బ్యాంకులో దోపిడీకి యత్నం | - | Sakshi
Sakshi News home page

బ్యాంకులో దోపిడీకి యత్నం

Mar 3 2026 9:37 AM | Updated on Mar 3 2026 9:37 AM

చౌటుప్పల్‌ : మండల పరిధిలోని ఎల్లంబావి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి యత్నించారు. గ్యాస్‌ కట్టర్‌తో బ్యాంకు షట్టర్‌ను కట్‌ చేస్తుండగా అలారం మోగడంతో అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లంబావి(పాత కొయ్యలగూడెం) గ్రామంలో హైదరాబాద్‌–విజయవాడ హైవే సర్వీసు రోడ్డులో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు వైపు సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ వైపు నుంచి ముగ్గురు వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించి బైక్‌పై వచ్చారు. అదే సమయంలో మరో ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు కూడా బ్యాంకు వైపు వచ్చారు. ఈ దృశ్యాలు రోడ్డు వెంట ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

సీసీ కెమెరాకు నలుపు రంగు స్ప్రే చేసి..

అయితే బ్యాంకు వద్దకు మాత్రం ఒకే వ్యక్తి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాకు నలుపు రంగు స్ప్రే చేశాడు. మిగతా వారు రెక్కీ నిర్వహిస్తుండగా.. ఒక వ్యక్తి మాత్రం బ్యాంకు ప్రధాన ద్వారం వద్ద ఇనుప గ్రిల్‌ తాళం పగులగొట్టాడు. అనంతరం షట్టర్‌ను గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేస్తుండగా.. ఒక్కసారిగా అలారం మోగింది. దీంతో చుట్టుపక్కల నివాసముండేవారు ఇళ్ల నుంచి బయటకు రావడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు బ్యాంకు వద్దకు చేరుకుని.. దుండగులు దోపిడీకి యత్నించినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే బ్యాంకు వద్దకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి, సీఐ మన్మథకుమార్‌ సందర్శించారు. క్లూస్‌ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. అయితే ఈ దోపిడీకి యత్నించింది ఎంత మంది అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ముసుగులు ధరించి

బైక్‌లపై వచ్చిన దుండగులు

గ్యాస్‌ కట్టర్‌తో షట్టర్‌ కట్‌ చేస్తుండగా మోగిన అలారం

స్థానికులు అప్రమత్తమవ్వడంతో

పారిపోయిన దొంగలు

చౌటుప్పల్‌ మండలం ఎల్లంబావిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement