సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: గొల్లెగూడెంలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన కూతురు(10 నెలలు), కుమారుడి(2)ని చంపి అనంతరం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్యాభర్తల మధ్య గొడవలే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడని స్థానికులు తెలిపారు.
మరో ఘటనలో..
కాగా, మరో ఘటనలో నిరుపయోగంగా ఉన్న మిల్లులో ఉరేసుకుని వలస కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నేరేడుచర్ల పట్టణంలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ రవీందర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రంలోని కోటక్ జిల్లాకు చెందిన శ్రీధర్(25) నేరేడుచర్ల పట్టణంలో నిరుపయోగంగా ఉన్న చాణక్య రైస్ మిల్లు పక్కనే ఉన్న ఒడిశా దాబాకు అప్పుడప్పుడు వచ్చి కొన్నిరోజులు అక్కడే పనిచేసి తిరిగి సొంతూరుకు వెళ్తుంటాడు.
ఈ క్రమంలో గత నెల 25న దాబాకు వచ్చిన శ్రీధర్ మూడురోజులు పనిచేసి తిరిగి ఊరికి వెళ్తున్నానంటూ దాబా యాజమాని వద్ద రూ.3వేలు తీసుకుని వెళ్లాడు. అయితే సోమవారం చాణక్య రైస్ మిల్లు నుంచి దుర్వాసన వస్తుండడంతో పరిసర ప్రాంతాల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మిల్లులోకి వెళ్లి పరిశీలించగా శ్రీధర్ ఉరేసుకుని కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రెండు, మూడు రోజుల క్రితమే శ్రీధర్ ఉరేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


