భారీ జీతంతో సమ్‌తృప్తే! | Different Situation in IT Job Market: Blind App | Sakshi
Sakshi News home page

భారీ జీతంతో సమ్‌తృప్తే!

Mar 4 2026 6:05 AM | Updated on Mar 4 2026 6:05 AM

Different Situation in IT Job Market: Blind App

ఐటీ జాబ్‌ మార్కెట్లో భిన్నమైన పరిస్థితి 

ఆసక్తి కలిగిస్తున్న ‘బ్లైండ్‌’యాప్‌ నివేదిక

భారీ జీతం అందుకోవాలి. వృత్తిపరంగా ఎదగాలి. ప్రపంచస్థాయిలో గుర్తింపు రావాలి. ఇదీ ఓ సగటు భారతీయ టెకీ మనసులో మాట. ఇందుకోసం అంతర్జాతీయ దిగ్గజ టెక్‌ కంపెనీల్లో పనిచేయాలని ఆకాంక్షిస్తుంటారు. అయితే అధిక వేతనం ఎల్లప్పుడూ పని ప్రదేశంలో సంతృప్తిని, వృత్తిపరమైన ఎదుగుదలను అందించలేదని ఒక నివేదిక వెల్లడించింది. ప్రధాన సంస్థలలో పని వాతావరణాన్ని అంచనా వేయడానికి 40,686 మంది ఉద్యోగుల రేటింగ్స్, జీతాల డేటాను విశ్లేషించిన అమెరికాకు చెందిన ప్రొఫెషనల్‌ కమ్యూనిటీ యాప్‌ ‘బ్లైండ్‌’ఓ నివేదికను రూపొందించింది. పని ప్రదేశంలో సంతృప్తి, వృత్తిపరమైన ఎదుగుదల అవకాశాలు, మేనేజ్‌మెంట్‌ పనితీరును విశ్లేíÙంచింది. మన దేశంలో టెకీలు కోరుకుంటున్న ప్రధాన కంపెనీల జాబితా ఒకటైతే.. భారత్‌లో పనిచేయడానికి ఉత్తమ సంస్థలుగా పేరొందిన సంస్థల జాబితా వేర్వేరుగా ఉండటం ఆసక్తికరం.      – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

భారీ వేతనం ఉంటే.. 
పోటీతత్వంతో కూడిన నేటి ఉద్యోగ మార్కెట్‌లో సరైన పని ప్రదేశాన్ని ఎంచుకోవడం మునుపటి కంటే ఇప్పుడు చాలా కీలకంగా మారింది. చాలామంది నిపుణులు కేవలం జీతంపైనే కాకుండా వృత్తిపరమైన ఎదుగుదల, పని సంస్కృతి, దీర్ఘకాలిక స్థిరత్వంపై కూడా దృష్టి సారిస్తున్నారు. పని–జీవిత సమతుల్యత ఉద్యోగుల సంతోషాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని తేలింది. కెరీర్‌ను మార్చుకోవాలనుకునే నిపుణులకు జీతం ఇప్పటికీ ప్రధాన ఆకర్షణగా ఉంది. అంటే భారీ వేతనం ఉంటే కెరీర్‌ మారేందుకు సిద్ధం అన్నమాట.  

టాప్‌–15లో లేవు.. 
భారత్‌లో టెకీలు, జాబ్‌ మార్కెట్లోకి అడుగుపెట్టేవారు అత్యధికంగా కోరుకునే సంస్థల జాబితాను బ్లైండ్‌ రూపొందించింది. ఇందులో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అట్లాసియన్, ఫ్లిప్‌కార్ట్, జీటా, ఇన్‌మోబి, టెకియన్‌ కార్ప్, ఊబర్, వాల్‌మార్ట్, సేల్స్‌ఫోర్స్, ఎడోబ్, మెటా, ఒరాకిల్, షేర్‌చాట్‌ ముందు వరుసలో ఉన్నాయి. బ్లైండ్‌ బెస్ట్‌ వర్క్‌ప్లేసెస్‌ జాబితాలో అత్యుత్తమ రేటింగ్‌ పొందిన టాప్‌–10 కంపెనీల్లో ఎన్విడియా, గూగుల్, యాపిల్, అకామాయ్‌ టెక్నాలజీస్, వీఎమ్‌వేర్, ఎడోబ్, టార్గెట్, క్రెడ్, నోకియా, థాట్‌వర్క్స్‌ ఉన్నాయి.

గూగుల్, ఎడోబ్‌ మాత్రమే ఈ రెండు జాబితాల్లోనూ నిలిచాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి భారీ వేతనాలు ఇచ్చే కంపెనీలు టాప్‌–15 బెస్ట్‌ వర్క్‌ప్లేసెస్‌లో చోటు సంపాదించుకోలేకపోయాయి. ఎన్విడియా, యాపిల్, అకామాయ్‌ టెక్నాలజీస్‌ వంటి అత్యుత్తమ రేటింగ్‌ పొందిన సంస్థలకు అత్యధికంగా కోరుకునే కంపెనీల జాబితాలో స్థానం దక్కలేదు.  

ఉద్యోగుల సెంటిమెంట్‌.. 
అధిక జీతాలు ఎల్లప్పుడూ ఉద్యోగ సంతృప్తితో సంబంధం కలిగి ఉండవని ఈ అధ్యయనం ద్వారా వెల్లడైంది. అత్యధిక జీతాలు ఇచ్చే కంపెనీలలో మూడో వంతు కంటే తక్కువ మాత్రమే అత్యుత్తమ రేటింగ్‌ పొందిన పని ప్రదేశాల జాబితాలో ఉన్నాయి. ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రతిభను ఆకర్షించినప్పటికీ ఉద్యోగులను నిలుపుకోవడంలో, వారిని ఉత్సాహపరచడంలో పని సంస్కృతి, నాయకత్వం కీలక పాత్ర పోషిస్తాయని నిరూపితమైంది.

ఉద్యోగుల సంతృప్తి అనేది కేవలం జీతంపై మాత్రమే కాకుండా ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది. ఉద్యోగి ఏదేని కంపెనీలో దీర్ఘకాలం కొనసాగాలంటే నాయకత్వ నాణ్యత, వృత్తిపరమైన అభివృద్ధి, పని సంస్కృతి ఇప్పటికీ కీలకమైనవి. ఆర్థిక ప్రోత్సాహకాలతోపాటు సహాయక వాతావరణాన్ని సమతుల్యం చేసే సంస్థలు మాత్రమే నైపుణ్యం కలిగిన నిపుణులను నిలుపుకోగలవు, బలమైన ఖ్యాతిని నిర్మించుకోగలవని తెలిపింది.

ఏడాదిలో భారత్‌లోని నిపుణులు వెతికిన కంపెనీలు, పదాలు... 
⇒ అత్యధికంగా వెతికిన కంపెనీల పేర్లు: మైక్రోసాఫ్ట్, గూగుల్, ఊబర్, అమెజాన్, సేల్స్‌ఫోర్స్, మెటా, అట్లాసియన్, యాపిల్, క్వాల్‌కామ్, ఈబే. 
⇒  తరచూ సెర్చ్‌ చేసిన పదాలు: లేఆఫ్, ఆఫర్, హెచ్‌–1బీ, మెటా ఇండియా, గూగుల్‌ ఇండియా, మెటా లండన్‌.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement