పద్మభూషణ్‌, జర్నలిస్ట్‌ లెజెండ్‌ కన్నుమూత, పలువురి సంతాపం | Veteran journalist and former ambassador H K Dua passes away | Sakshi
Sakshi News home page

పద్మభూషణ్‌, జర్నలిస్ట్‌ లెజెండ్‌ కన్నుమూత , పలువురి సంతాపం

Mar 4 2026 4:52 PM | Updated on Mar 4 2026 5:07 PM

Veteran journalist and former ambassador H K Dua passes away

H K Dua ప్రముఖ జర్నలిస్టు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత హరి కృష్ణన్ దువా (88) కన్నుమూశారు. అనారోగ్యంతో మూడువారాల క్రితం ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన బుధవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.జర్నలిస్టిక్ దిగ్గజం ఇక లేరంటూ పలువురు కాంగ్రెస్‌  నాయకులు, జర్నలిస్టులు,ఇతర ప్రముఖులు  దువాకు నివాళులర్పిస్తున్నారు.

మాజీ దౌత్యవేత్త,రాజ్యసభకు నామినేటెడ్ సభ్యుడిగా, NDA , UPA ప్రభుత్వాల కింద సేవలందించారు దువా. హిందూస్తాన్ టైమ్స్, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ది ట్రిబ్యూన్‌లలో సంపాదకీయ నాయకత్వం వహించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వంలో జాతీయ భద్రతా మండలి సభ్యుడిగా కూడా ఉన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ  శశి థరూర్  "జర్నలిస్టిక్ లెజెండ్‌’’ అంటూ హెచ్.కె. దువా మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేశారు. పద్మభూషణ్, మాజీ ఎంపీ, ఎడిటర్, మాజీ ప్రధానమంత్రి మీడియా సలహాదారు, డెన్మార్క్‌లో భారత మాజీ రాయబారిగా పనిచేశారని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా దువా  భార్య ఆదిత్య, పిల్లలకు తన ప్రగాఢ సానుభూతి  తెలిపారు. 

"సత్యం, సంపాదకీయ స్వాతంత్ర్యం , ప్రజా సేవ పట్ల నిబద్ధత ప్రజా చర్చను సుసంపన్నం చేసిన ప్రముఖ జర్నలిస్ట్ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే , దువా మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. భారతీయ జర్నలిజంలో ఒక మహోన్నత వ్యక్తి అని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ నివాళులర్పించారు. 

హెచ్‌.కె దువా ప్రస్థానం
పత్రికా స్వేచ్ఛ , ప్రజాస్వామ్య హక్కుల కోసం  పోరాడిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. హరికృష్ణన్ దువా జూలై 1, 1937న ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న సర్గోధలో జన్మించారు. చిన్న వయసులోనే జర్నలిజంలో ప్రతిభ కనబరిచిన ఆయన 1987లో హిందూస్తాన్ టైమ్స్‌కు ఎడిటర్ అయ్యారు. 1994లో, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చీఫ్ ఎడిటర్‌గా మారారు. 2001లో, డెన్మార్క్‌లో భారత రాయబారిగా నియమితులయ్యారు. 2003లో తిరిగి వచ్చిన తర్వాత, ది ట్రిబ్యూన్‌కు చీఫ్ ఎడిటర్‌గా 2009 వరకు పదవిలో ఉన్నారు. 2008లో పద్మవిభూషణ్‌  అవార్డ్‌ దక్కింది. 2009లో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. 

అటల్ బిహారీ వాజ్‌పేయి, హెచ్‌డి దేవెగౌడ ప్రధానులుగా ఉన్నప్పుడువారికి మీడియా సలహాదారుగా పనిచేశారు. జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. దువా అనేక ముఖ్యమైన పార్లమెంటరీ కమిటీలలో సభ్యుడిగా కూడా ఉన్నారు. పంజాబ్ విశ్వవిద్యాలయం కురుక్షేత్ర విశ్వవిద్యాలయం ఆయనను డి.ఎల్.ఐ.టి. అవార్డుతో సత్కరించాయి. రాజకీయ, దౌత్య, సామాజిక , మీడియా రంగాలకు చెందిన ప్రముఖులు హెచ్‌కె దువా మృతికి సంతాపం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement