జడ్చర్లలోని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఘటన
జడ్చర్ల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రతా లోపానికి సంబంధించి మరో ఘటన వెలుగు చూసింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామానికి చెందిన పోలే భీమేశ్వర్ (33) ఆదివారం ప్రమాదవశాత్తు గ్రామ శివారులోని చెరువులో పడి మృతిచెందాడు. సోమవారం ఉదయం పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
అయితే డాక్టర్ వచ్చేలోగా ఓ వీధి కుక్క మార్చురీలోకి వెళ్లి భీమేశ్వర్ మృతదేహాన్ని పీక్కుతింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు సెల్‌ఫోన్‌లో వీడియోలు తీసి సామాజిక మాధ్యమా ల్లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. ఈ ఘట నతో భీమేశ్వర్ కుటుంబ సభ్యులు కలత చెందా రు. ఇలాంటి అమానవీయమైన ఘటన చోటు చేసు కోవడంతో వారు మరింత ఆవేదనకు గురయ్యారు.
కొత్త ఆస్పత్రి మార్చురీని వినియోగిస్తాం..
భీమేశ్వర్ మృతదేహాన్ని కుక్క పీక్కుతిన్న ఘటన నేపథ్యంలో ఇకపై వంద పడకల ఆస్పత్రి భవనం వద్ద కొత్తగా నిర్మించిన మార్చురీని వినియోగిస్తామని సూపరింటెండెంట్ చంద్రకళ తెలిపారు. మార్చురీ దగ్గర భద్రతకు సంబంధించి సెక్యూరిటీ గార్డు ఉన్నాడని చెప్పారు. అయితే మార్చురీ గది తాళం చెడిపోవడంతో బాగు చేయించేందుకు బయటకు వెళ్లిన సమయంలో వీధి కుక్క లోపలికి వెళ్లిందని ఆమె వివరించారు.
ఇది బాధాకర ఘటన
బాదేపల్లి మార్చురీలో మృతదేహాన్ని వీధి కుక్క పీక్కుతిన్న ఘటన బాధాకరమని ఎమ్మెల్యే అనిరు«ద్‌రెడ్డి అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరినట్లు చెప్పారు.


