ముఖ గుర్తింపు మస్ట్‌! | Govt schemes to ensure access to all eligible people through use of technology | Sakshi
Sakshi News home page

ముఖ గుర్తింపు మస్ట్‌!

Mar 4 2026 2:40 AM | Updated on Mar 4 2026 2:40 AM

Govt schemes to ensure access to all eligible people through use of technology

మంగళవారం కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, సీఎస్‌ రామకృష్ణారావు

సాంకేతికత వినియోగంతో అర్హులందరికీ కచ్చితంగా ప్రభుత్వ పథకాలు

కలెక్టర్ల సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

అనర్హులకు లబ్ధి చేకూరకుండా చర్యలు  

ఫేషియల్‌ రికగ్నిషన్‌తో ఆసరా పథకం నుంచి 3 లక్షల మంది అనర్హుల తొలగింపు 

కలెక్టర్లు నెలలో 10 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి..లేకపోతే చర్యలు 

వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలి 

అక్రమ ఇసుక, మైనింగ్‌ జరిగితే కలెక్టర్లతో పాటు ఎస్పీలను సస్పెండ్‌ చేస్తామన్న సీఎం 

ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తే డీఈఓలు, కలెక్టర్లపై చర్యలుంటాయని హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌: ప్రతి ప్రభుత్వ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించేందుకు వీలుగా ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ముఖ గుర్తింపు) సాంకేతికతను వినియోగంలోకి తీసుకుని రావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అర్హులకు కచ్చితంగా లబ్ధి జరగాలని, అదే సమయంలో అనర్హులు లబ్ధి పొందకూడదని తేల్చి చెప్పారు. ఆసరా పెన్షన్ల పథకం అమలులో ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాంకేతికతను అమల్లోకి తెచ్చి 3 లక్షల మంది అనర్హుల పేర్లు తొలగించామని వెల్లడించారు. సాంకేతికతను సరిగ్గా వినియోగించుకోక పోవడం వల్లే ఇంత పెద్ద సంఖ్యలో అనుచిత లబ్ధి పొందారని చెప్పారు. కలెక్టర్లు ప్రతి నెలా కనీసం 10 రోజులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని ఆదేశించారు. ఇసుక అక్రమ మైనింగ్‌ జరిగినట్లు తెలిస్తే వెంటనే ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీని సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు.  ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక పేరుతో మార్చి 6 నుంచి జూన్‌ 12 వరకు నిర్వహించతలపెట్టిన 99 రోజుల  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

కేసులు పెట్టి బియ్యం రికవరీ చేయండి 
‘ప్రభుత్వం సేకరించిన రూ.3,900 కోట్ల విలువైన బియ్యం మిల్లర్ల దగ్గరే ఉంది. వాటిని రికవరీ చేసేందుకు అవసరమైతే కేసులు పెట్టాలి. కొన్ని జిల్లాల్లో ఇసుక మాఫియా అక్రమ మైనింగ్‌ చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఎక్కడ ఇసుక మాఫియా ఉన్నా, అక్రమ మైనింగ్‌ జరిగినట్లు తెలిసినా వెంటనే ఆ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని సస్పెండ్‌ చేస్తాం. అవకతవకలకు తావు లేకుండా రేషన్‌ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ జరిగేలా పర్యవేక్షించాలి.   

పనితీరు ఆధారంగా అవార్డులు 
రీజనల్‌ రింగ్‌ రోడ్డు, ఫ్యూచర్‌ సిటీ, మామునూర్, ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టులతో పాటు ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలి. తెలంగాణ రైజింగ్‌ విజన్‌ అమలులో జిల్లా కలెక్టర్లు నూటికి నూరు శాతం భాగస్వాములు కావాలి. ఈ ప్రభుత్వం మిమ్మల్ని నిశితంగా గమనిస్తుంది. మీరు మంచి పని చేస్తే మిమ్మల్ని అభినందిస్తుంది. వార్షిక పనితీరు నివేదిక ఆధారంగా అవార్డులు, రివార్డులుంటాయి. జూన్‌లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం.. ’ అని సీఎం చెప్పారు. 

ఈ మూడు నెలలే కొలమానం 
‘99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అత్యంత బాధ్యతతో, ఫలితాలపై దృష్టి సారించి అమలు చేయాలి. ఈ మూడు నెలలు ప్రతి కలెక్టర్‌ పనితీరుకు కొలమానం. మీ సర్వీస్‌ కెరీర్‌కు ఇవే పునాదిగా నిలుస్తాయి. అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉంది. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని కలెక్టర్లపై చర్యలు తీసుకుంటాం.  

సమర్ధవంతంగా పని చేస్తేనే కొనసాగింపు 
కలెక్టర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు సీఎస్‌ నివేదిక ఇవ్వాలి. (నెలలో 5 రోజుల కంటే తక్కువగా పర్యటించిన కొందరు కలెక్టర్ల పనితీరుపై ఈ సందర్భంగా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు) క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు.  సర్పంచులు, మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమన్వయంతో, వారి భాగస్వామ్యంతో 99 రోజుల ప్రణాళిక అమలు చేయాలి. కొత్తగా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులకు మార్చి 12న జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాకో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. 

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 
‘జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి. ముందుగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలన్నీ వేడుకలా జరగాలి. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్‌ 2న గ్రామ సభలు నిర్వహించి వివిధ సంక్షేమ పథకాల అమలు ద్వారా ఆ ప్రాంతంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు.. వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వివరాలను ప్రజలకు తెలియజేయాలి.  

గ్రామాల వారీగా లబ్ధిదారుల వివరాలు 
మహాలక్ష్మి, గృహజ్యోతి రూ.500 సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, కొత్త రేషన్‌ కార్డులు, సన్న బియ్యం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలన్నీ గ్రామాల వారీగా సిద్ధం చేయాలి. ఆ వివరాలను కలెక్టర్లు నివేదించాలి. ప్రతి గ్రామంలో పునరుత్పాదక విద్యుత్తుపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అన్ని పాఠశాలలు, విద్యాలయాలపై సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలి..’ రేవంత్‌ సూచించారు. 
  
ప్రతిరోజు మధ్యాహ్న భోజనం పర్యవేక్షించాలి.. 
యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై అవగాహన కల్పించాలి. జాబ్‌ మేళాలు నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు పునరావృతం కాకూడదు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించదు. డీఈవోలతో పాటు అక్కడి కలెక్టర్లపై చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో ప్రతిరోజు ఒక్కో అధికారి మధ్యాహ్న భోజనం పర్యవేక్షించాలి. పిల్లలతో పాటు భోజనం చేసే బాధ్యతలు వారికి అప్పగించాలి. జిల్లా కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలి..’ అని సీఎం ఆదేశించారు.   

జూన్‌ 12నే పుస్తకాలు, యూనిఫామ్‌లు 
‘వచ్చే విద్యా సంవత్సరంలో 100 నియోజకవర్గాల నుంచి ఎంపిక చేసిన మండలాల్లో తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు ప్రారంభిస్తాం. ఆయా స్కూళ్లలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యతో పాటు స్కూలు బస్సు సౌకర్యం, పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తాం. ఏ నియోజకవర్గంలో ఏ స్కూల్‌ను ఎంపిక చేయాలనే దానితో పాటు అక్కడున్న మౌలిక వసతులపై కలెక్టర్లు నివేదిక ఇవ్వాలి. వచ్చే విద్యా సంవత్సరం తొలిరోజు జూన్‌ 12నే రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌ అందించాలి..’   

ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం సహించం.. 
‘ప్రభుత్వ ఆసుపత్రులను తరచుగా సందర్శించాలి. సమస్యలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. సీఎంఆర్‌ఎఫ్, ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం ఏటా రూ.2,500 కోట్లు ఖర్చు పెడుతోంది. అంత ఖర్చుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అద్భుతమైన సేవలను అందించే వీలుంటుంది. 35 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆస్పత్రులతో అనుసంధానం చేస్తాం. సర్జరీలు చేసే డాక్టర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తాం. ఆస్పత్రుల్లో పరిపాలన, వైద్య సేవలను విభజిస్తాం..’ అని రేవంత్‌ చెప్పారు.  
25 వేల బోగస్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు..     
‘బోగస్‌ ఉద్యోగులను సృష్టించే ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులుంటే, అందులో దాదాపు 25 వేల మంది కనీసం ఆధార్‌ కార్డు లేకుండా ఇంతకాలం జీతాలు తీసుకున్నట్లు గుర్తించాం. పదేళ్లుగా ప్రభుత్వాన్ని మోసం చేసి వీరి పేరిట జీతాలు పొందిన ఏజెన్సీలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయిస్తాం. వాటిపై ఆర్థిక శాఖ కేసులు నమోదు చేయాలి..’ అని సీఎం ఆదేశించారు. 

కలెక్టర్లకు సీఎం జారీ చేసిన ఇతర ఆదేశాలు 
పాఠశాలలు బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్‌నెస్‌ పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి. ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో పాటు లారీలు, ఇతర సరుకు రవాణా వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలి.  
⇒ రహదారులపై గుంతలు, ప్రమాదం జరిగే స్థలాల వివరాలను ప్రజల నుంచి వాట్సాప్‌ నంబర్‌ ద్వారా సేకరించి మరమ్మతులు చేపట్టాలి.  
⇒ ఓఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్ల వెంట చెత్త, ఇతర నిర్మాణ వ్యర్ధాలు డంప్‌ చేసేందుకు వచ్చే వాహనాలపై జరిమానాలు విధించాలి. కేసులు పెట్టాలి. ఓఆర్‌ఆర్‌ ఏజెన్సీ బాధ్యత తీసుకోవాలి.  
⇒ నగరాలు, పట్టణాల్లోని వర్కింగ్‌ ఉమెన్స్, బాయ్స్, గరల్స్‌ హాస్టళ్ల వివరాలు నమోదు చేయాలి. వాటిపై పర్యవేక్షణ ఉండాలి. యాజమాన్యాలు జవాబుదారీతనంతో ఉండాలి. 
⇒ పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, డ్రగ్స్, ఈ–సిగరెట్ల వినియోగం జరిగితే అందుకు ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు బాధ్యత వహించాలి. ప్రతి ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాల, కళాశాలలో సైకాలజిస్ట్‌ ఉండేలా చూడాలి.  
⇒ భూసార పరీక్షలు, పంట మార్పిడి, పంటల వైవిధ్యత ప్రయోజనాలను రైతులకు వివరించాలి.  ్చ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement