జెన్ జెడ్ నిరసనల తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
275 స్థానాలకు 3,406 మంది అభ్యర్థుల పోటీ
భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టిన ఎన్నికల కమిషన్
కఠ్మాండు: నేపాల్‌లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. జెన్ జెడ్ యువత ఆందోళనలతో గతేడాది కేపీ శర్మ ఓలి సార థ్యంలోని ప్రభుత్వం పడిపోయాక జరుగుతు న్న మొదటి ఎన్నికలివి. నేపాల్ పార్లమెంట్ ప్రతినిధుల సభలోని 275 స్థానాలకు గాను అర్హులైన 1.89 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థులను ఎన్నుకోనున్నారు. బరిలో 3,406 మంది అభ్యర్థులుండగా 165 సీట్లకు ప్రత్యక్ష ఓటింగ్, మిగతా 110 సీట్లకు నైష్పత్తిక ప్రాతినిథ్య పద్ధతిలో ఓటింగ్ జరగనుంది. ఈ నెల 2వ తేదీ సోమవారం అర్ధరాత్రితో ప్రచార పర్వం ముగిసింది.
గురువారం ఉదయం 7 మొదలుకానున్న పోలింగ్, సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. తాత్కాలిక ఎన్నికల ప్రధాన కమిషనర్ రాంప్రసాద్ భండారీ మీడియాతో మాట్లాడుతూ..ఓటింగ్ శాతం ఈ దఫా పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. అంతేకాకుండా, తాము చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో చెల్లని ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రక్రియ విజయవంతమయ్యేందుకు సహకారం అందించాలని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు నిర్భయంగా ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆపద్దర్మ ప్రభుత్వంలోని హోం మంత్రి ఓం ప్రకాశ్ ఆర్యల్ కోరారు.
3.41 లక్షల భద్రతా సిబ్బంది
పోలింగ్ సందర్భంగా బుధవారం నుంచి మూడు రోజులపాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 10,967 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎన్నికల్లో మొత్తం 65 రాజకీయ పార్టీలు ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా పోటీ పడుతుండగా, ఇందులో 63 పార్టీలు నైష్పత్తిక ఓటింగ్ పద్ధతిలో పోటీ చేస్తున్నాయి. ఎన్నికల బందోబస్తు కోసం సుమారు 80 వేల మంది ఆర్మీ సిబ్బంది, మరో 76 వేల మంది పోలీసులు, సాయుధ పోలీసులు 34 వేల మందిని వినియోగిస్తున్నారు. వీరుకాకుండా, తాత్కాలిక ఎన్నికల పోలీసులు 1.50 లక్షల మందిని రంగంలోకి దించుతున్నారు. ఎన్ని కల కోసం మొత్తం 3.41 లక్షల మంది సేవలను వాడుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.
జెన్ జెడ్ అనుకూల, వ్యతిరేక వర్గాలు
ఆశ్రిత పక్షపాతం, అవినీతికి వ్యతిరేకంగా రా జకీయ నాయకత్వంలో మార్పులు కోరుతూ గతేడాది సెప్టెంబర్ 8, 9వ తేదీల్లో యువత సారథ్యంలో జరిగిన తీవ్ర నిరసనల ధాటికి కేపీ శర్మ ఓలి ప్రభుత్వం గద్దె దిగిపోవాల్సి వచ్చింది. ప్రధాని కేపీ శర్మ ఓలి సారథ్యంలోని కమ్యూనిస్ట్‌పార్టీ ఆఫ్ నేపాల్(యూనిఫైడ్ మా ర్క్సిస్ట్ లెనినిస్ట్) సీపీఎన్–యూఎంఎల్, నేపా లీ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి అప్పట్లో పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజా రిటీ ఉంది. ఓలి దిగిపోవడంతో అధ్యక్షుడు పౌడెల్ పార్లమెంట్‌ను రద్దు చేసి, సుశీలా కర్కిను ఆపద్ధర్మ ప్రధానిగా నియమించారు.
యువత కోరిన విధంగా తాము అనేక మార్పు లను చేపట్టినట్లు పుష్ప కుమార్ దహల్ ‘ప్ర చండ’ సారథ్యంలోని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటించింది. అయితే, పార్టీ నాయకత్వాన్ని మాత్రం మార్చలేదు. కేపీ శర్మ ఓలికి చెందిన సీపీఎన్–యూఎంఎల్ మాత్రం ఎలాంటి చర్య లను తీసుకోలేదు. మరోవైపు, రవి లామిచానే నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ ఎస్‌పీ), సీనియర్ నేత బాలేంద్ర షా, గగన్ థాపా నేతృత్వంలోని సంస్కరణలు కోరుకునే నేపాలీ కాంగ్రెస్ జెన్ జీ ఆకాంక్షలకు అనుకూలంగా మాట్లాడుతున్నాయి.
ఇంకా, కుల్మాన్ ఘీసింగ్ నేతృత్వంలోని ఉజ్యాలో నేపాల్ పార్టీ, మాజీ ధరణ్ మేయర్ హర్క సంపంగ్ నేతృత్వంలోని శ్రమ శక్తి పార్టీల ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంది. తాజా పరిస్థితుల్లో నేపాల్ రాజకీయాలు.. యథాతధ విధానాలను కొనసాగించాల నుకునే సంప్రదాయ పార్టీలు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా మార్పును కోరుకునే పార్టీలనే రెండు వర్గాలుగా విడిపోయాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ప్రజలు సంప్రదాయ పార్టీలతో తీరుతో విసుగెత్తి పోయారని, మార్పును కోరుకుంటున్నారని చెబుతున్నారు.
ఓలి, బాలేంద్ర షా ఢీ అంటే ఢీ
ఆర్‌ఎస్‌పీ తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా కఠ్మాండు మాజీ మేయర్ బాలేంద్ర షా(35)ను ప్రకటించగా నేపాలీ కాంగ్రెస్ గగన్ థాపాను బలపర్చింది. సీపీఎన్–యూఎంఎల్ మాత్రం 75 ఏళ్ల కేపీ శర్మ ఓలీనే మరోసారి ప్రధాని అభ్యర్థిగా ఎంచుకుంది. బాలేంద్ర షా, కేపీ శర్మ ఓలీలు కఠ్మాండులోని ఝాపా–5 నియోజకవర్గం నుంచి ముఖాముఖి తలపడుతున్నారు. ఈ సీటును ఓలి గతంలో ఆరుసార్లు గెలుచుకున్నారు.
గట్టి పోటీ ఉండటంతో ఓలి దేశంలోని మిగతా ప్రాంతాల్లో ప్రచారానికి సైతం వెళ్లకుండా, నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అదే సమయంలో, కఠ్మాండుకు చెందిన నేపాలీ కాంగ్రెస్ నేత గగన్ థాపా ఈసారి మాథేస్ ప్రావిన్స్‌లోని థనుషా–4 సీటు నుంచి బరిలోకి దిగారు. గగన్ థాపా, బాలేంద్ర షాలు దేశంలోని మిగతా ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణాదిన జరిగిన ఎన్నికల ర్యాలీల్లో చురుగ్గా పాల్గొన్నారు. వీరి ప్రచార కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెబుతున్నారు.
24 గంటల తర్వాతే ఫలితాలు
దేశవ్యాప్తంగా పోలింగ్ బూత్‌ల నుంచి బ్యాలెట్ పెట్టెలను ఒక చోటికి తరలించేందుకు కనీసం ఒక రోజు పడుతుందని, ఆ తర్వాత 24 గంటల్లోగా 165 స్థానాల ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది. మిగతా 110 సీట్లకు నైష్పత్తిక ప్రాతినిథ్య విధానంలో ఓట్ల లెక్కింపునకు మరో రెండు మూడు రోజులు పట్టవచ్చని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాం ప్రసాద్ భండారి చెప్పారు.


