తాళి కట్టే వేళ.. తల పైనుంచి మిసైళ్లు ! | Bride in Dubai war casts shadow over Kerala wedding | Sakshi
Sakshi News home page

తాళి కట్టే వేళ.. తల పైనుంచి మిసైళ్లు !

Mar 4 2026 11:03 AM | Updated on Mar 4 2026 1:43 PM

Bride in Dubai war casts shadow over Kerala wedding

కొట్టాయం: పశ్చిమాసియాలో ముసురుకున్న యుద్ధ మేఘాలు ఒక కేరళ యువతి పెళ్లి కలలను నీరుగారుస్తున్నాయి. సరిగ్గా మరో వారం రోజుల్లో కళ్యాణ మండపంలోకి అడుగుపెట్టాల్సిన ఆ వధువు ఇప్పుడు దుబాయ్‌లో చిక్కుకుని, విమాన సర్వీసుల పునరుద్ధరణ కోసం ఆందోళనగా ఎదురుచూస్తోంది.

కేరళలోని చెర్తలాకు చెందిన 29 ఏళ్ల అన్మోల్‌ దుబాయ్‌లో ఒక ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఈ నెల 12న కొట్టాయం వడవత్తూరులోని మార్ అఫ్రెమ్ యాకోబైట్ సిరియన్ చర్చిలో మణర్కాడ్‌కు చెందిన ఫార్మసిస్ట్ ఆల్బిన్‌తో ఆమె వివాహం జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులు నిశ్చయించిన ఈ సంబంధంలో వధూవరులిద్దరూ ఇప్పటివరకు ప్రత్యక్షంగా కలుసుకోలేదు. కేవలం ఫోన్ కాల్స్ ద్వారానే తమ భావాలను పంచుకున్నారు. ఫిబ్రవరి 28న ఇండిగో విమానంలో కొచ్చికి చేరుకుని, వివాహ పనులకు సిద్ధం కావాలని ఆమె వేసుకున్న ప్లాన్‌ ఇప్పుడు ఇరాన్ డ్రోన్లు, మిసైళ్ల దాడులతో తలకిందులయ్యింది.

దుబాయ్‌లో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో అన్మోల్‌ ప్రయాణం అర్థాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తున్నప్పటికీ, టికెట్ల ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరడం ఆమెను మరింత కలవరానికి గురిచేస్తోంది. చార్టర్డ్ విమానాల కోసం ట్రావెల్ ఏజెంట్లు డిమాండ్ చేస్తున్న భారీ మొత్తాన్ని చెల్లించడం ఆమెకు భారంగా మారింది. ప్రధాన వివాహ ముహూర్తం దగ్గర పడుతుండటంతో అటు దుబాయ్‌లో వధువు, ఇటు కేరళలో ఆమె కుటుంబం  ఆందోళనలో చిక్కుకుంది.

అన్మోల్‌ తండ్రి సుభాష్ కేరళలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. తన కుమార్తె క్షేమంగా తిరిగి వస్తుందని ఆయన వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడు. కేరళ ప్రవాస సంస్థ ‘నార్కా’ (NORKA) వెల్లడించిన వివరాల ప్రకారం విమానయాన సంస్థలు ఇంకా సాధారణ సేవలను పునరుద్ధరించలేదు. దీంతో కొందరు ప్రయాణికులు రోడ్డు మార్గంలో ఒమన్ చేరుకుని, అక్కడి నుండి విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొందరు సౌదీ అరేబియా, కువైట్ మీదుగా కేరళ చేరుకోవాలని చూస్తున్నారు.

ఇది కూడా చదవండి: భీకర యుద్ధం దిశగా పాక్-అఫ్గాన్?.. లక్షలాది మంది విలవిల

Advertisement
 
Advertisement
Advertisement