హోలీలో ఇలా చేస్తే చర్యలే.. ప్రజలకు సజ్జనార్ హెచ్చరిక | Sajjanar advice to people on the occasion of Holi | Sakshi
Sakshi News home page

హోలీలో ఇలా చేస్తే చర్యలే.. ప్రజలకు సజ్జనార్ హెచ్చరిక

Mar 2 2026 6:29 PM | Updated on Mar 2 2026 6:57 PM

Sajjanar advice to people on the occasion of Holi

సాక్షి హైదరాబాద్: నగరంలో హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్  వీసీ సజ్జనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని  హెచ్చరించారు. హోలీ నేపథ్యంలో ఈరోజు (సోమవారం) బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ కార్యాలయం పోలీసు అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పండుగ పూట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం గస్తీ నిర్వహించాలని పోలీసులకు సూచించారు.

ఇష్టం లేని వారిపై బలవంతంగా రంగులు పూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో, పాదచారులు, వాహనాలపై రంగులు చల్లొద్దని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆటకట్టించేందుకు నగరవ్యాప్తంగా మఫ్టీలో షీ టీమ్స్ నిఘా ఉంటుందన్నారు. ప్రజలు రసాయన రంగులకు బదులు సహజసిద్ధమైనవి వాడాలన్నారు.  వేడుకల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని చెప్పారు. రోడ్లపై యువకులు గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేస్తే వాహనాలను సీజ్ చేస్తామ‌ని సజ్జనార్ హెచ్చరించారు.  

ప్రస్తుతం రంజాన్ మాసం నడస్తున్న నేప‌థ్యంలో ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల‌న్నారు. పీస్ కమిటీల సమన్వయంతో పోలీసులు పనిచేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాల‌న్నారు. హోలీ సందర్భంగా హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో మంగ‌ళ‌వారం  ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లపై ఆంక్ష‌లు విధించిన‌ట్లు తెలిపారు.

హోలీ పండుగ సంద‌ర్భంగా  నిబంధనలు ఉల్లంఘిస్తే సిటీ పోలీస్ యాక్ట్ ప్ర‌కారం కేసులు నమోదు చెస్తామ‌ని స్పష్టం చేశారు. నగరంలో ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాల‌ని సూచించారు. పోలీసులకు సహకరించి పండుగను సంతోషంగా జరుపుకోవాలని నగర ప్రజలను కోరారు. ఈ స‌మావేశంలో ఇతర కీలక అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement