సీఎం రేవంత్‌కు కేందమంత్రి కిషన్‌రెడ్డి లేఖ | Kishan Reddy Letter To Cm Revanth On Telangana Economic Situation | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌కు కేందమంత్రి కిషన్‌రెడ్డి లేఖ

Mar 3 2026 10:56 AM | Updated on Mar 3 2026 11:27 AM

Kishan Reddy Letter To Cm Revanth On Telangana Economic Situation

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బడ్జెట్ సమావేశాల కంటే ముందే పూర్తిస్థాయి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గత 12 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.12 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని వెల్లడించిన కిషన్‌రెడ్డి.. ​రాష్ట్రంలో జీతాలు, రైతు భరోసా, సంక్షేమ పథకాల అమలు.. ఇలా ఏ పని చేయాలన్నా అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని విమర్శలు గుప్పించారు.

సాస్కి (SASCI) పథకం కింద తెలంగాణకు రూ.10,000 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలను కేంద్రం అందించిందని కిషన్‌రెడ్డి వివరించారు. ​ఎన్నికల వేళ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా, ఖజానా ఖాళీ అని నెపం నెట్టడంపై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ​బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని లేఖలో ఆయన స్పష్టీకరించారు.

‘‘2023లో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టో ద్వారా 6 ప్రధాన గ్యారంటీలతో పాటుగా 420 హామీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. ఈ హామీలను నమ్మిన తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్‌కి అధికారాన్ని కట్టబెట్టింది. అనంతరం ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మీరు, ఇచ్చిన హామీలను అమలు చేయమంటే రాష్ట్ర ఖజానాలో లంకెబిందెలకు బదులు ఖాళీ మట్టి కుండలు ఉన్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఇచ్చిన హామీల అమలునుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

..రాష్ట్ర ఖజానా గురించి ఇలా మాట్లాడిన మీరే, ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ సోనియా గాంధీ-రాహుల్ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే రూ. 1,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మీరు మాట్లాడిన తీరును చూస్తుంటే, రాష్ట్ర ఖజానా నిల్ - కాంగ్రెస్ నాయకుల జేబులు ఫుల్ అన్న విషయం అర్థమవుతోంది.

..2014 లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అనేక రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తూ వస్తోంది. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, మరెన్నో మూలధన పెట్టుబడులు మొదలైనవాటి రూపంలో గత 12 సంవత్సరాల కాలంలో దాదాపు రూ. 12 లక్షల కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

..అందులో రూ.2.5 లక్షల కోట్ల పన్నుల వాటా నిధులు, రూ.1.85 లక్షల కోట్ల విలువైన రహదారుల నిర్మాణం, దాదాపు రూ.36,000 కోట్లకు పైగా రైల్వే బడ్జెట్ కేటాయింపులు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరో రూ. 50,000 కోట్ల విలువైన రైల్వే పనులు, దాదాపు రూ.40,000 కోట్ల ఉపాధి హామీ నిధులు, రూ.50,000 కోట్ల ఉచిత రేషన్ బియ్యం పంపిణీ, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు వివిధ ఆర్థిక సంఘాల సిఫారసుల ద్వారా అందిస్తున్న రూ.40,000 కోట్లకు పైగా నిధులు, రూ.12,000 కోట్లకు పైగా విలువైన విద్యుత్ ప్రాజెక్టులు, రూ.14,000 కోట్లకు పైగా పీఎం కిసాన్ నిధులు, ఎరువుల సబ్సిడీ కోసం రూ.80,000 కోట్లకు పైగా నిధులు, విద్య & క్రీడలకు రూ.21,000 కోట్లకు పైగా నిధులు, దాదాపు రూ.9,000 కోట్ల ఆరోగ్య సంరక్షణ నిధులు మొదలైనవి ఉన్నాయి.

..అంతే కాకుండా, కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల కాలంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల కనీస మద్దతు ధరను చెల్లించి, తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని సేకరించింది. మరో రూ.60,000 కోట్ల కనీస మద్దతు ధరను చెల్లించి, తెలంగాణ రైతుల నుంచి పత్తిని సేకరించింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులను ఇవ్వడమే కాకుండా, వివిధ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల ద్వారా దాదాపు రూ. 10 లక్షల కోట్ల ఋణాలను కూడా తెలంగాణ రాష్ట్రానికి అందించింది.

వీటికి అదనంగా రాష్ట్రాలలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన మూలధన పెట్టుబడి నిధుల కోసం రాష్ట్రాలకు 50 సంవత్సరాల కాలపరిమితితో కూడిన వడ్డీ రహిత ఋణాలను అందించి ఆయా రాష్ట్రాల అభివృద్ధికి అదనపు సహకారాన్ని అందించాలనే ప్రధానమంత్రి మోదీ గారి సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం “స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్(SASCI)” పేరిట ఒక నూతన పథకాన్ని 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది.

..కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించిన ఈ సౌలభ్యాన్ని సానుకూలంగా అందిపుచ్చుకున్న రాష్ట్రాలు 2020-21 నుండి నేటి వరకూ మూలధన పెట్టుబడితో కూడిన అనేక ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ఈ ఋణాల ద్వారా సమకూర్చుకున్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరింది. SASCI పథకం కింద 2020-21 నుంచి 2025-26 వరకు తెలంగాణ రాష్ట్రానికి రూ. 10,000 కోట్లకు పైగా వడ్డీ రహిత ఋణాలను అందించడం జరిగింది. ఈ ఋణాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూలధన పెట్టుబడితో కూడిన కొన్ని వందల ప్రాజెక్టులు అమలుకు నోచుకున్నాయి.

..మురుగునీటి నాళాలు, రోడ్ల విస్తరణ, రైల్వే లైన్ల విస్తరణ, బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, ఆసుపత్రులు, మెడికల్ & నర్సింగ్ కాలేజీలు, సంక్షేమ, మైనారిటీ పాఠశాలలు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణం, పర్యాటక ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ORR & RRR మధ్యన రేడియల్ రోడ్ల నిర్మాణం, గోదావరి-మూసీ నది అనుసంధానం, మూసీ నది సుందరీకరణ, స్మార్ట్ సిటీ మిషన్ లో రాష్ట్ర వాటా నిధులు, వరదల వలన పాడైపోయిన నిర్మాణాల పునరుద్ధరణ, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రాష్ట్ర వాటా నిధులు వంటి అనేక ప్రాజెక్టులకు సాస్కి నిధులు ఖర్చు చేశారు.  

..ముఖ్యంగా MMTS ఫేజ్ - II కోసం రూ.200 కోట్లు, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ కోసం రూ. 114 కోట్లు, స్మార్ట్ సిటీస్ పథకం కోసం రూ. 315 కోట్లు, పీఎం గ్రామ సడక్ యోజన కోసం రూ. 674 కోట్లు, ORR & RRR మధ్యన రేడియల్ రోడ్ల నిర్మాణం కోసం రూ. 200 కోట్లు, సిద్ధిపేట బైపాస్ రోడ్డు కోసం రూ. 110 కోట్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల కోసం రూ. 388 కోట్లు, పలు హాస్టళ్ల నిర్మాణం కోసం రూ. 300 కోట్లు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.

అన్ని రాష్ట్రాలలాగే తెలంగాణ రాష్ట్రం కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలకు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రహిత ఋణాల మీద ఆధారపడటం చూస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలాంటి దుస్థితిలో ఉందో తెలుస్తోంది.  ఇవి మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న ఋణాలకు వడ్డీలు చెల్లించడానికి ఋణాలు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఋణాలు, రైతు భరోసా నిధులకు ఋణాలు, సంక్షేమ పథకాల అమలుకు ఋణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఋణాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి నేడు తెలంగాణలో ఉంది. 

..2014 లో మిగులు నిధులతో ఏర్పడిన రాష్ట్రానికి గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, గత 27 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు పట్టిన దుస్థితికి నేటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్ధం పడుతోంది. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పెరుగుతున్న రాష్ట్ర తలసరి అప్పు కూడా రాష్ట్ర ఆర్థిక దుస్థితిని తెలియజేస్తోంది.

..ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను తెలంగాణ ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి, మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఒక పూర్తిస్థాయి శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని తెలంగాణ ప్రజల తరపున మిమ్మల్ని కోరుతున్నాను’’ అంటూ కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement