విమానం టికెట్లకు రెక్కలు | flight ticket price increase | Sakshi
Sakshi News home page

విమానం టికెట్లకు రెక్కలు

Mar 3 2026 7:16 AM | Updated on Mar 3 2026 7:16 AM

flight ticket price increase

హైదరాబాద్‌ నుంచి న్యూయార్క్‌కు రూ.1.03 లక్షలు, పారిస్‌కు రూ.రూ.93,868  

సాక్షి,హైదరాబాద్‌: పశ్చిమాసియాలో యుద్ధంతో విమానయానం సంక్షోభంలో పడింది. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు దుబాయ్, ఖతర్, సౌదీ తదితర చోట్ల పెద్దసంఖ్యలో చిక్కుకుపోయారు. కీలక దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత, గల్ఫ్‌ మార్గంలో ప్రయాణానికి అనుమతి లేకపోవడంతో చార్జీలు మోతెక్కుతున్నాయి. సాధారణంగా హైదరాబాద్‌ నుంచి వన్‌వేలో న్యూయార్క్‌కు  రూ.75 వేల వరకు చార్జి ఉంటే ఇప్పుడు రూ.1,03,855కు పెరిగింది. 

పారిస్‌ టికెట్‌ రూ.86,269 నుంచి రూ.93,868 అయ్యింది. యూకేకు రూ.63,534 వరకు చార్జీలు పెరిగాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై తదితర నగరాల నుంచి అమెరికా, యురోప్‌ దేశాలకు వెళ్లే విమానాలు పసిఫిక్‌ మహా సముద్రం మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయని, దీంతో చార్జీలు రెట్టింపయ్యాయని ట్రావెల్స్‌ సంస్థల ప్రతినిధులు చెప్పారు. హైదరాబాద్‌ నుంచి ఇథియోపియాకు నేరుగా విమానాలు ఉన్నాయి. తప్పనిసరిగా బయల్దేరాల్సిన వాళ్లు ఆఫ్రికా మీదుగా వెళ్లాల్సి వస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇటలీ రాజధాని రోమ్‌ మీదుగా విమానాలను మళ్లించేందుకు అవకాశం కలి్పంచడంతో చార్జీలకు రెక్కలొచి్చనట్లు సికింద్రాబాద్‌లోని వాల్మీకీ ట్రావెల్స్‌ వ్యవస్థాపకుడు హరికిషన్‌  తెలిపారు. 

సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి అమెరికా, దుబాయ్, సౌదీ, సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, బ్రిటన్‌కు 15 వేల మందిపైగా రాకపోకలు సాగిస్తారు. ప్రస్తుతం సరీ్వసులు స్తంభించడంతో సంఖ్య భారీగా తగ్గినట్లు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు  తెలిపాయి. ఇక అంతర్జాతీయ ప్రయాణాలు 3–6 నెలలు ముందుగానే బుక్‌ అవుతాయి.  25 శాతం మాత్రమే అత్యవసర బుకింగ్‌లు ఉంటాయి. తాజా సంక్షోభంతో చాలామంది ప్రణాళికలను మార్చుకున్నారు. తప్పనిసరిగా గమ్యం చేరుకోవాల్సిన ప్రయాణికులు మాత్రమే ఈ భారాన్ని మోయాల్సి వస్తోందని ట్రిప్స్‌ ట్రావెల్స్‌ ప్రతినిధి సీహెచ్‌ భార్గవవర్మ తెలిపారు.

యూఏఈ కార్యాలయం వద్ద భద్రత  
బంజారాహిల్స్‌: నగరంలో బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌–12లోని యూఏఈ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం వద్ద బంజారాహిల్స్‌ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. సౌదీకి వెళ్లేందుకు వీసాల కోసం నిత్యం తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి చాలామంది వస్తుంటారు. దుబాయ్, కువైట్, ఒమన్, అబుదాబి తదితరచోట్ల విమానాశ్రయాలు మూతపడడంతో హైదరాబాద్‌ నుంచి వెళ్లేవారు పర్యటన రద్దు చేసుకున్నారు. సౌదీకి వెళ్లే విమానాలు రద్దు కావడంతో పాటు అటునుంచి రావాల్సినవీ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే యూఏఈ కాన్సులేట్‌ కార్యాలయం కూడా వెలవెలబోతోంది.  

అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ నివాసం వద్ద బందోబస్తు 
జూబ్లీహిల్స్‌ రోడ్డు నం–1లోని హైదరాబాద్‌ అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం నుంచే ఈ పరిసరాల్లో పోలీసు పహారా పెంచారు. అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ నివాసం గత కొన్నేళ్లుగా ఇక్కడే ఉంటుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement