హైదరాబాద్: తెలంగాణకు చెందిన పలువురు జిల్లా కలెక్టర్లు హెడ్ క్వార్టర్స్‌లో ఉండటం లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు(మంగళవారం, మార్చి 3వ తేదీ) జరిగిన కలెక్టర్ల సదస్సులో పలువురు జిల్లా కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు హెడ్ క్వార్టర్స్ లేకుండా హైదరాబాద్‌కు వస్తున్నారని, ఇది సరైన చర్య కాదన్నారు సీఎం రేవంత్. సీఎస్ అనుమతి లేకుండా రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు హైదరాబాద్‌కు రావడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 99 రోజుల పాటు జిల్లా విడిచి వెళ్లొద్దని వారికి ఆదేశించారు సీఎం రేవంత్.
వారందరినీ భాగస్వామ్యులను చేయాలి..
99 రోజుల కార్యక్రమాల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లను భాగస్వాములను చేయాలన్నారు సీఎం రేవంత్. వార్డు సభ్యులు, సర్పంచులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు అందరికీ జిల్లా కేంద్రాల్లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, వారి విధులు, బాధ్యతలకు సంబంధించి అవగాహన కల్పించడంతో పాటు ప్రింటెడ్ మెటీరియల్ వారికి అందించాలని సూచించారు.
సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలి
వ్యవసాయ పంప్ సెట్లకు బదులు సోలార్ పంప్ సెట్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి.. సోలార్ మోటార్లతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలి.
ఇళ్లపైన సోలార్ ప్లాంట్లు అమర్చుకోవడం.. సోలార్ విద్యుత్ వాడుకోవటం తో పాటు గ్రిడ్ కు కనెక్ట్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంపై అన్ని గ్రామాల్లో విద్యుత్ శాఖ అవగాహన కల్పించాలి...
గ్రామ, వార్డు సభల్లో నూతనంగా ఇచ్చిన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200లోపు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల వివరాలు తెలియజేయాలి.
వాటితో గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయి కలిగిన లబ్ధిని ప్రజలకు వెల్లడించాలి..
రవాణా శాఖ డాటా ఆన్‌లైన్ పూర్తి చేయాలి
పాఠశాలలు బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి.
ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో పాటు లారీలు, ఇతర సరకు రవాణా వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలి.
ఎక్కువ సంఖ్యలో డ్రైవర్లు కలుసుకునే చోట్లనే ఈ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి పరీక్షలు నిర్వహించాలి..
రహదారులపై భారీ స్థాయిలో గుంతలు, ప్రమాదం జరిగే స్థలాల వివరాలు తెలుసుకునేందుకు వాట్సాప్ నెంబర్ ను రవాణా శాఖ ఇవ్వాలి.
ఆ నంబర్‌కు వచ్చే సమాచారం ఆధారంగా అక్కడ మరమ్మతులు చేపట్టడం, ఇతర జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి.
ఓఆర్ఆర్, ఓఆర్ఆర్ సర్వీసు రోడ్ల వెంట భారీగా చెత్త, ఇతర నిర్మాణ వ్యర్ధాలు డంప్ చేస్తున్నారు.
వ్యర్ధాలను తీసుకువచ్చే వాహనాలను పట్టుకొని జరిమానాలు విధించాలి. కేసులు పెట్టాలి.
ఓ ఆర్ ఆర్ ఏజెన్సీని బాధ్యులను చేయాలి .


