బిడ్డ కోసం అమాంతం బావిలోకి దూకేసిన తల్లి..! | Heroic act Mother Rescues Daughter from Well in Tamilnadu | Sakshi
Sakshi News home page

బిడ్డ కోసం అమాంతం బావిలోకి దూకేసిన తల్లి..!

Mar 4 2026 7:12 PM | Updated on Mar 4 2026 7:16 PM

Heroic act Mother Rescues Daughter from Well in Tamilnadu

‘అమ్మ’ గొప్పదనం గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. తన ప్రాణాల్ని ఫణంగా పెట్టి మరీ బిడ్డల్ని కాపాడు కుంటుంది. తరతరాల చరిత్ర ఈ సత్యాన్ని పదే పదే నిరూపిస్తూనే ఉంది. పిల్లల్ని కాపాడటానికి తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టిన సంఘటనలు చాలానే ఉన్నాయి.  తాజాగా చెన్నైలో జరిగిన ఒక ఉదంతం బిడ్డలపై తల్లి ప్రేమ, చూపించే ధైర్య సాహసాలపై మరోసారి చర్చకు తావిచ్చింది. మాతృత్వం గౌరవాన్ని మరింత ఇనుపడింపజేసిన ఈ సంఘటన మంగళవారం జరిగింది.


ఇండియా టుడే రిపోర్ట్‌ ప్రకారం తమిళనాడులోని నంబియూర్ సమీపంలో అయియంకట్టు తొట్టంలో తన కూతురిని కాపాడటానికి 55 ఏళ్ల మహిళ లోతైన బావిలోకి దూకేసింది. ఊంజపాళయంకు చెందిన సుందరం కుమార్తె దివ్య (27)  స్పెషల్‌ నీడ్‌ చైల్డ్‌. ‌ఇందుకోసం చికిత్స కూడా పొందుతోంది.  ఆత్మహత్య చేసుకోవాలని ఆమె బావిలోకి దూకేయడంతో అక్కడే ఉన్న తల్లి ముత్తుమణి క్షణం కూడా ఆలోచించికుండా కూతుర్ని కాపాడేందుకు  సాహసానికి పూనుకుంది. వెంటనే తాను కూడా బావిలోకి దూకేసి, కుమార్తెను గట్టిగా పట్టుకుంది. 

సహాయం కోసం ఆమె వేసిన కేకలు ఆ ప్రాంతం అంతటా ప్రతిధ్వనించాయి. దీంతో పొరుగువారు అప్రమత్తమై కడ్తూర్ పోలీసులకు, నంబియూర్ అగ్నిమాపక విభాగానికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చేదాకా ఆమె బిడ్డను కాపాడుకుంది. ఇంతలో సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయ సిబ్బంది ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ముత్తుమణి ధైర్యాన్ని స్థానికులు ప్రశంసలు కురిపించారు. తల్లీ బిడ్డల్ని కాపాడిన అగ్నిమాపక శాఖ కృషిని కూడా కొనియాడారు ఈ సంఘటనపై పోలీసులు సాధారణ విచారణ ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement