‘ అని దత్తా మీడియాతో అంటున్నారు. ఆయన శృకృష్ణుని ఆదర్శాల వ్యాప్తికి వెలసిన హిందూ భక్తి ఉద్యమం ఇస్కాన్‌లోని హరేకృష్ణ కు దీర్ఘకాల సభ్యుడు, కర్మ సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తాను అంటున్న ఆయన భగవద్గీతను వ్యాప్తి చేయాలనే లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నానంటారు.
అతి తక్కువగా, చిన్న పాటి విరాళానికి (షుమారు 5 డాలర్లు) ప్రతిగా స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని ఈ ట్రక్ అందిస్తుంది. అయితే, ఆ కనీస విరాళం మొత్తాన్ని ఇవ్వలేని వారు కూడా ఇక్కడ భోజనానికి అర్హులే. తమ ట్రక్ లో వడ్డించే వంటకాల కోసం రూపొందిన మెనూ ఆయుర్వేద పురాతన వంట శైలులపై ఆధారంగా ఉందని ఆయన వెల్లడించారు, ‘కూరగాయలు, ధాన్యాలు, బీ¯Œ ్స‘ కలయిక గా ఈ ఆహారపదార్ధాలు రూపొందుతాయి.
ఆయన తో పాటు మరొక స్వచ్ఛంద సేవకుడు శాంతాత్మ ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకు మేల్కొంటారు.. అక్కడ నుంచి తమ ట్రక్ పనులను చూసుకుని సాయంత్రం 7 గంటలకు తిరిగి ఇంటికి చేరుకుంటారు. వారానికి ఐదు రోజుల పాటు ఈ ప్రాజెక్టును అందించగలుగుతారు. ఈ ఫుడ్ ట్రక్ సోమవారం నుంచి శుక్రవారం వరకు స్థిరమైన మెనూ షెడ్యూల్‌ను అనుసరిస్తుంది.
‘ఆహారం ఒక బహుమతి, అదే మా ప్రేరణ‘ అని దత్తా అంటున్నారు. దేశంలో 20% మంది విద్యార్థులు డబ్బు కారణంగా ఆహార స్వీకరణను వాయిదా వేస్తున్నారని, మొత్తంగా 42% మంది ఆహార అభద్రతతో ఉన్నారని అంటున్న వీరు తమ వంతుగా ఈ సమస్య పరిష్కారంలో భాగం అవుతున్న తీరు హర్షణీయం.


