నేపాల్‌ ఎన్నికల కౌంటింగ్‌లో దూసుకుపోతున్న బాలేంద్ర షా ‘ఆర్‌ఎస్‌పీ’ | Gen Z's Favourite Leader Balendra Shah Leads Against Ex-PM KP Sharma Oli In Nepal Election Trends, Read Story Inside | Sakshi
Sakshi News home page

నేపాల్‌ ఎన్నికల కౌంటింగ్‌లో దూసుకుపోతున్న బాలేంద్ర షా ‘ఆర్‌ఎస్‌పీ’

Mar 6 2026 11:19 AM | Updated on Mar 6 2026 11:25 AM

Gen Z's Favourite Balendra Shah Leads Ex-PM KP Sharma Oli As Nepal Counts Votes

కాఠ్మాండు: నేపాల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఆ దేశంలో గత ఏడాది జెన్‌ జీ నిరసనలతో కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. ఇవాళ ఉదయం ఉన్న ట్రెండ్స్‌ను బట్టి చూస్తే ఝాపా నియోజక వర్గంలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ(74)పై జెన్‌ జీ అభిమాన నాయకుడు కాఠ్మాండు మాజీ మేయర్‌, ర్యాపర్‌ బాలేంద్ర షా (35) ఆధిక్యంలో ఉన్నారు.

ఈ ఎన్నికల ముందు నిర‍్వహించిన సభల్లో బాలేంద్ర షా పెద్ద ఎత్తున ఓటర్లను ఆకర్షించారు. ఆయన సభలకు అధికంగా యువత హాజరైంది. బాలేంద్ర షాను బలెన్‌గానూ పిలుస్తుంటారు. ఆయన గత డిసెంబర్‌లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీలో చేరారు. ఆ పార్టీకి మాజీ టీవీ హోస్ట్ రబి లామిచ్ఛానే అధ్యక్షుడు. అయితే, తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా బాలేంద్ర షా పేరును ఆర్‌ఎస్‌పీ ప్రకటించింది.

రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఇవాళ ఉదయం 11 గంటల వరకు వెలువడిన ఫలితాల్లో మూడు సీట్లలో గెలుపు సాధించగా, 45కి పైగా సీట్లలో ముందంజలో ఉంది. కేపీ శర్మ ఒలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యునైటెడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) పార్టీ, గగన్ థాపా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ పార్టీలు తలో 3 సీట్లలో మాత్రమే ముందంజలో ఉన్నాయి.

మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన పుష్ప కమల్ దహాల్ నేతృత్వంలోని నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ రుకుమ్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ముందంజలో ఉంది. నేపాల్‌లో 17 సంవత్సరాల్లో 14 ప్రభుత్వాలు మారాయి. రాజకీయ అస్థిరత ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. నేపాల్‌లో 1.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సుమారు 60 శాతం మంది గురువారం జరిగిన ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో 65 పార్టీల నుంచి 3,400కి పైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

నేపాల్ ఎన్నికల ఫలితాలపై భారత్ దృష్టి 
నేపాల్ ఎన్నికల ఫలితాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ ఇటీవల నేపాల్‌లో శాంతి, పురోగతి, స్థిరత్వానికి భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని తెలిపారు. సత్సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా నేపాల్ కొత్త ప్రభుత్వంతో పని చేయాలని ఎదురుచూస్తున్నామని ఆయన అన్నారు. నేపాల్ ఎన్నికలకు భారత్ లాజిస్టిక్ సరఫరాలు కూడా చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement