Balendra Shah
-
శరవేగంగా నేపాల్ సంస్కరణలు
నేపాల్‌లో మార్చి 27న ఏర్పడిన బాలేంద్ర షా ప్రభుత్వం నెల రోజులైనా పూర్తి కాకముందే ప్రవేశపెడుతున్న పరిపాలనా సంస్కరణలను గమనించినపుడు, ఇంతటి వేగం ఆచరణలో సాధ్యమయేనా అన్న ప్రశ్న ముందుకు వస్తున్నది. రబీ లమిఛానే అధ్యక్షతన గల రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) దేశ చరిత్ర లోనే ఎన్నడూ లేనంత మెజారిటితో గెలిచి, పాత పార్టీలన్నింటిని అక్షరాలా ఊడ్చిపెట్టిన స్థితిలో, ప్రధాని బాలేన్ ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్న మాట నిజం. అది తెలిసినందువల్లనే, 27న ప్రమాణ స్వీకారం తర్వాత రెండు రోజు లకు 29న జరిగిన మొదటి క్యాబినెట్ సమా వేశంతోనే ఆరంభించి వరుసగా అనేక చర్యలు తీసుకోవటం కనిపిస్తున్నది.100 అంశాల ప్రణాళికమనకు తెలిసిన ప్రజాస్వామ్యాన్ని, పరిపాలనను దృష్టిలో పెట్టు కుని చూసినపుడు ఆ చర్యలలో కొన్ని ఆశ్చర్యకరంగా తోస్తాయి. ఉదాహరణకు పరిపాలన వేగంగా, సమర్థవంతంగా సాగేందుకు, సామాన్యులకు కూడా ఉపయోగకరంగా ఉండేందుకు మొదటి క్యాబి నెట్ సమావేశంలోనే 100 అంశాల ప్రణాళిక ప్రకటించారు. వాటి అమలు తీరును ఎవరైనా సరే గమనించేందుకు ప్రత్యేకంగా వెబ్ సైట్‌ను సృష్టించారు. ఆ తర్వాత, 18 అభివృద్ధి రంగాలపై పూర్తి దృష్టి పెట్టి పనిచేయగలమంటూ 18 అంశాలతో ‘నేషనల్ కమిట్ మెంట్ డాక్యుమెంట్’ పేరిట ముసాయిదా పత్రాన్ని విడుదల చేసి, దానిపై పార్టీలు, సంస్థలు, మేధావులు, ప్రజల సూచనలను కోరారు. విశేషం ఏమంటే, ఓడిపోయిన పార్టీల మేనిఫెస్టోలలోని ముఖ>్యంశాలను కూడా ఈ డాక్యుమెంట్లో చేర్చారు. ఆ పార్టీల నాయకులు నలుగురికి కూడా ఒక కమిటీలో స్థానం కల్పించారు. దానిని బట్టి, నేపాల్ అధికార పక్షంతోపాటు యువ ప్రధాని ఆలోచనల తీరును అర్థం చేసుకోవచ్చు. ఇది ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన కొన్ని ప్రజాస్వామిక ప్రయోగాలను గుర్తు చేస్తున్నది. రాజీవ్ గాంధీ ప్రధాని అయినప్పుడు ఈ స్థాయి మార్పులైతే చేయలేదు గానీ, ముఖ్యమైన విధానపర అంశాలపై ప్రతిపక్షాలను సంప్రదించే పద్ధతిని ప్రవేశపెట్టి ప్రశంసలు పొందారు. తదనంతర పరిణామాల వల్ల అంతా భంగపడిందన్నది వేరే విషయం. అప్పుడే తప్పుకున్న ఇద్దరు మంత్రులుజెన్–జీ ఉద్యమం నేపాల్ రాజకీయ వ్యవస్థను అంతగా కుదిపి వేయటానికి ఒక ముఖ్య కారణం అవినీతి అన్నది తెలిసిందే. ఆ దృష్ట్యా, అవినీతిని అన్ని స్థాయుల్లో అరికట్టగలమన్నది ఆర్ఎస్పీ ఇచ్చిన హామీ. అందుకు అనుగుణంగా, ప్రభుత్వం ఏర్పడిన తొలి రెండు వారాలలోనే ప్రధాని సహా మంత్రులంతా తమ ఆస్తులను ప్రకటించారు. రాజును 2006లో పడగొట్టగా, అప్పటినుంచి నేటి వరకు రాజు జ్ఞానేంద్రతో పాటు అందరు మాజీ ప్రధానులు,మంత్రులు, సీనియర్ నాయకులు, సీనియర్ అధికారుల ఆస్తులపై దర్యాప్తు కోసం కమిషన్‌ను నియమించారు. అంతలోనే ఒక నిర్ణయం దేశాన్నంతా ఆశ్చర్యపరిచింది. కేవలం మూడు వారాల క్రితం నియమితుడైన కార్మిక మంత్రి దీపక్ కుమార్, ఒక పని చేయని ఆరోగ్య బీమా బోర్డులో అధికారి అయిన తన భార్యను కొనసాగించేందుకు అధికార దుర్వినియోగం చేశారంటూ వెంటనే క్యాబినెట్ నుంచి తొలగించారు. ఆ దుర్వినియోగాన్ని పట్టించుకోనందుకు ఆరోగ్యమంత్రి నిషా మెహతాకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ కొద్ది రోజులలోనే మనీ లాండరింగ్ కేసులో మాజీ ప్రధాని దేవుబా దంపతులకు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేయగా, కొద్దిమంది పెద్ద వ్యాపారులను అరెస్టు చేశారు. ఇది అనుమానించే కావచ్చు దేవుబా దంపతులు చికిత్స కోసమంటూ ముందే విదేశా లకు వెళ్లారు. (ఏప్రిల్ 22న ఏకంగా హోంమంత్రి సుధన్ గురుంగ్ రాజీనామా చేయడం మరో సంచలనమైంది. తన పెట్టుబడుల మీద తలెత్తిన ప్రశ్నల మీద నిష్పాక్షిక విచారణ జరిగేందుకు వీలుగానే పదవి నుంచి తప్పుకున్నట్టు ఆయన వెల్లడించారు.) పరిపాలనా పరంగా తీసుకున్న ఒక ప్రధానమైన చర్య, ఫెడర లిజం సక్రమంగా అమలయ్యేందుకు దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని బాలేన్ జరిపిన చర్చలు. వారిలో అన్ని పార్టీల వారున్నారు. వాస్తవానికి ఫెడరలిజం ఏర్పాట్లు రాజ్యాంగంలో 2015 నుంచి ఉన్నాయి. కానీ వాటిని ఏరికోరి చేర్చిన కాంగ్రెస్, కమ్యూ నిస్టు, మావోయిస్టు పార్టీలు ఏవీ అమలుపరచలేదు. అందుకిపుడు పదేళ్ల తర్వాత మోక్షం లభిస్తున్నది. ప్రధానితో జరిగిన చర్చలలో ఆ ముఖ్యమంత్రులంతా తమకు చట్టపరమైన, ఆర్థికపరమైన, శాంతి భద్రతలపరమైన అధికారాలు సవ్యంగా లభించలేదని చెప్పారు.అమలులో ఎదురయ్యే సవాళ్లు18 అంశాల ‘కమిట్మెంట్ డాక్యుమెంట్’ గమనిస్తే, వాటిలో వ్యవసాయం, విద్యుత్తు, గనులు, మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక రంగం, టూరిజం, పౌర విమానయానం వంటి ఆర్థికాభి వృద్ధిపరమైనవి కనిపిస్తాయి. అవిగాక ఉద్యోగ – ఉపాధి కల్పన, విద్య, వైద్యం, పరిపాలనా సంస్కరణలు; పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం మొదలైనవి ఉన్నాయి. దేనికైనా నిధులు తప్పని సరి కాగా, ఆ కొరత నేపాల్‌కు ఎక్కువే. వారికి గల తీవ్రమైన కొరతలు సహజ వనరులు, పరిశ్రమలు, ఉత్పత్తి రంగం, ప్రైవేట్ పెట్టుబడులు పరిమితం కావటం. అయితే, ఇంతకుముందువలెగాక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, అధికార పక్షం పట్టుదల చూపటం, అవినీతిని నియంత్రిస్తుండటం వల్ల బయటినుంచి సంస్థాగతంగా, ప్రైవేట్ రంగం నుంచి, ప్రభుత్వాల నుంచి తోడ్పాటు లభించే అవకాశాలున్నాయి.ప్రత్యేకంగా నిధులతోగానీ, క్రమంగా జరగవలసిన అభివృద్ధితో గానీ సంబంధం లేని చర్యలు కొన్ని 100 అంశాల ప్రణాళికలో ఉన్నాయి. అవి సాధారణ పరిపాలనాపరమైనవి. ఉదాహరణకు ఆస్తుల వెల్లడి, అవినీతిపై దర్యాప్తులు, విద్యా సంస్థలలో పార్టీ అనుబంధ యూనియన్ల రద్దు, ప్రైవేటు ఆసుపత్రులలో 10 శాతం పడకలు పేదలకు ఉచితంగా కేటాయింపు, ప్రజావసరాలు, సర్వీ సులు వారి గుమ్మం వద్దకే చేరటం వంటివి. ఇవి అమలైనకొద్దీ ఒకవైపు ప్రభుత్వంపట్ల ప్రజలకు నమ్మకం పెరగటం, వారి జీవి తాలు మెరుగు పడటం జరుగుతుంది.బాలేంద్ర షా కాఠ్మండూ మేయర్‌గా, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి చేసిన అభివృద్ధి పనులు, తను అవినీతిపరుడు కాకపోవటం ఈ ఎన్నికలలో బాగా కలిసి రావటం తెలిసిందే. ఆర్ఎస్పీ అధ్యక్షుడు రబీ లమీఛానేకు కూడా ముక్కుసూటి మనిషి, మంచి వక్త, సమ ర్థుడనే పేరున్నది. ఇద్దరూ ఇంతకాలం పాత పార్టీలను, వాటి అక్రమాలను వ్యతిరేకించినవారు. అందువల్ల జాగ్రత్తగా, ఇదే పట్టుదలతో వ్యవహరించినట్లయితే నేపాల్ ముఖచిత్రం క్రమంగా మారగలదని చెప్పవచ్చు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నేపాల్‌లో కొత్త ప్రభుత్వ పాలన అదుర్స్ కదూ..?
కాఠ్మాండు: నేపాల్‌లో ప్రస్తుతం ఏం జరుగుతోంది? కొత్త ప్రభుత్వం ప్రజల అంచనాలకు తగ్గట్లే వ్యవహరిస్తోందా? ఎన్నెన్నో ఆశలతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు నేపాల్ ప్రజలు. ఆ దేశంలో కొన్ని నెలల క్రితం ఉవ్వెత్తున ఎగిసిన జెన్ జీ ఉద్యమం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఆర్థిక వ్యవస్థ కుదేలు అవ్వడం, ప్రభుత్వంలో అవినీతి వంటి పలు అంశాలు జెన్ జీ ఉద్యమానికి కారణమయ్యాయి.ఆ తర్వాత జెన్ జీ నిరసనలతో రాజకీయాల్లోకి ప్రవేశించారు రాపర్ బాలేంద్ర షా (బాలెన్). నేపాల్ ప్రధాని అయ్యారు. ప్రభుత్వంలో పారదర్శకత, విద్యా సంస్కరణలు, వీఐపీ సంస్కృతి తొలగింపు వంటి చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. చెప్పినట్లుగానే ప్రభుత్వంలో పారదర్శకత పెంచుతున్నారు. ఏప్రిల్ 9న లేబర్, ఎంప్లాయ్మెంట్, సోషల్ సెక్యూరిటీ మంత్రి దీపక్ కుమార్ సాహ్‌ను క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలపై పదవి నుంచి తొలగించారు.నేపాల్ హోం మంత్రి సుదాన్ గురుంగ్ బుధవారం (ఏప్రిల్ 22) తన పదవికి రాజీనామా చేశారు. తన ఆస్తులపై వచ్చిన ఆరోపణలపై నైతిక బాధ్యత వహిస్తూ, న్యాయంగా దర్యాప్తు జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని భావించి స్వచ్ఛందంగా పదవిని వదులుకున్నారు. దీంతో బాలేంద్ర షా నిజంగానే జవాబుదారీతనంతో ఉంటున్నారని, ప్రభుత్వానికి అవినీతి మచ్చ అంటనివ్వట్లేదని విశ్లేషకులు అంటున్నారు. నేపాల్ హోం మంత్రి సుదాన్ గురుంగ్ బుధవారం తన పదవి నుంచి రాజీనామా చేశారు, తన ఆర్థిక ఆస్తులపై వచ్చిన ఆరోపణలపై నైతిక బాధ్యత స్వీకరించి, దర్యాప్తు న్యాయంగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాజీనామా విషయాన్ని ప్రకటిస్తూ ఫేస్బుక్లో ఓ పోస్టు చేశారు. ప్రజా జీవితంలో నైతిక ప్రమాణాలు నిలబెట్టేందుకు పదవి నుంచి తప్పుకున్నట్టు చెప్పారు."నేను, సుదాన్ గురుంగ్‌ను.. 2026 మార్చి 26 నుంచి హోం మంత్రిగా అత్యంత నిజాయితీతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఇటీవల నా షేర్లు, సంబంధిత విషయాలపై పౌరులు లేవనెత్తిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు, ఆందోళనలను నేను చాలా సీరియస్‌గా తీసుకున్నాను. నా దృష్టిలో నైతిక విలువలు అన్ని పదవులకన్నా ఎక్కువ. ప్రజా విశ్వాసానికి మించిన శక్తి లేదు. నేటి 'జెన్ జీ' ఉద్యమం కూడా ఇదే సందేశం ఇస్తోంది. ప్రజా జీవితం స్వచ్ఛంగా ఉండాలి, నాయకత్వం బాధ్యత వహించాలి" అని చెప్పారు. దేశ రాజకీయ నేపథ్యం, గతంలో జరిగిన త్యాగాలను ప్రస్తావిస్తూ.. ఆరోపణలు వచ్చినప్పుడు బాధ్యత తప్పనిసరి అని అన్నారు.తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. పారదర్శకత ఉండేందుకు, ఒకే వ్యక్తికి రెండు విరుద్ధ ప్రయోజనాలు ఉండే పరిస్థితి లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఓ వైపు తాను పదవిలో ఉండి, మరోవైపు తనపై దర్యాప్తు జరిగే విరుద్ధ ప్రయోజనాల కిందికి వస్తుందన్నారు. అందుకే నేటి నుంచే హోం మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు.పౌరులు, మీడియా, యువత నిజాయితీ, బాధ్యతాయుత మార్గంలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. "నా నైతిక బాధ్యతను నేను పూర్తి చేశాను. ఇప్పుడు నా మీడియా స్నేహితులు, నేపాల్ సోదరులు, సోదరీమణులు, యువత అందరూ సత్యం, నిజాయితీ, ఆత్మశుద్ధి మార్గంలో నడవాలి. కొన్ని మీడియా వ్యక్తులు పొందిన 'స్వీట్ షేర్లు' (ప్రత్యేక లాభాల కోసం ఇచ్చే వాటాలు) గురించి సమాచారం త్వరలో బయటపడుతుంది. రామ రాజ్యం కోరుకునేవారు త్యాగం చేయడానికి, నైతిక ధైర్యం చూపడానికి సిద్ధంగా ఉండాలి" అని అన్నారు.ఏప్రిల్ 9నే మరో మంత్రి ఔట్ ఇంతకుముందు ఏప్రిల్ 9న నేపాల్ ప్రధాన మంత్రి బాలేంద్ర షా.. మంత్రి దీపక్ కుమార్ సాహ్‌ను క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలపై, పదవి నుంచి తొలగించారు. ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపిన ప్రకారం.. పార్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు సాహ్‌ను తొలగించారు. కమిషన్ అధ్యయనం ప్రకారం.. తన పదవిని దుర్వినియోగం చేసి, తన భార్య జును శ్రేష్ఠాను హెల్త్ ఇన్సూరెన్స్ బోర్డు సభ్యురాలిగా కొనసాగించారు. ఆ పదవి చాలా కాలంగా నిర్వీర్యంగా ఉంది. కమిషన్ తన నివేదికను పార్టీకి సమర్పించి, చర్యలు తీసుకోవాలని సూచించింది.దీంతో బాలేంద్ర షా తన మంత్రివర్గంలో అవినీతి జరగకుండా చూసుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. జెన్ జీ కోరుకున్న అంశాల్లో ఇది ప్రధానం. గత ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయి, జవాబుదారీతనంలో ఉండేవి కాదు. దేశ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయినా మంత్రులు తమ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పటి ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు కూడా కావట్లేదు. అప్పుడే పాలనలో పారదర్శకతను చూపిస్తోంది. -
నేపాల్‌లో మారిందేమిటి?!
