శ్రీనగర్: ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతిలో పలు దేశాల్లో ఉన్న షియా ముస్లింలు నిరసనలు చేపట్టారు. ఇదే సమయంలో భారత్‌లోని జమ్ముకశ్మీర్‌లో కూడా షియా ముస్లింలు ఆందోళనలు, నిరసనలు చేపట్టడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. కాశ్మీర్ లోయలో నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌లో అల్లర్లు, భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ డివిజన్‌లో ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలలను ఈ వారాంతం వరకు అంటే మార్చి 7వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సకీనా అధికారికంగా ప్రకటించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. దీంతో, వారం పాటు విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. మరోవైపు.. జమ్ముకశ్మీర్‌లో ఉద్రికత్తల కారణంగా కశ్మీర్ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఓ ప్రకటనలో అధికారులు వెల్లడించారు.
ఇక, హింసాత్మక నిరసనలను నివారించడానికి శ్రీనగర్, ఇతర ప్రాంతాలలో ఆంక్షలు ఇప్పటికీ అమలులో ఉన్నాయి. హై-స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ సేవలను పోలీసులు నిలిపివేశారు. కశ్మీర్ లోయలో 2G మొబైల్ ఇంటర్నెట్ మాత్రమే అందుబాటులో ఉంది. హోం శాఖ ఆదేశాల ప్రకారం ప్రస్తుతానికి ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. పరిస్థితుల తీవ్రతను బట్టి వీటిని మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో తప్పుడు, కల్పిత, తప్పుదారి పట్టించే కంటెంట్‌ను పంచుకున్నారనే ఆరోపణలపై శ్రీనగర్ పోలీసులు నేషనల్ కాన్ఫరెన్స్ శ్రీనగర్ ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహదీ, శ్రీనగర్ మాజీ మేయర్ జునైద్ మట్టుపై కేసు నమోదు చేశారు.
లోయలో రాళ్ల వర్షం
ఖమేనీ చనిపోయినట్లు ఆదివారం రోజు ఇరాన్ అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి కాశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం నాడు నిరసనకారులు, భద్రతా దళాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ హింసాత్మక ఘటనల్లో ఐదుగురు పోలీసులు సహా కనీసం 12 మందికి గాయాలు అయ్యాయి. రాళ్లు రువ్వే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు.. టీన్ షీట్లు, ముళ్ల కంచెలతో మూసివేశారు. లోయలో పుకార్లు వ్యాపించకుండా ఉండేందుకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు.


