నేపాల్‌కు కాబోయే ప్రధాని.. అప్పట్లో బెంగళూరులో.. | The Untold Story Of Balen Shah | Sakshi
Sakshi News home page

నేపాల్‌కు కాబోయే ప్రధాని.. అప్పట్లో బెంగళూరులో..

Mar 9 2026 4:25 PM | Updated on Mar 9 2026 5:45 PM

The Untold Story Of Balen Shah

కాఠ్మాండు: నేపాల్‌తో పాటు ఆ దేశం చుట్టుపక్కల ఉన్న దేశాల రాజకీయ వర్గాల్లో ఇప్పుడు అధికంగా వినిపిస్తున్న పేరు బాలెన్ షా (బాలేంద్ర షా). ర్యాపర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన రాజకీయాల్లోకి వచ్చి  నేపాల్‌లో అతి ముఖ్యమైన నేతగా ఎదిగారు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) తరఫున ఆయన ప్రధాని అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో పోరాడారు.

ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇప్పటికీ కొనసాగుతోంది. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 124 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మరో నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉంది. నేపాలీ కాంగ్రెస్ 17 స్థానాలు గెలిచింది. మరో స్థానంలో ముందంజలో ఉంది. యూఎంఎల్ ఎనిమిది స్థానాలు గెలిచింది. ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఎన్‌సీపీ కేవలం ఏడు స్థానాలు మాత్రమే గెలిచింది. ఆర్‌పీపీ ఒక స్థానంలో గెలిచింది. శ్రామ్ సంస్కృతి పార్టీ మూడు స్థానాలు గెలిచింది. మయాగ్డి నియోజకవర్గం నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.

నేపాల్‌లో 165 స్థానాలకు నేరుగా (ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్‌), మరో 110 స్థానాల్లో నైష్పక్షిక విధానం (ప్రోపోర్షనల్ రిప్రజెంటేషన్) కింద ఎన్నికలు జరిగాయి. ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్‌ కింద జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు 162 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ప్రోపోర్షనల్ రిప్రజెంటేషన్ (నైష్పక్షిక విధానం) కింద ఉన్న 110 స్థానాల్లో 68 స్థానాల లెక్కింపు పూర్తైంది. ప్రోపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే పార్టీకి వచ్చిన మొత్తం ఓట్ల శాతానికి అనుగుణంగా స్థానాలు కేటాయించే ఎన్నికల విధానం. 

బెంగళూరులో బాలేంద్ర షా ఎంటెక్ 
బాలేంద్ర షా నేపాల్‌ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒకప్పుడు బాలేంద్ర షా బెంగళూరు నిట్టె మీనాక్షి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లో చదివారు. అక్కడ ఆయన ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో విద‍్యనభ్యసించారు.

తాజాగా, నిట్టె మీనాక్షి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లెక్చరర్లు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తమ పూర్వ విద్యార్థి ఇప్పుడు నేపాల్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన తీరు చూసి గర్వంగా ఉందని తెలిపారు. ఆసక్తికర విషయం ఏంటంటే, ఆ సంస్థలో చదువుతున్న సమయంలో బాలేంద్ర షా రాజకీయాల్లో ఆసక్తి స్పష్టంగా చూపలేదు.

రాజకీయాల్లోకి రావడానికి ముందు బాలేంద్ర షా.. నేపాలీ రాప్ మ్యూజిక్‌లో బాగా పాపులర్‌ అయ్యారు. అయినా క్యాంపస్‌లో ఉన్న సమయంలో ఆయన రాప్ పెర్ఫార్మన్స్‌ ఇవ్వలేదు. ఆయన మ‍్యూజిక్‌, పాటలు అధికంగా నేపాలి భాషలోనే ఉండేవి.

బాలేంద్ర షాకు నేపాల్‌ ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్ష ఉందని బెంగళూరులోని ఆయన లెక్చరర్లు భావిస్తున్నారు. ర‍్యాపర్ నుంచి కాఠ్మాండు మేయర్ స్థాయికి, అక్కడి నుంచి జాతీయ నాయకుడిగా ఎదిగిని బాలేంద్ర షా రాజకీయ ప్రయాణం ఇంకా ముందుకు సాగుతోంది. ఒకవేళ ఆయన తిరిగి క్యాంపస్‌కి అతిథిగా వస్తే ఘనస్వాగతం పలకాలని నిట్టె మీనాక్షి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భావిస్తోంది. 

బాలేంద్ర షా ఝాపా-5 నియోజకవర్గం పార్లమెంటు ఎన్నికలో విజయం సాధించారు. ఆయన ప్రధాన ప్రత్యర్థి, మాజీ నేపాలి ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ ఓటమి చెందారు.  ఆయన పార్టీ ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement