ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య | Tragic incident in In Gollagudem village Bibinagar mandal | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Mar 4 2026 4:16 AM | Updated on Mar 4 2026 4:16 AM

Tragic incident in In Gollagudem village Bibinagar mandal

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం గొల్లగూడెంలో ఘటన

భార్యాభర్తల మధ్య గొడవలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్న పోలీసులు

భర్తే హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపణ

భువనగిరి, వలిగొండ: భర్తతో గొడవల కారణంగా ఇద్దరు కన్నబిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం గొల్లగూడెం గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం గొల్లగూడెం గ్రామానికి చెందిన మేకల మహేశ్‌కు వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన ఎరుపుల యాదయ్య, పద్మ దంపతుల కుమార్తె ఐశ్వర్య (28)తో 2020లో వివాహం జరిగింది. 

మహేశ్‌ రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లయిన ఏడాది తర్వాత వారికి కుమార్తె ఝాన్సీ (2) జన్మించింది. ఆ తర్వాత మహేశ్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఐశ్వర్య అతన్ని నిలదీసేది. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. అదనపు కట్నం తేవాలని ఐశ్వర్యను మహేశ్‌ వేధిస్తుండడంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు భర్తతో గొడవల వల్ల పుట్టింటికి వెళ్లి అక్కడే కుమారుడి (10 నెలలు)కి జన్మనిచ్చింది. అప్పట్నుంచి అక్కడే భార్య ఉంటుండగా మహేశ్‌ తన కుమారుడిని చూసేందుకు ఒక్కసారీ రాలేదు. 

పుట్టింట్లో శుభకార్యం ఉండటంతో ఇప్పుడైనా రావాలని భర్తను భార్య కోరగా తొలుత ఆమెనే అత్తారింటికి రావాలన్నాడు. దీంతో సోమవారం సాయంత్రం ఐశ్వర్య తన పిల్లలతో కలిసి అత్తారింటికి చేరుకుంది. రాత్రికి మహేశ్‌ విధులకు వెళ్లగా ఐశ్వర్య తన పిల్లలతో ఓ గదిలో నిద్రించింది. మంగళవారం ఉదయం ఎంతకీ ఐశ్వర్య నిద్ర లేవకపోవడంతో అత్తమామలు గది తలుపులు తెరిచి చూడగా ఇద్దరు పిల్లలు మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు. ఐశ్వర్య ఫ్యాన్‌కు ఉరేసుకుంది. 

అయితే గొల్లగూడెం చేరుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు భర్తే ఐశ్వర్యను, పిల్లలను హతమార్చాడని ఆరోపించారు. భువనగిరి డీఎస్పీ రవీందర్‌ ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌ టీంతో ఆధారాలు సేకరించారు. మృతురాలి గదిలో మూడు పేజీల సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తమ చావుకు భర్త, అత్తమామలు, ఆడపడుచులే కారణమని.. వారిని జైలుకు పంపాలని లేఖలో ఐశ్వర్య రాసింది. 

తన వెంట తెచ్చిన పిల్లలను తన వెంటే మృత్యుఒడికి తీసుకెళ్తన్నట్లు లేఖలో పేర్కొంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement