అదే భయం... ఆగని పతనం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం
సెన్సెక్స్ 1,123 పాయింట్లు డౌన్
ముంబై: పశ్చిమాసియాలో ‘పోరు’ తారాస్థాయికి చేరుకోవడంతో ఈక్విటీ మార్కెట్లలో నాలుగో రోజు ‘బేర్ జోరు’ కొనసాగింది. హర్మూజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అమాంతం పెరిగాయి. దేశీయ కరెన్సీ రూపాయి క్షీణించి జీవితకాల కనిష్టాలకు దిగివచ్చింది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర కొనసాగుతోంది. ఈ పరిణామాలూ దలాల్ స్ట్రీట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 1,123 పాయింట్లు పతనమై 79,116 వద్ద స్థిరపడింది. ఇది 10 నెలల కనిష్టం. నిఫ్టీ 385 పాయింట్లు కుప్పకూలి 6 నెలల కనిష్టం 24,481 వద్ద నిలిచింది.
ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా: ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1,780 పాయింట్లు కుప్పకూలి 78,443 వద్ద, నిఫ్టీ 560 పాయింట్లు తగ్గి 24,305 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. దిగువ స్థాయిలో నాణ్యమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలకు కొంతమేర నష్టాలు తగ్గాయి.
బీఎస్‌ఈ రంగాల వారీగా ఇండెక్సుల్లో మెటల్ ఇండెక్స్ 4%, పీఎస్‌యూ బ్యాంక్ 3.50%, ఇండ్రస్టియల్స్ 3.29%, రియల్టీ 3.16%, కమోడిటిస్ 3.12%, క్యాపిటల్ గూడ్స్ 2.64%, ఇంధన 2.59%, సర్వీసెస్ 2.25%, పతనమమ్యాయి. బీఎస్‌ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 2.42%, 2.10 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్‌లో 30 షేర్లలో ఎయిర్‌టెల్ (1.78%), ఇన్ఫోసిస్ (1.5%), టెక్ మహీంద్రా (0.44%) మాత్రమే లాభపడ్డాయి.
→ పీఎన్‌జీఎస్ రేవా డైమండ్ జ్యువెలరీ లిస్టింగ్ రోజు మెరిసింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.386)తో పోలిస్తే 3.62% డిస్కౌంటుతో రూ.372 వద్ద లిస్టయ్యింది. మార్కెట్ అనిశ్చితుల్లో షేరు నష్టాల నుంచి పుంజుకుంది. చివరికి షేరు 7% లాభపడి రూ.412 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,312.16 కోట్లుగా నమోదైంది.
ఆయిల్ మార్కెటింగ్, పెయింట్స్ షేర్లు డౌన్
గల్ఫ్ ఉద్రిక్తతలతో దేశీయ ఆయిల్ మార్కెటింగ్, పెయింట్ తయారీ కంపెనీ షేర్లు రెండోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. హెచ్‌పీసీఎల్ 5.41%, బీపీసీఎల్ 4.94%, ఐఓసీ 4.78% నష్టపోయాయి. షాలిమార్ పెయింట్స్ 2.6%, బర్జర్ పెయింట్స్ 2.22%, ఇండిగో పెయింట్స్ 1.49%, ఏషియన్ పెయింట్స్ 0.95 పడిపోయాయి.
ఆసియా మార్కెట్లు అల్లకల్లోలం: దక్షిణ కొరియా ‘కాస్పీ’ ఇండెక్సు 14% కుప్పకూలింది. థాయ్‌లాండ్ ‘సెట్ కాంపోసిట్’ సూచీ 6%, ఇండోనేసియా ‘జకార్తా కాంపోసిట్’ 5% పతనమయ్యాయి. తైవాన్ 4.50%, జపాన్ 4%, సింగపూర్ 2.16%, హాంగ్‌కాంగ్ 2.05%, చైనా 1% నష్టపోయాయి. 3 రోజుల నష్టాల తర్వాత యూరప్, అమెరికా మార్కెట్లు రికవరీ బాట పట్టాయి. జర్మనీ డాక్స్ 2%, ఫ్రాన్స్ సీఏసీ 1%, బ్రిటన్ ఎఫ్‌టీఎస్‌ఈ అరశాతం లాభపడ్డాయి. నాస్‌డాక్ 1.27% లాభంతో 22,803 వద్ద, డోజోన్స్ 0.5 పెరిగి 48,776 వద్ద ట్రేడవుతున్నాయి.
92 దాటేసిన రూపాయి
డాలర్ మారకంలో 56 పైసలు పతనం
క్రూడ్, డాలర్ ఇండెక్స్ ర్యాలీ కారణం
ఇంట్రాడేలో 86 పైసలు డౌన్
ముంబై: ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలకు రెక్కలు రావడంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ భారీగా పతనమైంది. డాలర్ మారకంలో 56 పైసలు క్షీణించి జీవితకాల కనిష్ట స్థాయి 92.05 వద్ద స్థిరపడింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ‘రిస్క్ –ఆఫ్’ పరిస్థితులు నెలకొనడంతో స్టాక్స్, బాండ్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సురక్షిత పెట్టుబడి సాధనాలు బంగారం, వెండి ధరల్లో అస్థిరత నెలకొంది. ఈ నేపథ్యంలో డాలర్లకు డిమాండ్ పెరగడంతో డాలర్ ఇండెక్స్ 98 స్థాయిని సులభంగా ఛేదించింది. మరోవైపు ఇరాన్ యుద్ధం కారణంగా సరఫరా ఆందోళనలతో బ్రెంట్ క్రూడాయిల్ ధర సైతం 1.29% పెరిగి 82.46 డాలర్లకు చేరుకోవడంతో ద్రవ్యోల్బణ, వాణిజ్య లోటు భయాలు తలెత్తాయి. ఈ పరిణామాలు రూపాయి కరిగిపోయేందుకు కారణమయ్యాయి’’ అని నిపుణులు తెలిపారు. ఒక దశలో ఏకంగా 86 పైసలు కరిగిపోయి 92.35 వద్ద రికార్డు కనిష్టాన్ని తాకింది.
2 రోజుల్లో రూ.16.32
లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ సూచీల వరుస నష్టాలతో రెండు రోజుల్లో ఇన్వెస్టర్లకు రూ.16.32 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.447.18 లక్షల కోట్లకు దిగివచ్చింది. బుధవారం ఒక్కరోజే రూ.10 లక్షల కోట్ల మేర సంపద గల్లంతైంది.


