హిజ్బొల్లాపై తిరుగుబాటు.. ఎన్నికలకు దూరంగా లెబనాన్‌ | Lebanon parliament extends elections for two years | Sakshi
Sakshi News home page

హిజ్బొల్లాపై తిరుగుబాటు.. ఎన్నికలకు దూరంగా లెబనాన్‌

Mar 9 2026 5:16 PM | Updated on Mar 9 2026 5:41 PM

Lebanon parliament extends elections for two years

బీరూట్‌: లెబనాన్‌లో రాజకీయ, భద్రతా సంక్షోభం నెలకొంది. మే నెలలో జరగాల్సిన పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికలను రెండేళ్ల పాటు వాయిదా వేస్తూ లెబనాన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌,హిజ్బుల్లా మధ్య యుద్ధం వల్ల అస్థిరత నెలకొంది. హిజ్బుల్లా పట్ల దేశంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. ప్రభుత్వంలోని రాజకీయ మిత్రుల మద్దతు కోల్పోయింది. 

ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, ఇరాన్ ప్రతిదాడుల కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు మద్దతుగా హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభించింది. ప్రతీకారంగా ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడంతో లెబనాన్‌లో పరిస్థితులు మరింత దిగజారాయి. 

హిజ్బుల్లా ఈ యుద్ధంలో కలగజేసుకోవడం లెబనాన్ ప్రజల్లో అసంతృప్తిని పెంచింది. ఆర్థిక సంక్షోభం, భద్రతా సమస్యలతో విసిగిపోయిన ప్రజలు ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని భావించిన ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేసింది. పార్లమెంటరీ స్పీకర్ నబీహ్ బెర్రీ ఆధ్వర్యంలో జరిగిన ఓటింగ్‌లో 128 మంది సభ్యుల్లో 76 మంది ఎన్నికలను రెండేళ్ల పాటు వాయిదా వేయాలని మద్దతు తెలిపారు. దీంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల వాయిదాకు హిజ్బుల్లా ఎంపీలు కూడా మద్దతు తెలిపినట్లు సమాచారం.

చిగురుటాకులా వణికిపోతున్న లెబనాన్‌
హిజ్బొల్లా దాడితో రగిలిపోతున్న ఇజ్రాయెల్ లెబానాన్‌పై విరుచుకుపడింది. గతవారం జరిపిన దాడుల్లో ‌ 83మంది పిల్లలు మృతి చెందగా 200మందికి పైగా పిల్లలు తీవ్రంగా గాయపడినట్లు ప్రపంచవ్యాప్తంగా పిల్లల హక్కుల రక్షణ, ఆరోగ్యం, విద్య, పోషణ కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ యూనిసెఫ్‌ ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్‌ దాడులతో చిగురుటాకులా వణికిపోతున్న లెబనాన్‌ను ఆపన్న హస్తం అందించేందుకు ఫ్రాన్స్‌ ముందుకు వచ్చింది. 6.9బిలియన్‌ డాలర్లు అత్యవసర ఆర్థికసాయం ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఫ్రాన్స్‌ ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పడింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement