ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమమే ప్రధాన ఎజెండా
జనగణన–2027 నిర్వహణ, భూసేకరణ అంశాలు
ఐఏఎస్‌ల పనితీరును ప్రత్యేకంగా సమీక్షించనున్న సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. సచివాలయంలోని ఏడో అంతస్తులో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సుదీర్ఘంగా ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు స్వాగతోపన్యాసంతో సదస్సు ప్రారంభం కానుంది. అనంతరం 9.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జనగణన–2027 తొలి విడత కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి జూన్ 9 మధ్య చేపట్టే రాష్ట్రంలో గృహాల గణన నిర్వహణపై రాష్ట్ర జనగణన అధికారి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన 34 ప్రశ్నలతో గృహాల గణన నిర్వహణకు 89వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
భోజన విరామం అనంతరం 1.45 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించనున్నారు. 2 నుంచి 2.30 గంటల వరకు ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’కార్యక్రమం నిర్వహణపై ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలో కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. 2.30 నుంచి 4 గంటల మధ్య 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వైద్యారోగ్య, విద్య, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో కలెక్టర్లకు సూచనలు జారీ చేయనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుదల కోసం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.
సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, అటవీ అనుమతుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్లకు నిర్దేశించనున్నారు. నీటిపారుదల, రోడ్లు, భవనాలు, రవాణా, అటవీ, రెవెన్యూ, ఐటీ, పరిశ్రమలు, టీజీఐఐసీ విభాగాల ఉన్నతాధికారులు కలెక్టర్లకు అవగాహన కలి్పంచనున్నారు. చివరకు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు రేవంత్ కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడనున్నారు. జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల కార్యదర్శుల పనితీరును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి దిద్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశించనున్నట్టు తెలిసింది.


