హోళీ..కలర్‌ఫుల్‌ టూర్‌ కోసం..! | Holi in Mathura And Vrindavan 2026: A Colourful Tour | Sakshi
Sakshi News home page

హోళీ..కలర్‌ఫుల్‌ టూర్‌ కోసం..ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాల్సిందే..!

Mar 2 2026 4:39 PM | Updated on Mar 2 2026 4:45 PM

Holi in Mathura And Vrindavan 2026: A Colourful Tour

యమునా తీరంలో రంగుల ఆటవెలది... బ్రజ్‌ భూమిలో రంగుల కథలు...మాధవుడి నగరంలో రంగుల హరివిల్లు... కృష్ణ నగరంలో వసంత స్వాగతం...గోపాలుడి జన్మభూమిలో రంగుల ఋతువు...ఇంద్ర ధనస్సు రంగుల మధ్య ఓ మధురమైన దైవిక స్పర్శ...ఇవన్నీ కనులవిందుగా దర్శించాలంటే 

ఆ ప్రాంతాల గుండా ప్రయాణించాల్సిందే!! 
కొన్ని నగరాలు చూడటానికి కాదు అనుభూతి చెందడానికే అన్నట్టు ఉంటాయి. అలాంటి ఒక పవిత్రమైన ప్రదేశమే మధుర. ఇక్కడ రంగులు కూడా ఒక భక్తి భాషలో మాట్లాడుతాయి. ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న మధుర, యమునా నదీ తీరం నిదానంగా, ఆగిపోయిన కాలంలా ఉంటుంది. 

ఇక్కడ ప్రతి గల్లీలో కృష్ణ నామస్మరణ, ప్రతి సంధ్యలో దీపాల ప్రకాశం, ప్రతి వసంతం రంగుల ప్రణయంలా ఉంటుంది. మధుర అంటే కేవలం ఒక చరిత్ర మాత్రమే కాదు. ఇది ఒక జీవన విధానం.

కృష్ణ జన్మభూమి వైభవం
మధురలో ప్రయాణం ప్రారంభమయ్యే ప్రదేశం శ్రీ కృష్ణ జన్మభూమి. ఆ ప్రాంతంలో నడుస్తుంటే అక్కడి ప్రాచీన శిల్పం, మందిర గోపురాలను చూస్తుంటే మది నిండా ప్రశాంతమైన భావం కలుగుతుంది. ఇక్కడ సంధ్యా సమయంలో శంఖ నాదం వినిపిస్తుంది. 

అలాగే భక్తుల మధ్య ఒక సమన్వయం కనిపిస్తుంది. ద్వారకాదీశ్‌ మందిరం వద్ద సంధ్యా హారతి సమయంలో దీపాల వెలుగు, భజనల్లో కలిసిన భక్తుల స్వరం ఇవన్నీ ఒక ప్యూర్‌ డివోషనల్‌ ఆరాను క్రియేట్‌ చేస్తాయి.

యమునా తీరంలో నిశ్శబ్ద వేదం
విశ్రామ్‌ ఘాట్‌ దగ్గర ప్రతి ఉదయం యమునా తీరాన్ని తాకే సూర్యుడి కిరణాలు కనులకు ఆనందాన్ని, మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. నదిపై అలా అలా సాగుతున్న తెప్ప, నీటిపై ప్రతిబింబించే ఆకాశం, నిదానంగా సాగే జీవితం. ఇదే అక్కడి ప్రతి ఉదయం కనిపించే దృశ్యం. ఇక్కడ నడుస్తుంటే మధుర అనేది ఒక ప్రదేశంలా కాదు, ఒక ఫీలింగ్‌ అని అనిపిస్తుంది. ఇక్కడ ప్రయాణం అంటే వేగం కాదు, కాలానికి తగిన విలువ అనిపిస్తుంది. 

బ్రజ్‌ భూమిలో రంగుల ఋతువు
మధురలో హోలి అంటే పండుగ కాదు. ఒక జీవితోత్సవం. వసంత కాలంలో నగరం మొత్తం రంగులతో నవ్వుతుంది. గులాల్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే గీతాలు, భజనల మధ్య ప్రతి గాలిలో ఉత్సాహం కనిపిస్తుంది. బర్సానా, వృందావన్‌ ప్రాంతాలు హోలి సందర్భంగా ప్రత్యేక వాతావరణం క్రియేట్‌ చేస్తాయి. 

రాధాకృష్ణుల మధుర స్మృతులు, రంగుల మధ్య భక్తి భావం, నగరం మొత్తం ఒక వేదికలా మారుతుంది. ఇక్కడ హోలి అంటే రంగులతో ఆడే ఒక క్రీడ మాత్రమే కాదు. ఒక పరంపర. ఒక సంప్రదాయం. ఒక ఆచారం. కాలం అందించే ఆనందానికి ప్రతీక కూడా.

‘రాధే రాధే’ అనే పలుకే మధురం...
మధుర అనగానే ముందుగా అక్కడి ‘పెడా’గుర్తుకు వస్తుంది. అయితే దీంతోపాటు అక్కడి ప్రత్యేక అల్పాహారాన్ని రుచి చూడడం మర్చి΄ోవద్దు. పెడా, లస్సీ, చాట్‌ లాంటి తినుబండారాలు నగరంలో ప్రతి చోట సులభంగా లభిస్తాయి. స్థానికుల జీవితంలో భాగమైన వీటిని ఆస్వాదిస్తూ మీరు కూడా కాసేపు అక్కడి స్థానికులుగా మారిపోవచ్చు.

పర్యాటకులు ఎక్కడికి వెళ్తున్నా అక్కడి స్థానికుల్లా జీవిస్తేనే పర్యటనలోని అందమైన అనుభూతులను సొంతం చేసుకోగలరు. అందుకే అంటారు రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలి అని. అలాగే మధురలో ఉన్నప్పుడు మధురవాసిలా మారిపోవాలి. ఇక్కడ ప్రతి గల్లీలో ఒక మిఠాయి దుకాణం, అందులో చిరునవ్వు చిందిస్తూ ‘‘రాధే రాధే’’ అని పలకరించే వ్యాపారి కనిపిస్తాడు. మీరు కూడా ‘రాధే రాధే’ అని పలకరించండి.

చేయాల్సిన పనులు
మధురలో యమునా తీరంలో ఉదయానే కాసేపు అలా తిరగడం ఒక చక్కని అనుభూతిని అందిస్తుంది. అందుకే ఏ కొత్త ప్రాంతానికి వెళ్లినా మార్నింగ్‌ వాక్‌ చేసే అవకాశాన్ని ఎవరూ మిస్‌ చేయకూడదు. ఇది ఎవరూ చెప్పని ఒక ట్రావెల్‌ హ్యాక్‌.

వీటితోపాటు సాయంత్రం సమయంలో హారతి చూడటం, గోవర్ధన గిరి పరిక్రమ చేయడం, హోలీ సందర్భంగా రంగుల మధ్య భజనలు వినడం, బృందావన్‌లో సంధ్యా సమయాన భక్తి గీతాలను వినడం ఇవన్నీ మధుర ప్రయాణంలో నిదానంగా మనసును హత్తుకునే విషయాలుగా మిగిలిపోతాయి.

సందర్శనీయ స్థలాలు
మధుర అనేది ఆ నందకిశోరుడు, అతని భక్తుల ప్రపంచం. ఇక్కడ బృందావన్‌లో బాంకే బిహారీ ఆలయం, గోవర్ధన పర్వతం, గోకులం, బర్సానా లాంటి ప్రదేశాలు కనిపిస్తాయి. ప్రతి ప్రదేశానికి ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి గల్లీకి ఒక కథ ఉంటుంది. 

ప్రతీ వీధిలో ఒక ఙ్ఞాపకాల నిధి ఉంటుంది. గోవర్ధన పరిక్రమ సమయంలో భక్తులు నిదానంగా నడుస్తూ భక్తిలో నిమగ్నమవుతారు. గోకులంలో బాల కృష్ణుడి లీలల గురించి భక్తులు మాట్లాడే విషయాలు మీరు ఇగ్నోర్‌ చేయలేరు. బృందావన్‌ వీధుల్లో ప్రతి సంధ్యా సమయంలో భజనలు వినిపిస్తాయి.

ఎలా వెళ్లాలి ?

ఢిల్లీ నుంచి రైలు, రోడ్డు మార్గంలో మధురకు సులభంగా చేరుకోవచ్చు.

రైలు యాత్రలో యమునా నది పక్కనే కనిపించే దృశ్యాలు ప్రయాణాన్ని మరింత మనోహరంగా మార్చేస్తాయి. 

ఆగ్రా, ఢిల్లీ నుంచి రోడ్డుమార్గంలో సాగే ప్రయాణం .. బ్రజ్‌ భూమిలో అడుగుపెడుతూనే  ఆనందానుభూతిని కలిగిస్తుంది.

ఎక్కడ ఉండాలి ?
మధురలో చిన్నా పెద్ద ధర్మశాలల నుంచి ఆధునిక హోటల్స్‌ వరకు అనేక వసతి సదు΄ాయాలు ఉన్నాయి. యమునా తీరం దగ్గర ఉన్న వసతి స్థలాలు సంధ్యా సమయంలో ప్రత్యేక ప్రశాంతతను ఇస్తాయి. మీరు అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకుంటే నదీతీరంలో ఉన్న హోటల్స్‌లో తక్కువ ధరకే రూమ్స్‌ లభించే అవకాశం ఉంది. అందుకే ట్రైన్‌ లేదా ఫ్లైట్‌ టికెట్స్‌ వంటివి బుక్‌ చేసుకునే సమయంలో రూమ్స్‌ కూడా బుక్‌ చేసుకోవడం ఒక మంచి ప్రయాణికుడి లక్షణం. 

ఏం చూడాలి ? 
మధుర ప్రయాణికులకు ఒక మధురమైన అనుభూతిని కల్పిస్తుంది. ఇక్కడికి వస్తే మీరు కృష్ణ జన్మభూమి, ద్వారకాదీశ్‌ మందిరం, విశ్రామ్‌ ఘాట్, బృందావన్, గోవర్ధన్‌ వంటి అనేక ప్రదేశాలను కవర్‌ చేయవచ్చు. 

ఈ యాత్రను మధురంగా మార్చుకోవాలి అనుకుంటే చెక్‌ లిస్ట్‌ పెట్టుకుని వివిధ ్ర΄ాంతాలను అన్వేషించడం కన్నా ప్రశాంతంగా ఒక్కో ప్రాంతాన్ని ఫీల్‌ అవ్వాలి. ఎందుకంటే మధుర అనేది పర్యాటక ప్రదేశం కన్నా ముందు ఒక పవిత్రమైన ప్రాంతం. ఇక్కడ ప్రతి ప్రదేశం భక్తి, శిల్పకళ, సంప్రదాయం కలిసి ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి.

– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు  

(చదవండి: Munnar Tourist Place: "పచ్చందనమే పచ్చదనమే"..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement