ఒక్కోవైపు 15 మీటర్ల చొప్పున ఖరారు
ఆ స్థలంలో నిర్మాణాలకు అనుమతి నో.. కేవలం సాగుకు మాత్రమే అవకాశం
రోడ్డు వైపు ఆక్రమణలు రాకుండా, భవిష్యత్తు అవసరాలకు వీలుగా ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డుకు 50 అడుగుల బఫర్ జోన్‌ను నిర్ధారించారు. అంటే రెండు వైపులా కలిపి వంద అడుగుల (30 మీటర్లు) మేర స్థలం బఫర్‌గా ఉండనుంది. రీజినల్ రింగురోడ్డుకు 100 మీటర్ల స్థలం ఉండనుండగా, దానిని ఆనుకుని మరో 30 మీటర్ల స్థలం బఫర్‌గా ఉంటుంది. వెరసి 130 మీటర్ల స్థలం రీజినల్ రింగురోడ్డు నిబంధనల్లో ఉంటుంది. ఆ 30 మీటర్లపై పట్టాదారులకే హక్కులుండనున్నా, ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు వీలుండదు. శాశ్వత నిర్మాణాలే కాదు, తాత్కాలిక నిర్మాణాలు కూడా చేపట్టకూడదు. కేవలం సాగు కోసం మాత్రమే వినియోగించాలి. ఈమేరకు ఇటీవల ఎన్‌హెచ్‌ఐఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయగా, రెండు వైపులా 15 మీటర్లు చొప్పున బఫర్ జోన్ ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తూ రాష్ట్రం సమ్మతి లేఖ రాసింది.
భవిష్యత్తు అవసరాల కోసం..
రీజినల్ రింగురోడ్డు కోసం 100 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరించిన విషయం తెలిసిందే. ప్రధాన క్యారేజ్‌వే పోను రెండు వైపులా సర్వీసు రోడ్డు కోసం స్థలం కేటాయిస్తారు. ప్రస్తుత పొదుపు చర్యల్లో భాగంగా ఇప్పటికిప్పుడు సర్వీసు రోడ్డును నిర్మించకూడదని నిర్ణయించారు. ఖాళీగా వదిలే ఆ స్థలాన్ని భవిష్యత్తులో అవసరానికి తగ్గట్టుగా సర్వీసు రోడ్డుకు వినియోగిస్తారు. కానీ, దాన్ని ఆనుకుని పట్టాదారులు ఎడాపెడా నిర్మాణాలు సాగిస్తూ పోతే క్రమంగా ఆ సర్వీసు రోడ్డు స్థలం కూడా కబ్జాకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఆక్రమణలు జరగకున్నా, ఆ స్థలాన్ని ఆనుకుని నిర్మాణాలు వెలిస్తే, సర్వీసు రోడ్డుకు ఇబ్బందులు తలెత్తుతాయి.
రిబ్బన్ డెవలప్‌మెంట్ రాకుండా...
పెద్ద రోడ్డు నిర్మిస్తే దానిని ఆనుకుని రోడ్డు పొడవునా వాణిజ్యపరమైన నిర్మాణాలు వెలియటం సహజం. అలా వచ్చే నిర్మాణాలను రిబ్బన్ డెవలప్‌మెంట్‌గా పేర్కొంటారు. అది మితిమీరితే ఆ రోడ్డుకే ఇబ్బందిగా మారుతుంది. భవిష్యత్తులో రోడ్డును విస్తరించటం కూడా సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రీజినల్ రింగురోడ్డును ఆనుకుని ఆ తరహా రిబ్బన్ డెవలప్‌మెంట్ రాకుండా నిరోధించేందుకు ఈ బఫర్ జోన్ సహకరిస్తుంది.
రోడ్డు భద్రత: అధిక వేగంతో వెళ్లే వాహనాలు రోడ్డు నుంచి దిగువకు దూసుకెళ్లినప్పుడు కింద ఉండేవారికి ప్రమాదం పొంచి ఉంటుంది. రోడ్డును ఆనుకుని నిర్మాణాలు వెలిస్తే ఈ తరహా ప్రమాదాలకు అవకాశం ఎక్కువ. దీన్ని నిరోధించటానికి కూడా బఫర్ జోన్ అనుకూలంగా ఉంటుంది.
పర్యావరణ రక్షణ: రింగురోడ్డును ఆనుకుని పచ్చదనాన్ని పెంచాలన్నది మరో ఆలోచన. అందుకు ప్రత్యేకంగా రోడ్డుపై ఎక్కువగా స్థలం ఉండదు. దిగువ ఆనుకుని ఉండే ప్రైవేటు భూముల్లో చెట్లు పెంచాల్సి ఉంటుంది. అందుకు పట్టాదారులు అంగీకరించరు. ఇలా బఫర్ జోన్ ఏర్పాటుతో ఆ భూముల్లో సాగు తప్ప వేరే పనులకు వీలుండదు. ఏదో ఒక రూపంలో పచ్చదనం పెంపునకు ఇది ఉపకరిస్తుంది.
భవిష్యత్తు అవసరాలకు: భవిష్యత్తులో రీజినల్ రింగురోడ్డుకు అదనంగా స్థలం సేకరించాల్సి వస్తే ఈ బఫర్ పరిధిలో ఉండే భూమి అనుకూలంగా ఉంటుంది. అందులో నిర్మాణాలు ఉండకుండా ఖాళీగా ఉండనున్నందున భూ సేకరణకు వీలుంటుంది.