తిరుగుబాటు గాలి ఒకచోట పుట్టి చప్పున చల్లారిపోదు. అది సమస్య ఉన్నచోటకల్లా పోయి నిప్పు రాజేస్తుంది. శ్రీలంకలో ప్రజా ఉద్యమానికి జడిసి పాలకులు పదవులూ, ప్యాలెస్‌లూ వదిలి నిష్క్రమించిన తరహాలోనే బంగ్లాదేశ్‌లో కూడా యువజనం ధాటికి 2024 ఆగస్టులో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి హుటాహుటీన న్యూఢిల్లీకి చేరుకుని ఆశ్రయం తీసుకోక తప్పలేదు. ఈ రెండింటినీ చూసి కావొచ్చు... నేపాల్‌లో సైతం జెన్ జీ తరం నిరుడు సెప్టెంబర్‌లో అధికార పీఠాలను కదిలించారు. అక్కడ జరిగిన ఎన్నికల్లో శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు భిన్నంగా యువతరం రాజకీయాల్లోకొచ్చి విజయం సాధించారు. ప్రముఖ ర్యాపర్, కఠ్మాండు మేయర్ బాలేంద్ర షా ప్రధాని అయ్యారు. ఆయనతోపాటు అనేక కొత్త ముఖాలు పార్లమెంటులోకి అడుగుపెట్టాయి. ఆ రకంగా నేపాల్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. కానీ మాజీ ప్రధాని, సీపీఎన్(యూఎంఎల్) అధినేత కేపీ శర్మ ఓలిని శుక్రవారం అరెస్టు చేయడాన్ని గమనిస్తే శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మాదిరి కాకుండా గత పాలకుల్ని వేధించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనబడుతోంది. శ్రీలంకలో మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను నిరుడు అవినీతి ఆరోపణలపై అరెస్టు చేసిన సంగతి నిజమే అయినా, ఆ వెంటనే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. బంగ్లాదేశ్‌లో అయితే వేధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకమని కొత్త ప్రధాని తారిక్ రెహ్మాన్ ప్రకటించి ఇంతవరకూ విపక్ష నేతల జోలికి పోలేదు. హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ఇప్పటికీ భారత్‌ను కోరుతున్న మాట వాస్తవమే అయినా, అదే పనిగా పేచీకి దిగే ఉద్దేశం ప్రస్తుతానికైతే దానికి ఉన్నట్టు కనబడదు. నేపాల్‌లో నిరుడు సెప్టెంబర్‌లో జరిగిన నిరసనోద్యమంలో 77 మంది ప్రాణాలు బలిగొన్న భద్రతా బలగాల కాల్పులకు కారణమన్న కేసులో శర్మ ఓలిని, అప్పటి హోంమంత్రి రమేష్ లేఖక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జరిగిన నేపాల్ కొత్త కేబినెట్ తొలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రత్యేక కోర్టు మాజీ న్యాయమూర్తి గౌరీ బహదూర్ కార్కీ నేతృత్వంలోని విచారణ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయి. నిజానికి ఆ కమిషన్ ఓలి అపరాధాన్ని నిర్ధారించలేదు. కానీ కాల్పులను ఆయనగానీ, లేఖక్గానీ ఆపలేకపోయారని తెలిపింది. నేపాల్‌లో ఉద్యమకాలంలో జరిగిన హింస తక్కువేమీ కాదు. పార్లమెంటు ఆవరణలో, కోర్టుల్లో గుంపులు జొరబడి విధ్వంసానికి దిగాయి. 65 మంది రాజకీయ నాయకుల, పలు వ్యాపారవేత్తల ఇళ్లు, అన్ని పార్టీల కార్యాలయాలు, జైళ్లు ఉద్యమకారుల ధాటికి దెబ్బతిన్నాయి. అలాంటి సందర్భాల్లో ఏ దేశంలోనైనా భద్రతాదళాలు మౌనంగా ఉండగలవా? అయితే ప్రదర్శకులను చెదరగొట్టే ఉద్దేశంతోకాక వారి ప్రాణాలు తీయ టానికే కాల్పులు జరిపారన్న ఆరోపణలపై అన్ని కోణాల్లోనూ విచారణ జరిపి కారకుల్ని శిక్షించాల్సిందే. కానీ కక్ష తీర్చుకోవటమే ముఖ్యమన్నట్టు ప్రవర్తిస్తున్న తీరే ఆశ్చర్యం కలిగిస్తుంది. రిపబ్లిక్ గా ఏర్పడ్డాక నేపాల్‌లో జరిగిన పరిణామాలకు అన్ని పార్టీల నేతలూ బాధ్యులే. రాచరికాన్ని ప్రజలెందుకు తరిమికొట్టారో గ్రహించక ఫిరాయింపులతో ప్రభుత్వాలను పడగొట్టడం, అవినీతికి పాల్పడటం అక్కడి నాయకులకు రివాజయింది. వీటన్నిటినీ చూసి తీవ్రంగా కలతచెందబట్టే జెన్ జీ తరం జూలు విదిల్చింది. అదొక్కటే కారణం కాదు. యువత ఉపాధి లేమితో తీవ్ర ఇబ్బందులకు లోనవుతోంది. కొలువులు దొరక్క నైరాశ్యంలో కూరుకుపోతోంది. ఇక ఆశ్రిత పక్షపాతం, అవినీతి, ఆర్థిక వ్యత్యాసాలు సరేసరి. అత్యధిక శాతం యువత పిడికెడు మెతుకుల కోసం భారత్ సహా పలు దేశాలకు వలసపోవటం, ఎంతోకొంత మిగిల్చి కుటుంబాలకు పంపటం మామూలే. అలా పంపుతున్న డబ్బే నేపాల్ జీడీపీలో అధిక శాతం ఆక్రమిస్తోందంటే ఆశ్చర్యం కలుగుతుంది. తయారీరంగ పరిశ్రమలపైనా, ఇతర ప్రాజెక్టులపైనా దృష్టి కేంద్రీకరిస్తే తమ పిల్లలు ఇక్కడే స్థిరపడటానికి అవకాశం ఉంటుందని అనేకులు ఎదురు చూస్తున్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవటానికి బదులు కక్ష రాజకీయాలతోనే పాలనకు శ్రీకారం చుట్టి తాను గత పాలకులకు భిన్నమేమీ కాదని బాలేంద్ర షా నిరూపించారు. తిరుగుబాటు స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుంది. -
అంగరంగ వైభవంగా ప్రమాణం, కనిపించని మాజీ ప్రధాని
ర్యాపర్‌గా కెరీర్ ప్రారంభించి, అతి చిన్న వయసులోనే నేపాల్ రాజకీయాలను మలుపు తిప్పిన యువనేత బాలేంద్ర షా (Balen Shah)నేపాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. శుక్రవారం నేపాల్ కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి కార్యాలయం శీతల్ నివాస్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అట్టహాసంగా, రాజకీయ సందడి నెలకొంది. ప్రధానిగా బాలెన్ షా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేపాల్ రాజకీయ దిగ్గజాలు హాజరయ్యారు. మాజీ ప్రధానమంత్రులు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఒకరు మాత్రం గైర్హాజరు కావడం గమనార్హం.కేపీ శర్మ ఓలీ గైర్హాజరుఈ కార్యక్రమానికి పుష్ప కమల్ దహల్ “ప్రచండ”, మాధవ్ కుమార్ నేపాల్, ఝలనాథ్ ఖనాల్, , బాబురామ్ భట్టారాయ్లతో సహా పలువురు మాజీ ప్రధానమంత్రులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి , తాత్కాలిక ప్రభుత్వ అధిపతి అయిన ఖిల్ రాజ్ రెగ్మీ కూడా హాజరయ్యారు. విదేశాలలో ఉన్నందున హాజరు కాలేకపోయిన నేపాలీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా కూడా ఈ సమావేశానికి హాజరుకాని వారిలో ముఖ్యమైనవారు.కా నీ మాజీ ప్రధానమంత్రి, యూఎంఎల్ ఛైర్మన్,కేపీ శర్మ ఓలీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాకపోవడం ఆశ్చర్యపరిచింది.ఇదీ చదవండి: బాలేన్ షా సరికొత్త చరిత్ర..32 ప్రభుత్వాల్లో ఒక్కటీ..!బోర్న్ లీడర్ బాలెన్ముగ్గురు తోబుట్టువులలో చిన్నవాడైన బాలేన్, అక్క బావ సుజాత , కౌశల్ షాల వద్ద పెరిగాడు. వారు అతనిలోని నాయకత్వ లక్షణాలను చిన్నప్పుడే గుర్తించారు. అందుకే అతను "బాలెన్ పుట్టుకతోనే నాయకుడు అంటారు. బాలెన్ మానసికంగా చాలా దృఢమైన వ్యక్తి, అతను ఎల్లప్పుడూ దేశానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నామనంటూ సుజాత, కౌశల్ దంపతులు అభిలషించారు. కానీ మొదట రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు, ఆశ్చర్యం కలిగించింది. నాయకుడుగా బాలెన్ ఎదిగిన తీరు చూశాక తాము తీసుకున్న అత్యంత సరైన నిర్ణయమని ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ సుజాత ఆనందాన్ని వెలిబుచ్చారు. కాగా తన సొంత కంచుకోటలో ఓలీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్నారు. నాలుగు సార్లు ప్రధాని అయిన ఓలీకి కేవలం 18,734 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రభుత్వం విధించిన సోషల్ మీడియా నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమం కారణంగా చెలరేగిన విస్తృత నిరసనల నేపథ్యంలో, ఓలీ 2025 సెప్టెంబర్ 9న ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. -
బాలేన్ షా సరికొత్త చరిత్ర..32 ప్రభుత్వాల్లో ఒక్కటీ..!
ర్యాపర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యువకెరటం బాలేంద్ర షా (Balen Shah) నేపాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. బాలెన్‌గా పాపులర్ అయిన బాలేంద్రషా గత ఏడాది జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బాలేంద్ర షా నేతృత్వంలోనిపార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఘన విజయం సాధించింది. 1999 తర్వాత తొలిసారిగా ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించింది కూడా బాలేంద్రనే. దీంతో దశాబ్దాల కాలం తర్వాత భారత్ సరిహద్దుల్లోని దక్షిణ మైదాన ప్రాంతానికి చెందిన 'మధేసీ' వ్యక్తి నేపాల్ పగ్గాలు చేపట్టడం ఒక విశేషంఅవినీతి రహిత పాలన కోరుతూ గత ఏడాది జరిగిన జెన్ జెడ్ విప్లవం తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలలో, నేపాల్ సంప్రదాయ పార్టీలను చిత్తుగా ఓడించాడు ఖాఠ్మండు మాజీ మేయర్ బాలేన్. మార్చి 5న జరిగిన ఈ ఎన్నికల్లో బాలేన్ నేతృత్వంలోని ఆర్ఎస్పీ 182 సీట్లు (మొత్తం 275లో) సాధించి రికార్డు సృష్టించింది. దీంతో 35 ఏళ్ల వయసులో నేపాల్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12:34 గంటలకు ఖాట్మండులోని 'శీతల్ నివాస్'లో ప్రెసిడెంట్ రామ్ చంద్ర పౌడెల్ సమక్షంలో బాలేన్ షా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Kathmandu: Rastriya Swatantra Party (RSP) leader Balendra Shah takes oath as Prime Minister of NepalVideo source: Nepal Television/YouTube pic.twitter.com/Th6NxTZWwm— ANI (@ANI) March 27, 2026చారిత్రాత్మక విజయం ప్రమాణ స్వీకారం పూజారుల వేద మంత్రాలమధ్య ఎర్రని వస్త్రాలు ధరించిన బౌద్ధ సన్యాసుల సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ ప్రమాణ స్వీకారం చేయించారు. బాలేంద్ర షా తన మార్కు స్టైల్ స్కిన్-టైట్ ప్యాంటు, మ్యాచింగ్ జాకెట్,నల్ల కళ్లజోడు ధరించి దేశం, ప్రజల తరఫున, రాజ్యాంగానికి విధేయుడిగా ఉంటానని, ప్రధానమంత్రిగా నా కర్తవ్యాన్ని నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేశారు బాలేన్ షా. నేపాల్ చరిత్రలో మధేసీ ప్రాంతానికి చెందిన వ్యక్తి తొలి ప్రధాని కావడంతో దేశంలోని మధేసీ ప్రజలలో కొత్త ఆశలను చిగురింపజేసింది.మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి షాక్ స్ట్రక్చరల్ ఇంజనీర్ ర్యాపర్‌గా పాపులర్ అయిన బాలేన్ రాజకీయ ఆరంగేట్రం2022లో జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఖాట్మండు మేయర్‌గా గెలిచారు. తాజా ఎన్నికల్లో ఝాపా-5 నియోజకవర్గంలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని సుమారు 50 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఓడించడం విశేషం. దేశంలోనే అత్యంత పురాతన పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ పార్టీ, కేవలం 38 స్థానాలతో పరిమితమూ రెండో స్థానానికి పడిపోయింది. జెన్ జెడ్ ఆందోళనల తర్వాత రాజీనామా చేయవలసి వచ్చిన ఓలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) 25 సీట్లను గెల్చుకుంది. ముందున్న సవాళ్లు3 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఉద్యోగాల కొరత, పాతుకుపోయిన అవినీతి కారణంగా యువత నేతృత్వంలోని నిరసనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ జనాభాలో ఐదవ వంతు మంది పేదరికంలో జీవిస్తుండగా, ప్రతిరోజూ సుమారు 1,500 మంది పని కోసం విదేశాలకు వలస వెళ్తున్నారు. దేశంలో రాజకీయ అస్థిరత కూడా ఒక శాపంగా మారింది. 1990 నుండి 32 ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా, వాటిలో ఏదీ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేదు.సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకోవడం , క్షేత్రస్థాయిలో అవినీతిపై పోరాటమే కీలకమైన బలంగా అధికారంలోకి వచ్చిన బాలేన్ ముందు అస్థిరతను తొలగించడం, ఉద్యోగాల కల్పన, అవినీతి నిర్మూలన లాంటి అనేక సవాళ్లను ఏ మేరకు అధిగమించగలడు అనేది కాలమే చెప్పాలి. -
బాలేన్ షా పార్టీకి 182 సీట్లు
కఠ్మాండు: ఇటీవల నేపాల్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల ఫలితాల్లో పూర్తి స్థాయి స్పష్టత వచ్చింది. ప్రధానమంత్రి అభ్యర్థి బాలేంద్ర షాకు చెందిన రాష్ట్రాయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) మొత్తం 182 స్థానాలను గెలుచుకుందని ఎన్నికల కమిషన్(ఈసీ) గురువారం ప్రకటించింది. ఈ పార్టీకి ప్రత్యక్ష ఎన్నికల్లో ఏకంగా 125 సీట్లు రాగా, దామాషా విధానంలో జరిగిన పోలింగ్‌లో అత్యధికంగా 57 సీట్లు దక్కించుకుందని ఈసీ తెలిపింది. నేపాల్ పార్లమెంట్‌లోని 275 సీట్లకు గాను, 165 మంది సభ్యులను ప్రత్యక్షంగాను, మిగతా 110 మందిని దామాషా విధానంలోను ఎన్నుకుంటారు.ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సాధారణ మెజారిటీ 138 సీట్లు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(1)ప్రకారం అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన ఆర్ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. కఠ్మాండు మాజీ మేయర్ కూడా అయిన బాలేంద్ర షా(35), అలియాస్ బాలేన్‌ను ఆర్ఎస్పీ ఇప్పటికే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం తెల్సిందే. ఈ ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్ 20 సీట్లు, సీపీఎన్–యూఎంఎల్‌కు 16, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ కి 9, శ్రమ్ శక్తి పార్టీ, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కి నాలుగు చొప్పున స్థానాలు దక్కాయి. -
అద్భుత విజయం... అనేక సవాళ్లు
నేపాల్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా చూసినా అక్కడి ప్రజలకు ఒక అద్భుతమైన విజయం అనాలి. అట్లాగే ఆ దేశం ఎదుర్కొంటున్న సమస్యలు కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాళ్లు కానున్నాయి. చిరకాలంగా వేధిస్తున్న సమస్యలు ఇంతవరకు పాలించిన పార్టీల వైఫల్యం వల్ల తీవ్ర రూపానికి వచ్చినందున, అవి సులభంగా పరిష్కారమయేవి కావని వేరే చెప్పనక్కరలేదు. కొత్త ప్రధాని బాలేంద్ర షా ప్రభుత్వం ఆ దిశగా ఎట్లా పురోగమించగలదన్నదే ఇక గమనించవలసిన విషయమవుతున్నది. అందుకోసం వెంటనే కనిపిస్తున్న ఒక సానుకూల స్థితి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్.ఎస్.పి.)కి సుస్థిరమైన ఆధిక్యత లభించటం. 2008లో రాచరికం రద్దయి పూర్తి స్థాయిలో ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఈ 18 సంవత్సరాలలో 14 ప్రభుత్వాలు మారటమనే అసాధారణ స్థితిని బట్టి దేశంలో ఎంతటి అస్థిరత కొనసాగిందో గ్రహించవచ్చు. వాస్తవానికి 3 ప్రధాన పార్టీలైన నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్(యూఎంఎల్), మావోయిస్టు పార్టీలలో దేనికీ పూర్తి ఆధిక్యత రాకున్నా ఏ ఇద్దరో కలిసి తగిన మెజారిటీతోనే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వచ్చారు. అటువంటప్పుడు 5 ఏళ్ళ పాటు పాలించేందుకు సమస్య ఉండకూడదు. గత 18 ఏళ్ళలో 4 ప్రభుత్వాలే రావాల్సింది. కానీ కేవలం పార్టీ నాయకుల అధికార దాహం, అవకాశవాదం, అవినీతి వల్ల ఏ ప్రభుత్వమూ సరిగా సాగలేదు. ఫలితంగా అస్థిరత అన్నది పరిపాలనా వైఫల్యాల కన్నా పెద్ద సమస్యగా మారింది. అనుభవం లేకపోయినా...ఎన్నికల ఫలితాలు కూడా జెన్–జీ తిరుగుబాటును పోలిన భూకంపాన్ని సృష్టిస్తున్నాయి. తక్కిన మూడు పార్టీలు దశాబ్దాలుగా ఉన్నవి కాగా, ఇపుడు గెలిచిన ఆర్ఎస్పి కేవలం 2022లో ఏర్పడినట్టిది. దానిని స్థాపించిన రబీ లమిఛానే రాజకీయానుభవం ఎక్కువేమీ కాదు. గత ఎన్నికలలో సుమారు 20 సీట్లు గెలిచి కె.పి. శర్మ ఓలీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అయిన తను, తర్వాత బయటకు వచ్చి స్వతంత్ర రాజకీయం సాగించారు. ఆయనకు రాజకీయ నాయకునిగా కన్నా జర్నలిస్ట్‌గా, టెలివిజన్ ప్రెజెంటర్‌గా ఎక్కువ పేరుండటం గమనించదగ్గది. తన వృత్తి పరమైన కార్యక్రమాలలో ఆయన మూడు పార్టీలను తీవ్రంగా విమర్శిస్తుండేవారు. విశేషమేమంటే, అదే పద్ధతిలో విమర్శిస్తుండిన ర్యాప్ సింగర్ బాలేంద్ర షా, రాజకీయ అనుభవం ఎంత మాత్రం లేకున్నా, ఖాఠ్మండు మేయర్ పదవికి 2022లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 61,000 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. మంచి పనులు అనేకం చేసి ప్రజాదరణను మరింత పెంచుకుని, జెన్–జీ మద్దతుతోనే మధ్యంతర జస్టిస్ కర్కీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఇదంతా చెప్పటం ఎందుకంటే, ఇంచుమించు ఒకే విధమైన నేపథ్యాలు ఉండిన, అవి కూడా కొద్ది కాలపు అనుభవంతోనే కూడుకున్నవి అయినా, లమిఛానే, బాలేంద్ర షా కలిసి పాత పార్టీలను చిత్తు చేసి గత 18 ఏళ్ల పరిస్థితికి భిన్నంగా ఇపుడు సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. వీరిద్దరికీ తమ స్థానాలలో ఘనమైన మెజారిటీలు రావడం, బాలేంద్రతో పోటీ పడిన మాజీ ప్రధాని ఓలీ తీవ్ర పరాభవానికి గురి కావటమన్నది జెన్–జీ తరంతో పాటు మొత్తంగా ప్రజలలోనే నెలకొన్న ఆలోచనలకు అద్దం పడుతున్న పలు దృష్టాంతాలలో కొన్ని మాత్రమే!మట్టి కరిచిన పార్టీలకు సంబంధించి చెప్పుకోక తప్పని విశేషం మరొకటి విశేషం. నేపాలీ కాంగ్రెస్ గత శతాబ్దం మధ్య నుంచే భారతదేశంలోని కాంగ్రెస్ స్ఫూర్తితో, మద్దతుతో రాచరికానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం తీవ్రమైన ఉద్యమాలు సాగించింది. కొన్ని దశలలో ఆయుధాలు సైతం చేపట్టింది. కొంతకాలం తర్వాత మరొకవైపు కమ్యూనిస్టులు, వారి నుంచి చీలిన మావోయిస్టులు తమ ఉద్యమాలు తాము సాగించారు. చివరకు రాజరికం రద్దయి ప్రజాస్వామ్యం, కొత్త రాజ్యాంగం, ప్రజాస్వామిక పద్ధతి ఎన్నికలు అమలులోకి వచ్చాయి. ఇటువంటి గొప్ప నేపథ్యాలు గల పార్టీలు అధికారం సాగించినపుడు ఏవో కొన్ని వైఫల్యాలున్నా మొత్తం మీద తమ పాలన సుస్థిరంగా సాగి, తగినంత అభివృద్ధిని సాధిస్తూ, నీతిబద్ధమైన ప్రభుత్వాన్ని నడపవలసింది. కానీ అది జరగక, ‘లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్’ నేపాలీ కాంగ్రెస్‌తో పాటు, అన్ని రంగుల కమ్యూనిస్టులూ దారుణంగా విఫలమయ్యారు. ఇపుడు అంతే దారుణంగా ఓడారు. సిద్ధాంతం ఏమిటి?ఈ నేపథ్యమంతటిని బట్టి చూసినపుడు, నేపాల్ రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసి, కొత్త అధ్యాయం మొదలవుతున్నట్లు స్పష్టంగా చెప్పవచ్చు. ఆ కొత్తదనం ఏమిటన్నది తెలియవలసిన విషయం. స్థిరత్వం ఒకటన్నది పైన చూశాము. అది కాక ముఖ్యమైనవి రెండుంటాయి. ఒకటి– ఇంతకాలం పాలించి విఫలమైన పార్టీలకు వలెనే ఆర్ఎస్పీకి గానీ, ఆ పార్టీ నాయకులు ఇద్దరికి గానీ ‘సిద్ధాంతాలు’ అనదగ్గవి ఏమైనా ఉన్నాయా? రెండు – సిద్ధాంతాల మాట అట్లుంచి పరిపాలన గురించి వారి ఆలోచనలు ఏమిటి? ఇంతవరకు తమ సిద్ధాంతాలు ఇవీ అంటూ ఇదమిత్థంగా ఏమీ ప్రకటించలేదు. లమిఛానే 2022 నుంచి ఒక పార్టీ వ్యవస్థాపకునిగా గానీ, బాలేంద్ర షా అదే సమయం నుంచి ఖాఠ్మండు నగరానికి మేయర్‌గా గానీ, ఇద్దరూ జతకలిసిన ప్రస్తుత ఎన్నికల సమయంలో గానీ, సాధారణ రూపంలో వారి మాటలు చేతలను బట్టి మనమే ఒక అభిప్రాయం ఏర్పరుచుకోవాల్సి ఉంటుంది. దానితో పాటు ఆర్ఎస్పీ ఈ ఎన్నికల కోసం ప్రకటించిన మేనిఫెస్టో ఉంది. వీటన్నింటిని పరిశీలించినపుడు కలిగే అభిప్రాయం ఇద్దరు కూడా మధ్యేమార్గవాదులు. నిర్దిష్టమైన సిద్ధాంతాలుండిన పాత పార్టీలను వాటి వైఫల్యం కారణంగా ప్రజలు తిరస్కరించటం, ఆ పార్టీల నాయకుల వలెగాక వీరిద్దరిది యువతరం కావటం వారి మధ్యేమార్గానికి కారణమనుకోవాలి. జెన్–జీ తరం, ప్రజలూ గత ప్రభుత్వాల పాలనా వైఫల్యాలపై ఆగ్రహించినందున, తమ పాలన అందుకు భిన్నంగా ఉండగలదని ఎన్నికల మేనిఫెస్టోలో వివరించారు. అవినీతి, బంధుప్రీతి, అసమర్థ పాలనలకు వ్యతిరేకత, రాజ్యాంగం చెబుతున్నదానికి కట్టుబడటం, పారదర్శకత వంటివి అందులో కనిపిస్తాయి. అసలు పరీక్ష ఇతరత్రా ఉండబోతున్నది. అది వారు లక్ష్యాలుగా ప్రకటించినట్లు దేశంలో ఉత్పత్తిని పెంచి జీడీపీని 50 బిలియన్ డాలర్ల నుంచి రెట్టింపు చేయటం, తలసరి ఆదాయాన్ని అయిదేళ్ళలోనే 1,447 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు పెంచటం, 12 లక్షల ఉద్యోగాల సృష్టి, తద్వారా వలసల తగ్గింపు, పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం వంటివన్నీ భారీ సవాళ్లు కానున్నాయి. దేశంలో అందుకు అవసరమైన సహజ వనరులు, పరిశ్రమలు లేక లోపలి నుంచీ బయటి నుంచీ పెట్టుబడులు పరిమితం అయి, విదేశీ సహాయ నిధులు కూడా అంతే అయినపుడు, ఈ లక్ష్యాల సాధన తేలిక కాదు. అయితే, సుస్థిరత కారణంగా పరిపాలన కూడా సమర్థంగా సాగితే ప్రభుత్వం పట్ల ఇంతవరకు లేని విశ్వాసం ఏర్పడి పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నేపాల్‌కు కాబోయే ప్రధాని.. అప్పట్లో బెంగళూరులో..
కాఠ్మాండు: నేపాల్‌తో పాటు ఆ దేశం చుట్టుపక్కల ఉన్న దేశాల రాజకీయ వర్గాల్లో ఇప్పుడు అధికంగా వినిపిస్తున్న పేరు బాలెన్ షా (బాలేంద్ర షా). ర్యాపర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన రాజకీయాల్లోకి వచ్చి నేపాల్‌లో అతి ముఖ్యమైన నేతగా ఎదిగారు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) తరఫున ఆయన ప్రధాని అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో పోరాడారు.ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇప్పటికీ కొనసాగుతోంది. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 124 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మరో నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉంది. నేపాలీ కాంగ్రెస్ 17 స్థానాలు గెలిచింది. మరో స్థానంలో ముందంజలో ఉంది. యూఎంఎల్ ఎనిమిది స్థానాలు గెలిచింది. ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఎన్సీపీ కేవలం ఏడు స్థానాలు మాత్రమే గెలిచింది. ఆర్పీపీ ఒక స్థానంలో గెలిచింది. శ్రామ్ సంస్కృతి పార్టీ మూడు స్థానాలు గెలిచింది. మయాగ్డి నియోజకవర్గం నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.నేపాల్‌లో 165 స్థానాలకు నేరుగా (ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్), మరో 110 స్థానాల్లో నైష్పక్షిక విధానం (ప్రోపోర్షనల్ రిప్రజెంటేషన్) కింద ఎన్నికలు జరిగాయి. ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ కింద జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు 162 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ప్రోపోర్షనల్ రిప్రజెంటేషన్ (నైష్పక్షిక విధానం) కింద ఉన్న 110 స్థానాల్లో 68 స్థానాల లెక్కింపు పూర్తైంది. ప్రోపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే పార్టీకి వచ్చిన మొత్తం ఓట్ల శాతానికి అనుగుణంగా స్థానాలు కేటాయించే ఎన్నికల విధానం. బెంగళూరులో బాలేంద్ర షా ఎంటెక్ బాలేంద్ర షా నేపాల్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒకప్పుడు బాలేంద్ర షా బెంగళూరు నిట్టె మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లో చదివారు. అక్కడ ఆయన ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో విద్యనభ్యసించారు.తాజాగా, నిట్టె మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లెక్చరర్లు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తమ పూర్వ విద్యార్థి ఇప్పుడు నేపాల్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన తీరు చూసి గర్వంగా ఉందని తెలిపారు. ఆసక్తికర విషయం ఏంటంటే, ఆ సంస్థలో చదువుతున్న సమయంలో బాలేంద్ర షా రాజకీయాల్లో ఆసక్తి స్పష్టంగా చూపలేదు.రాజకీయాల్లోకి రావడానికి ముందు బాలేంద్ర షా.. నేపాలీ రాప్ మ్యూజిక్‌లో బాగా పాపులర్ అయ్యారు. అయినా క్యాంపస్‌లో ఉన్న సమయంలో ఆయన రాప్ పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు. ఆయన మ్యూజిక్, పాటలు అధికంగా నేపాలి భాషలోనే ఉండేవి.బాలేంద్ర షాకు నేపాల్ ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్ష ఉందని బెంగళూరులోని ఆయన లెక్చరర్లు భావిస్తున్నారు. ర్యాపర్ నుంచి కాఠ్మాండు మేయర్ స్థాయికి, అక్కడి నుంచి జాతీయ నాయకుడిగా ఎదిగిని బాలేంద్ర షా రాజకీయ ప్రయాణం ఇంకా ముందుకు సాగుతోంది. ఒకవేళ ఆయన తిరిగి క్యాంపస్‌కి అతిథిగా వస్తే ఘనస్వాగతం పలకాలని నిట్టె మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భావిస్తోంది. బాలేంద్ర షా ఝాపా-5 నియోజకవర్గం పార్లమెంటు ఎన్నికలో విజయం సాధించారు. ఆయన ప్రధాన ప్రత్యర్థి, మాజీ నేపాలి ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ ఓటమి చెందారు. ఆయన పార్టీ ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించింది. -
కొనసాగుతున్న నేపాల్ ఎన్నికల కౌంటింగ్.. వార్ వన్ సైడ్
కాఠ్మాండు: నేపాల్ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. కౌంటింగ్ శుక్రవారం ఉదయం మొదలైన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం 4 గంటల వరకు వెల్లడైన ఫలితాలను బట్టి.. జెన్ జీ అభిమాన నాయకుడు, మాజీ కాఠ్మాండు మాజీ మేయర్ బాలేంద్ర షా (35)కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) 46 సీట్లలో గెలుపొంది, మరో 73 స్థానాల్లో ముందంజలో ఉంది. నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ ఒక సీటు గెలుపొంది, మరో ఏడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నారు.ఏ విధంగా చూసుకున్నా ఆర్ఎస్పీ గెలుపు ఖాయమని స్పష్టమవుతోంది. 275 మంది సభ్యులు ఉండే ప్రతినిధి సభకు ఈ నెల 5న ఓటింగ్ జరిగింది. 165 స్థానాలకు నేరుగా, మరో 110 సీట్లకు నైష్పక్షిక విధానంలో ఓటింగ్ జరిగింది. మాజీ ప్రధానిపై బలేంద్ర షా ఆధిక్యం జాపా-5 నియోజకవర్గంలో బలేంద్ర షా 55,934 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. మాజీ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ (నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ) 10,293 ఓట్లు మాత్రమే సాధించారు. శ్రమ్ సంస్కృతి పార్టీకి చెందిన సమీర్ తమాంగ్కు 6,324 ఓట్లు పడ్డాయి. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఆర్ఎస్పీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కనపడుతోంది.దిగువ సభలో మొత్తం 275 స్థానాలు ఉన్నాయి. వాటిలో 110 స్థానాలు ప్రోపోర్షనల్ రిప్రెజెంటేషన్ విధానం ద్వారా కేటాయిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 138 స్థానాలు అవసరం. నేపాల్‌లో మొత్తం 1.9 కోట్ల మంది ఓటర్లు ఉండగా, సుమారు 60 శాతం మంది ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో 65 పార్టీల నుంచి 3,400కి పైగా అభ్యర్థులు పోటీ చేశారు. -
ఇంజనీర్, ర్యాపర్, మేయర్.. బాలేన్
ఆయన పాటలు జెన్ జెడ్‌ను ఉద్యమం వైపు పురిగొల్పాయి. కఠ్మాండు మాజీ మేయర్ కూడా అయిన ఆయన ఇప్పుడు ప్రధాని అయి నేపాల్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అతడే బాలేంద్ర షా..నేపాలీలు ముద్దుగా పిల్చుకునే బాలేన్..!మార్చి 4వ తేదీ. మరో రెండు రోజుల్లో జరిగే సాధారణ ఎన్నికలకు దేశం సమాయత్తమవుతుండగా ఝాపా జిల్లా వాసులు బాలేన్‌తో సెల్ఫీ కోసం క్యూ కట్టారు. ఎన్నికల ప్రచారం కోసం వచి్చన బాలేన్‌తో ఫొటో దిగేందుకు పోటీలు పడ్డారు. దీంతో, కార్యకర్తలు వారిని నియంత్రించే పనిలో బిజీ అయిపోయారు. బాలేన్‌తో సెల్ఫీ దిగాలని ముచ్చటపడే వారిని క్యూలో నిల్చోబెట్టి, ఒక్కొక్కరికి 10 సెకన్ల చొప్పున సమయమిచ్చారు. ఆ జనం మధ్యలో బాలెన్ నిలబడి ఉన్నారు. నల్లటి బ్లేజర్, నీటుగా ట్రిమ్ చేసిన గడ్డం, తనదైన స్టయిల్లో దీర్ఘచతురస్రాకారపు కళ్లద్దాలతో కనిపిస్తున్నారు. ఆయన వారిని బాలేన్, ఒక కరచాలనం, ఒక చిరునవ్వు, ఒక సెలీ్ఫతో సంతోషపెడుతున్నారు. బాలేన్ ధరించే దీర్ఘచతురస్రాకారపు కళ్లద్దాలు ఇప్పటికీ ఆన్లైన్లో బాలేన్ షా గ్లాసెస్ పేరుతో జనం కొనుగోలు చేస్తుండటం విశేషం. ఇంతటి జనాదరణ కలిగిన 36 ఏళ్ల బాలేన్..అదే బాలేంద్ర షా కఠ్మాండుకు చెందిన ఆయుర్వేద వైద్యుడు రామ్ నారాయణ్ షా నలుగురు కుమారుల్లో చిన్నవాడు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షతో మెలిగిన ఇతడికి కవితలు రాయడమంటే తెగపిచి్చ. నేపాల్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన బాలేంద్ర, భారత్‌లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో పీజీ చదివాడు. 2013లో నేపాల్‌లో బాగా పేరున్న ర్యాబార్జ్ పోటీలో గెలుపొందాడు. అందులో బాలేన్ అవినీతి, రాజకీయ స్తబ్ధత, వారసత్వ పాలన వంటి వాటిపై స్వయంగా రాసి పాడిన పాటలు సూపర్ హిట్టయ్యాయి. ర్యాపర్ కంటే కూడా ఆయన మంచి కవి అని విమర్శకులు అంటున్నారు. అణగారిన ప్రజల గురించే ఆయన ఎక్కువగా కవితల్లో ప్రస్తావిస్తుంటారని, సామాన్యుల్లో ఆయనకు ఆదరణ ఇంతగా పెరగటానికి ఇవే కారణమని కూడా చెబుతున్నారు. అమెరికా, చైనాతోపాటు భారత్‌నూ వదల్లేదు..!గతేడాది సెప్టెంబర్‌లో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రంగా ఉద్యమించినప్పుడు బాలేన్ స్వయంగా అందులో పాల్గొనలేదు. కానీ, ఆన్లైన్ వేదికగా పూర్తి మద్దతు ప్రకటించారు. అమెరికా, చైనా, భారత్‌లను తిట్టిపోసిన బాలేన్..వీరితో ఏపనీ కాదంటూ ఫేస్బుక్లో షాకిచ్చే పోస్ట్ పెట్టారు. ఆ సమయంలో బాలేన్ దేశాన్ని ముందుకు నడిపించేందుకు తగిన వ్యక్తి అంటూ 16 వేల సార్లు ప్రస్తావనకు వచి్చనట్లు అంచనా. పెద్ద సంఖ్యలో యువత ఆయన నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని కోరినా ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కికి బాధ్యతలను అప్పగించాలనే ప్రతిపాదనకు మద్దతు పలికారు. రెండు నెలల అనంతరం మేయర్ పదవికి రాజీనామా చేసిన రా్రïÙ్టయ స్వతంత్ర రాష్ట్ర పార్టీలో చేరారు. మేయర్‌గా దూకుడు... 2022లో బాలేన్ కఠ్మాండు మేయర్ పదవికి స్వతంత్ర అభ్యరి్థగా పోటీకి దిగి ఏకంగా 61 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. ఎప్పటి నుంచో అధికారంలో కొనసాగుతున్న పారీ్టలను షాక్ తినిపించారు. పాలనలోనూ అదే దూకుడు కనబరిచారు. ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించారు. కఠ్మాండులోని అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూలగొట్టించారు. నగరంలో చెత్తాచెదారాన్ని శుభ్రం చేసే యంత్రాంగమే లేదని నిరసనగా చెత్తను ప్రధాని కార్యాలయం ఆవరణలో పారబోయించారు. 2025 సెప్టెంబర్‌లో ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన జెన్‌జెడ్ ఆందోళనలు నేపాల్ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చి వేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నేపాల్ ఎన్నికల కౌంటింగ్‌లో దూసుకుపోతున్న బాలేంద్ర షా ‘ఆర్ఎస్పీ’
కాఠ్మాండు: నేపాల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఆ దేశంలో గత ఏడాది జెన్ జీ నిరసనలతో కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. ఇవాళ ఉదయం ఉన్న ట్రెండ్స్‌ను బట్టి చూస్తే ఝాపా నియోజక వర్గంలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ(74)పై జెన్ జీ అభిమాన నాయకుడు కాఠ్మాండు మాజీ మేయర్, ర్యాపర్ బాలేంద్ర షా (35) ఆధిక్యంలో ఉన్నారు.ఈ ఎన్నికల ముందు నిర్వహించిన సభల్లో బాలేంద్ర షా పెద్ద ఎత్తున ఓటర్లను ఆకర్షించారు. ఆయన సభలకు అధికంగా యువత హాజరైంది. బాలేంద్ర షాను బలెన్గానూ పిలుస్తుంటారు. ఆయన గత డిసెంబర్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీలో చేరారు. ఆ పార్టీకి మాజీ టీవీ హోస్ట్ రబి లామిచ్ఛానే అధ్యక్షుడు. అయితే, తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా బాలేంద్ర షా పేరును ఆర్ఎస్పీ ప్రకటించింది.రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఇవాళ ఉదయం 11 గంటల వరకు వెలువడిన ఫలితాల్లో మూడు సీట్లలో గెలుపు సాధించగా, 45కి పైగా సీట్లలో ముందంజలో ఉంది. కేపీ శర్మ ఒలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యునైటెడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) పార్టీ, గగన్ థాపా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ పార్టీలు తలో 3 సీట్లలో మాత్రమే ముందంజలో ఉన్నాయి.మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన పుష్ప కమల్ దహాల్ నేతృత్వంలోని నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ రుకుమ్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ముందంజలో ఉంది. నేపాల్‌లో 17 సంవత్సరాల్లో 14 ప్రభుత్వాలు మారాయి. రాజకీయ అస్థిరత ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. నేపాల్‌లో 1.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సుమారు 60 శాతం మంది గురువారం జరిగిన ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో 65 పార్టీల నుంచి 3,400కి పైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు.నేపాల్ ఎన్నికల ఫలితాలపై భారత్ దృష్టి నేపాల్ ఎన్నికల ఫలితాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ ఇటీవల నేపాల్‌లో శాంతి, పురోగతి, స్థిరత్వానికి భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని తెలిపారు. సత్సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా నేపాల్ కొత్త ప్రభుత్వంతో పని చేయాలని ఎదురుచూస్తున్నామని ఆయన అన్నారు. నేపాల్ ఎన్నికలకు భారత్ లాజిస్టిక్ సరఫరాలు కూడా చేసింది. -
ప్రభాస్ సినిమా చూసి భారతీయ సినిమాలను నిషేధించాడు!
భారత్‌కు చిరకాల మిత్ర దేశం, పొరుగు దేశమైన నేపాల్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. అవినీతితో పాటు సోషల్ మీడియాపై నిషేధాలతో మొదలైన ప్రజాగ్రహానికి ప్రధాని సహా ప్రభుత్వం మొత్తం దాసోహమైపోయింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ ప్రధాని , దేశాధ్యక్షుడు సహా రాజీనామా చేసేశారు. ఈ నేపధ్యంలో ఆ దేశ ప్రధానిగా బాలేంద్ర షా పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఖాట్మాండు మేయర్‌గా ఉన్న బాలేంద్ర కు యువతలో ఉన్న ఆదరణ, ఆయనను ప్రధానిగా కోరుకుంటున్న వారు పెద్ద సంఖ్యలో ఉండడంతో తదుపరి ప్రధాని ఆయనే అనే ఆలోచన బలపడుతోంది.ఈ నేపధ్యంలో కాబోయే ప్రధానిగా పేర్కొంటున్న బాలేంద్ర షా కు భారత్ తో ఉన్న వైరుధ్యాలు ప్రస్తావనకు వస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఆయన రెండేళ్ల క్రితం భారత సినిమాలపై చూపించిన అవసరానికి మించిన ఆగ్రహం ప్రస్తావనార్హంగా మారింది. రెండేళ్ల క్రితం ఖాట్మండు మేయర్ హోదాలో ఆయన ఖాట్మాండు నగరంలో భారతీయ సినిమాల ప్రదర్శనలను నిలిపేయాలని ఆదేశించారు. దాంతో ఖాట్మాండు మెట్రోపాలిస్‌తో పాటు, పోఖారా మెట్రోపాలిటన్ నగరం కూడా భారతీయ చిత్రాల ప్రదర్శనపై నిషేధం విధించింది. ఈ విషయంలో పోఖారా మేయర్ ధనరాజ్ ఆచార్య కూడా బాలేంద్ర షా మార్గాన్నే అనుసరిస్తూ బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనను నిలిపివేయాలని మధ్య నేపాల్‌లోని మెట్రోపాలిటన్ నగరంలోని సినిమా హాళ్లను ఆదేశించారు. రెండు మెట్రోపాలిటన్ నగరాల మేయర్ల ఆదేశాల తర్వాత, అక్కడ సినిమా హాళ్లు హిందీ లేదా బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనను రద్దు చేసి, వాటి స్థానంలో హాలీవుడ్ నేపాలీ సినిమాలను అప్పటికప్పుడు ప్రవేశపెట్టాయి. ఇంతకీ ఇలా బాలీవుడ్ చిత్రాలపై నేపాల్ మేయర్ల ఆగ్రహానికి కారణమైంది టాలీవుడ్ రెబల్ స్టార్ నటించిన ఆదిపురుష్ సినిమా కావడం విశేషం. దీనికి కారణాలను బాలేంద్ర షా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ‘భారతీయ చిత్రం ఆదిపురుష్ చూశాను. ఆ సినిమాలో రాముని సతీమణి జానకి జన్మ స్థలంపై తప్పు సమాచారం ఉంది . అందులో ఆమెను భారతదేశపు కుమార్తె అని చెప్పే సంభాషణ ఉంది (నేపాలీయులు సీతమ్మ తమ నేలపైనే జన్మించినట్టు విశ్వసిస్తారు), ఇది సరికాదని, అభ్యంతరకరమైనదని మేం వారి దృష్టికి తీసుకెళ్లాం. తప్పును సరిదిద్దడానికి 3 రోజుల సమయంతో అల్టిమేటం ఇచ్చాము. అయినా వారు పట్టించుకోలేదు. నేపాల్ స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఆత్మగౌరవాన్ని చెక్కుచెదరకుండా ఉంచడం ద్వారా జాతీయ ప్రయోజనాలను కాపాడటం ప్రతి ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వేతర రంగం నేపాలీ పౌరుడి ప్రథమ కర్తవ్యం అనడంలో ఎటువంటి సందేహం లేదు‘ అని ఖాట్మండు మేయర్ అప్పట్లో తన ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.అయితే ఆ తర్వాత నేపాలీ రాజధానిలో ప్రదర్శనపై నిషేధం నేపధ్యంలో, ’ఆదిపురుష్’ నిర్మాణ సంస్థ ’టి–సిరీస్’ నేపాలీ మేయర్‌కు లేఖ రాసింది. అనంతరం సినిమాల నిషేధాన్ని ఎత్తివేయాలని ఆదేశాలిస్తూ న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్ధుమణిగింది.


